టీఆర్ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడు చెరుకు సుధాకర్ అరెస్ట్ పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన్ని తక్షణమే విడుదల చేయాలని గురువారం ఆదేశించింది. సుధాకర్ నిర్బంధం అక్రమమని కోర్టు అభిప్రాయపడింది. కాగా న్యాయస్థానం తీర్పుపై తెలంగాణ న్యాయవాదుల జేఏసీ హర్షం వ్యక్తం చేసింది. పీడీయాక్ట్ కింద చెరుకు సుధాకర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. తరువాత దాన్ని నాసా కిందకు మార్చారు. ఈ నెల 6న ప్రభుత్వం సుధాకర్ కు 12 నెలల నిర్భంధం విధిస్తూ జీవో వెలువరించింది.
ఒక పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడిపై నాసా చట్టాన్ని ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని కోర్టు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసి బెయిల్ మంజూరు చేసింది. వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. జస్టిస్ గోపాల్‌రెడ్డి, జస్టిస్ కాంతారావుతో కూడిన బెంచ్ ఈ తీర్పునిచ్చింది. చెరుకు సుధాకర్‌పై పెట్టిన కేసుకు వ్యతిరేకంగా హైకోర్టుకు వెళ్లి విజయం సాధించిన తెలంగాణ అడ్వకేట్ జేఏసీ హర్షం వ్యక్తం చేసింది. ఈ తీర్పు ప్రజాసామ్య విజయమని వర్ణించింది. కిరణ్ సర్కార్‌కు ఇది చెంపపెట్టులాంటి తీర్పని అన్నారు. హైకోర్టుకు టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.