28, అక్టోబర్ 2011, శుక్రవారం

బాబూ నీది బినామీ బతుకు : కేసీఆర్

చంద్రబాబు నీది బినామీ బతుకు, బినామీలను పెట్టుకుని బతకాల్సిన ఖర్మ నాకు పట్టలేదు.
దోచుకున్న సొమ్ము, దాచుకున్న ఆస్తులు నా దగ్గర లేవు. దమ్ముంటే అవినీతి మీద చర్చకు రా అంటూ టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు టీడీపీ అధినేత  చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. గురువారం టీఆర్‌ఎస్ పై, తనపై చంద్రబాబు చేసిన ఆరోపణలపై ఆయన తీవ్రంగా స్పందించారు.
తాను నమస్తే తెలంగాణ దిన పత్రికలో రూ.4 కోట్లు, టీ న్యూస్‌లో రూ. 55 లక్షలు పెట్టుబడులు పెట్టానని తెలిపారు. ఈ డబ్బంతా మాజీ ఎంపీ వినోద్ తమ్ముని వద్ద అప్పు తీసుకున్నానని స్పష్టంచేశారు. తనకు ఉన్నది 24 ఎకరాల భూమేనని, హైదరాబాద్, కరీంనగర్‌లో ఒక ఇళ్లు మాత్రమే ఉందని తెలిపారు. తాను పెట్టిందంతా పూర్తిగా  వైట్ మనీ అని, నమస్తే తెలంగాణ ఎండీకి తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఆయనకు బయట వ్యాపారాలు ఉంటే ఆయన వ్యక్తిగతమని,  దానికి మేం ఏం చేయాలని  ప్రశ్నించారు. బాబులా నల్లధనంతో పెట్టుబడులు పెట్టలేదని విమర్శించారు.
గత ఐదారు రోజులుగా చంద్రబాబు తొట్టిగ్యాంగ్ కారు కూతలు కూస్తుందని,   చంద్రబాబు ఇంటి పేరు నమ్మక ద్రోహం, ఒంటి పేరు నయవంచన, అసలు పేరు కుంభకోణం అని ధ్వజమెత్తారు.   బాబు  అవినీతిపై పుంకానుపుంఖాలుగా పుస్తకాలు వచ్చాయని చెప్పారు. అడుగుదీసి అడుగెస్తే బాబుది బినామీ బతుకు అని అన్నారు. నమస్తే తెలంగాణ పత్రికను చూసి తెలంగాణకు ఒక పత్రిక ఉండొద్దు, మీ బండారం బయటపడొద్దని కుటిల ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. తెలంగాణ టీడీపీ నేతలు ఆత్మలు అమ్ముకుని బాబు బూటు పాలీష్ చేస్తున్నారని ఆరోపించారు.
యూపీఏలో మంత్రిగా ఉన్నప్పుడు పోలవరంపై సోనియాకు ఫిర్యాదు చేశానని స్పష్టం చేశారు. పోలవరంపై నిరంతరం కొట్లాడేది టీఆర్‌ఎస్ పార్టీ అని తెలిపారు. పోలవరంపై హై కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు వెళ్లాం అని తెలిపారు. టెండర్లు వేసే అలవాటు బాబుకు ఉందన్నారు. చంద్రబాబు ఫోటో పక్కన అన్నాహజారే ఫోటో చూస్తే దయ్యాలు నవ్వుతాయని అన్నారు.

27, అక్టోబర్ 2011, గురువారం

చంద్రబాబు రాజకీయ వ్యభిచారి

కాంగ్రెస్  అన్యాయాలు చేస్తుంటే ప్రతిపక్ష నేతగా ఎందుకు ప్రశ్నించడం లేదని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ను విమర్శిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై టీఆర్‌ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడు నాయిని నర్సింహరెడ్డి విరుచుకుపడ్డారు.
 చంద్రబాబు ముఖ్యమంత్రితో కుమ్మకై తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేసేందుకు కుట్ర పన్నారని విమర్శించారు.  కేసీఆర్‌పై ఆరోపణలు చేస్తే  బాబును తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని చెప్పారు. అవినీతి, అక్రమాలు భయటపడుతాయని రహస్యంగా చిదంబరంను కలిసి బాబు రాజకీయ వ్యభిచారానికి పాల్పడ్డారని అన్నారు. 
చంద్రబాబు ప్రభుత్వ కాలంలో రైతుల అష్టకష్టాలు పడ్డారని, రైతుల నడ్డి విరించింది చంద్రబాబే అని నాయిని ఆరోపించారు. మళ్లీ చంద్రబాబే రైతులపై మొసలి కన్నీరు కార్చడం విడ్డూరమన్నారు. తెలంగాణలో చంద్రబాబు పర్యటిస్తే జరుగబోయే పరిణామాలకు ఆయనే బాధ్యత వహించాలని  హెచ్చరించారు. చందాలు వసూలు చేయకుండా చంద్రబాబు పార్టీని నడుపుతున్నారా అని నాయిని ప్రశ్నించారు.
మరోవైపు చంద్రబాబుకు దమ్ముంటే కేసీఆర్ ఆస్తులపై బహిరంగ చర్చలకు రావాలని టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు జగదీష్‌రెడ్డి సవాల్ విసిరారు. కేసీఆర్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా చర్చకు వస్తారని స్పష్టం చేశారు. తెలంగాణ టీడీపీ నేతలకు దమ్ముంటే బాబును చర్చలకు తీసుకురవాలన్నారు. తామే జూబ్లీ హాల్‌లో సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు. రైతుల వంకతో బాబు తెలంగాణ అడుగుపెట్టాలని చూస్తున్నారని చెప్పారు. మోత్కుపల్లి నర్సింహులు దళిత కార్డు అడ్డం పెట్టుకొని ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పప్పెట్ షో ఆడిస్తుంటే ఒక బ్రోకర్, ఒక జోకర్, ఒక పిట్టల దొరలా ఆడుతున్నారన్నారు.

20, అక్టోబర్ 2011, గురువారం

గొంగట్లో తింటూ వెంట్రుకల గురించా ?

‘గొంగడిలో కూర్చోని తింటూ వెంట్రుకలు వస్తున్నాయి’ అంటే ఎలా ?, ప్రస్తుతం మనం ఉన్నది
పెట్టుబడిదారి వ్యవస్థలోనే, ముందు తెలంగాణ రాష్ట్రం వస్తే సామాజిక తెలంగాణ అనే విషయం గురించి మాట్లాడవచ్చని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ మాదిగకు సూచించారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులు, ప్రజలు మమేకమై పోరాడుతుంటే మందకృష్ణ వ్యవహరిస్తున్న తీరు అభ్యంతరకరంగా ఉందని అన్నారు.
తెలంగాణ కోసం చారిత్రాత్మక ఉద్యమం చేస్తున్న ఉద్యోగులకు అండగా నిలవకుండా మంత్రి జానారెడ్డి సోనియాగాంధీ, ముఖ్యమంత్రి కిరణ్ లతో కుమ్మక్కయి ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.  ఉద్యమం చల్లారిందని సీమాంధ్ర నేతలు హేళన చేస్తుంటే, కేకే వంటి వారు సానుకూల సంకేతాలు అందాయని అవగాహన లేని వ్యాఖ్యలు చేయడంతో ఉద్యమంలో అలజడి నెలకొంటోందన్నారు.
సమయాన్ని బట్టి ఉద్యమ పంథా మార్చాలని పరిస్థితుల దృష్ట్యా ఎత్తుగడలు కూడా మార్చాలని సూచించారు. 2004, 2009లో టీఆర్‌ఎస్‌తో పొత్తుపెట్టుకున్న టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు తెలంగాణ వ్యతిరేకంగా మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు.గ్రామస్థాయిలో ఉద్యమం జరుగుతోంటే రెండో ఎస్సార్సీ గురించి మాట్లాడమడడమంటే ‘పడుకున్న గాడిదను లేపి తన్నించుకోవడమే’ అని అన్నారు.వస్తున్నాయంటే ఎలా? ప్రస్తుతం పెట్టుబడిదారి వ్యవస్థలోనే ఉన్నామని, రాష్ట్రం సాధించుకున్న తర్వాత సామాజిక తెలంగాణపై చర్చించాలి.’ అని సూచించారు.

విచారణకు సోనియాపై పిటీషన్



తెలంగాణ ప్రజలను సోనియా గాంధీ మోసం చేశారని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్‌ను పాటియాలా కోర్టు విచారణకు స్వీకరించింది. హైదరాబాద్‌కు చెందిన అరుణ్‌కుమార్ అనే న్యాయవాది రెండు రోజుల క్రితం పాటియాల కోర్టులో పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ రోజు పిటిషనర్ వాదిస్తూ సాక్ష్యాలను, అమరవీరుల కుటుంబాల తల్లిదండ్రులను కోర్టులో ప్రవేశపెడుతానని తెలిపారు. మొత్తం 14 అభియోగాలతో నమోదైన పిటిషన్‌ను కోర్టు విచారించింది. కేసును నవంబర్ 15కు వాయిదా వేసింది.
ఢిల్లీకి టీఎన్‌జీవో నేతలు ?
తెలంగాణలో జరుగుతున్న సకల జనుల సమ్మెను విరమింపజేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. సమ్మె విరమణ కోసం టీఎన్‌జీవో నేతలను చర్చలకు ఢిల్లీకి తీసుకెళ్లాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. . ప్రధాని, ముఖ్యనేతలతో చర్చలకు ఏర్పాటుచేయాలని యోచిస్తోంది. గతంలో ఉద్యోగ సంఘాలకు ఇచ్చిన హామీని నెరవేర్చుకునేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు తమతో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆహ్వానం అందలేదని తెలంగాణ ఎన్జీవో నేతలు తెలిపారు. ఉద్యోగులపై రైల్వే యాక్ట్ కింద నమోదైన కేసుల వివరాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వివరించినట్లు వారు చెప్పారు. తమని ప్రభుత్వం ఢిల్లీకి తీసుకెళ్తుంది అని వస్తున్న వార్తల గురించి తెలియదు అని ఉద్యోగులు తెలిపారు.
సకల జనుల సమ్మె కొనసాగుతుందని తెలంగాణ ఉద్యోగ సంఘాల నేత స్వామిగౌడ్ తెలిపారు. సమ్మె సందర్భంగా తమ ప్రాంత ఉద్యోగులపై పెట్టిన కేసుల వివరాలను రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి అందజేశామని ఆయన తెలిపారు. ప్రధాన కార్యదర్శి పంకజ్ ద్వివేదితో సమావేశం తర్వాత స్వామిగౌడ్ విలేకరులతో మాట్లాడారు.

28, సెప్టెంబర్ 2011, బుధవారం

తెలంగాణతో కర్నూలు, అనంతపురం !


తెలంగాణ ప్రత్యేకరాష్ట్రం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అంతర్గతంగా చర్చలు జరుపుతోందా ? ముస్లింలు అధికంగా గల కర్నూలు, అనంతపురం జిల్లాలను తెలంగాణలో కలపాలని ఎంఐఎం పార్టీ పట్టుబడుతుందా ? ఈ నేపథ్యంలోనే కేసీఆర్ తో మంగళవారం ఎఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్  ఓవైసీ భేటీ అయ్యారా ? అవును ఈ ప్రశ్నలన్నింటికీ కేసీఆర్ తో అసదుద్దీన్ ఓవైసీ భేటీ, బుధవారం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు బలం చేకూరుస్తున్నాయి.

గతం నుండి రాయలసీమ నేతలు టీజీ వెంకటేష్, జేసీ దివాకర్ రెడ్డిలు తెలంగాణతో కలిపే రాయలసీమను ఉంచాలని, తాము కోస్తాంధ్ర కలిసి ఉండే ప్రసక్తిలేదని అంటున్నారు. రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలని ఎంఐఎం పార్టీ డిమాండ్ చేస్తోంది. దీంతో పాటు తెలంగాణలో కర్నూలు, అనంతపురం జిల్లాలను కలపడం మూలంగా తెలంగాణకు 147 అసేంబ్లీ స్థానాలు, 21 ఎంపీ స్థానాలు సమంగా ఉంటాయి. దీనినే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుందని తెలుస్తోంది. అయితే ఆంధ్ర ప్రాంతంతో కలిసేందుకు మిగతా సీమ జిల్లాలయిన కడప, చిత్తూరులు సిద్దపడతాయా ? అన్నదే ప్రశ్నార్ధకంగా మారింది. దీంతో పాటు తెలంగాణ జిల్లాల ప్రజలు సీమ జిల్లాలను కలుపుకునేందుకు అంగీకరిస్తారా ? అన్నది ప్రశ్నార్ధకమే. అయితే రాష్ట్రం  ఇచ్చే ముందు కేంద్రం తనను చర్చలకు పిలుస్తుందని అన్నారు. తలకాయ తెగిపడినా హైదరాబాద్‌ లేని తెలంగాణను అంగీకరించబోమని కేసీఆర్‌ స్పష్టం చేశారు

28, ఆగస్టు 2011, ఆదివారం

రోశయ్య ఆడిన ‘దొంగాట’



కేంద్రం ప్రకటించిన తెలంగాణను అప్పుడు ముఖ్యమంత్రిగా  ఉన్న రోశయ్య అడ్డుకున్నాడా ? తెలంగాణ కొరకు రాష్ట్ర అసేంబ్లీలో తీర్మానం చేసి పంపాలన్న అధిష్టానం సూచనలను పక్కకు పెట్టి తీర్మానం చేయించలేనని తన వ్యూహంలో భాగంగానే అడ్డుకున్నాడా ?  ఒకసారి అసేంబ్లీలో తీర్మానం చేస్తే తెలంగాణ ఏర్పాటు అవుతుందని సుధీర్ఘ రాజకీయ అనుభవం  ఉన్న రోశయ్య గ్రహించాడా ?  అప్పటికి కేవలం అఖిలపక్ష తీర్మానం చేయించి ఢిల్లీకి పంపిన రోశయ్య డిసెంబరు 9న కేంద్రం తెలంగాణను ప్రకటించగానే సీమాంధ్రలో మొదలయిన ఉద్యమంపై కేంద్రానికి తప్పుడు నివేదికలు పంపి తిరిగి డిసెంబరు 23న తెలంగాణపై కేంద్రం యూ టర్న్ తీసుకునేలా పథకం వేశాడా ?
అవును ..పైన అనుమానించిన ప్రశ్నలన్నీ అక్షరాల నిజం. కావాలని చెప్పాడా ? లేక తనను అసమర్ధునిగా భావించిన రాష్ట్ర ప్రజలకు తాను అపర చాణక్యుడిని అని చాటుకునేందుకు చెప్పాడా ? సీమాంధ్రలో తన ఇమేజ్ ను పెంచేందుకు చెప్పాడా ? అన్న విషయం పక్కన పెడితే తెలంగాణ రాకుండా రోశయ్య వేసిన పాచిక మాత్రం చాలా గట్టిదే. దీనికి తెరవెనుక చంద్రబాబు సహకారం ఉండి ఉంటుందన్న దానిలోనూ  ఎలాంటి అనుమానాలు ఉండనక్కర లేదు. అయితే ఇన్ని రోజులకు అప్పుడు జరిగిన విషయాన్ని రోశయ్య ఆంధ్రజ్యోతి ఛానల్  ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’లో వెల్లడించాడు.
తెలంగాణ ప్రత్యేకరాష్ట్రం కోసం 11 రోజులుగా కేసీఆర్ నిరసన దీక్ష చేపట్టడంతో ఎప్పటి నుండో తెలంగాణ ప్రజలు డిమాండ్ చేస్తున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది. అందుకే దీనిని సోనియాగాంధీ జన్మదిన కానుకగా ప్రకటించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రోశయ్యను తీర్మానం చేసి పంపాలని సూచించింది. అయితే అసేంబ్లీలో తీర్మానం ఒక్కసారి చేస్తే ఎప్పటికయినా ముప్పేనని గ్రహించిన రోశయ్య కేవలం అఖిలపక్ష తీర్మానంతో సరిపెట్టారు. తరువాత తెలంగాణ ప్రకటనను వెనక్కి తీసుకునేలా చేశారు.
రాష్ట్రాన్ని విడగొట్టిన ముఖ్యమంత్రిగా, రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రిగా జీవితకాలంలో తనకు సీమాంధ్రలో మచ్చ వస్తుందని, భవిష్యత్ తరాలు తనను ఎలా గౌరవిస్తాయోనని భావించిన రోశయ్య మొత్తానికి గొప్పగానే చక్రం తిప్పాడు. మెల్లగా తాను ఆడిన ‘దొంగాట’ను బయటపెట్టాడు.
 తెలంగాణ ప్రజలను మోసంచేసిన రోశయ్య తెలంగాణలో వందలమంది విద్యార్థల  ఆత్మహత్యలకు కారకుడయ్యాడు. అప్పట్లో కాసు బ్రహ్మానందరెడ్డి కాల్పులు జరిపించి తెలంగాణ విద్యార్థులను పొట్టన పెట్టుకుంటే రోశయ్య వెన్నుపోటు పొడిచి తన పని కానిచ్చాడు. మోసం చేసేవాన్ని నమ్మొచ్చు కాని నమ్మించి మోసం చేసేవాన్ని అసలు నమ్మొద్దు జాగ్రత్త మిత్రులారా ? తెలంగాణ  ఉద్యమంలో రాళ్లుంటాయ్..సీమాంధ్ర ముళ్లుంటాయ్. జై తెలంగాణ జై జై తెలంగాణ

27, ఆగస్టు 2011, శనివారం

గర్జించిన ‘గద్వాల’: మార్మోగిన తెలంగాణం


సీమాంధ్ర ముఖ్యమంత్రి పర్యటన తమకు అవసరం లేదని గద్వాలలో తెలంగాణ వాదులు, విద్యార్థులు భారీగా ర్యాలీ నిర్వహించారు. అడుగడుగునా పోలీసులు అడ్డంకులు పెట్టినా, కళాశాలలకు తాళాలు వేసినా, తెలంగాణ వాదులను అరెస్టు చేసినా, మంత్రి డీకే అరుణ హెచ్చరించినా  అన్నింటినీ దాటుకుని విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. ముఖ్యమంత్రి సభలో యువకులకు ఉద్యోగాలు ప్రకటించగానే మా ఉద్యోగాలు మేము చేసుకుంటామని, సీమాంధ్ర పాలన అక్కరలేదని నినాదాలు చేశారు.
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పాలమూరు జిల్లాకు యువ కిరణాలు పథకం కింద రాబోయే మూడేళ్లలో 70 వేల ఉద్యోగాల వస్తాయని చెప్పడంతో  సభలో ఒక్కసారిగ విద్యార్థులు జై తెలంగాణ మా తెలంగాణలో మా ఉద్యోగాలు మేము చేసుకుంటాం అంటు ముఖ్యమంత్రి ప్రసంగానికి అడ్డుతగలడంతో వారిని పక్కకు తప్పించండి వారికి ఈ జిల్లాకు ఉద్యోగాలు రావడం ఇష్టం లేనట్టుంది అంటు నిరసనల మద్యనే తన ప్రసంగాన్ని కొనసాగించారు.
అంతకుముందు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పర్యటనకు వ్యతిరేకంగా  గద్వాల్‌లో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. సీఎం గోబ్యాక్ అంటు నినాదాలు చేశారు. పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 15మంది విద్యార్థులు కిరోసిన్ డబ్బాలతో వాటర్ ట్యాంక్ ఎక్కారు. ఉద్రిక్తల నడుమనే ముఖ్యమంత్రి గద్వాల్ చేరుకున్నారు.
తెలంగాణవాదులు సీఎం పర్యటనను వ్యతిరేకిస్తుండటంతో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి ముందస్తుగా విద్యార్థులను, తెలంగాణవాదులను అదుపులోనికి తీసుకున్నారు. విద్యార్థులు బయటకు రాకుండా కళాశాల గేట్లకు తాళాలు వేసారు.