12, ఆగస్టు 2011, శుక్రవారం

14ఎఫ్‌ను తొలగిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు


14ఎఫ్‌ను తొలగిస్తూ శుక్రవారం రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మేరకు నోటిఫికేషన్ కూడా  విడుదలైంది. 14 ఎఫ్ రద్దుతో ఇక హైదరాబాద్ ఫ్రీజోన్ కాకుండా ఆరో జోన్ పరిధిలోకి రానుంది. ఆరో జోన్‌లో హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, నల్గొండ, నిజామాబాద్ జిల్లాలు ఉన్నాయి. ఎస్‌ఐ రాతపరీక్షలకు ముందు రోజే కేంద్రం 14ఎఫ్‌పై కీలక నిర్ణయం తీసుకుంది.  సీఎం కార్యాలయంకు సమాచారం అందినట్లు అధికారులు ప్రకటించారు.
14ఎఫ్‌ రద్దుకోసం గత కొన్నేళ్లుగా తెలంగాణలో  ఆందోళనలు సాగుతున్నాయి. గత కొంతకాలంగా అవి తీవ్ర రూపం దాల్చాయి. దీంతో కేంద్రం దీన్ని సీరియస్ గా తీసుకుంది.  ఈ నెల 13, 14న రాష్ట్రంలో ఎస్సై రాత పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే  14ఎఫ్‌ రద్దు చేయనిదే పరీక్షలు  రాసేది లేదని తెలంగాణ వాదులు పట్టుబట్టారు.  ఈ నేపథ్యంలో కేంద్రం తొందరగా స్పందించి పరీక్షలకు ముందే ఉత్తర్వులు జారీ చేసింది. గతంలోనే అసేంబ్లీ తీర్మానం చేయడంతో నిర్ణయం తొందరగా వెలువడింది.
తెలంగాణ ప్రజల చారిత్రక విజయం
14ఎఫ్ తొలగింపు చేస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు విడుదల చేయటం తెలంగాణ ప్రజలు సాధించిన చారిత్రక విజయం అని తెలంగాణ విద్యార్థి, రాజకీయ, ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రకటించింది. ఇదే స్ఫూర్తితో తెలంగాణను కూడా సాధించుకుంటామని టీఆర్‌ఎస్ నేత హరీష్‌రావు, రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాం తెలిపారు. ఇది తెలంగాణ ప్రజల, నాయకుల ఐక్యతకు నిదర్శనమని అని నాగం జనార్ధనరెడ్డి అన్నారు.  తెలంగాణ సాధించేవరకు ఈపోరాటం కొనసాగుతుందని తెలిపారు.

1 కామెంట్‌:

  1. 14Fని రద్దు చేసినంతమాత్రాన కేంద్ర ప్రభుత్వానికి నిజాయితీ ఉందని నమ్మలేము. ముల్కీ నిబంధనలు తిరిగి అమలు చేసి ప్రజలకి ప్రత్యేక రాష్ట్రం గురించి ఆలోచనలు తిరిగి రాకుండా చెయ్యాలనుకుంటున్నారు. శ్రీకృష్ణ కమిటీ కూడా ముల్కీ నిబంధనలు తిరిగి అమలు చెయ్యాలని సలహా ఇచ్చింది కదా.

    రిప్లయితొలగించండి