12, ఆగస్టు 2014, మంగళవారం

దుష్ప్రచారాలు నమ్మొద్దు ..సమగ్ర సర్వే సకల జన హితం కోసమే ..


ఎన్యూమరేటర్ మీ ఇంటి కొస్తాడు ..మీ నట్టింటి కొస్తాడు ..మీ బెడ్ రూమ్ కొస్తాడు .మీ వంట రూమ్ కు వస్తాడు ..మీ రేషన్ కార్డు ఆపేస్తారు ..మీ ఫించను లాగేస్తారు.. మీ ఆస్తులు గుంజుకుంటారు అంటూ సీమాంధ్ర మీడియా ..తెలంగాణలో ఉన్న సీమాంధ్ర పార్టీల తొత్తు నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ప్రజలు ఏ మాత్రం నమ్మవద్దు. ఇది తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ఓ బృహత్తర కార్యక్రమం.
అక్రమార్కులను దూరం పెట్టి నిజమయిన లబ్దిదారుడు ప్రభుత్వ అండతో పైకి రావాలన్న ఆకాంక్షతో చేస్తున్న నిఖార్సయిన కార్యక్రమం.

అయితే ప్రజల్లో ఈ సర్వే విషయంలో నెలకొన్న సందేహాలు కూడా చాలానే ఉన్నాయి. 60 ఏళ్ల నుండి నెలకు ఓసారి ఇచ్చే రేషన్ కార్డు కోసమో, ఫించను కోసమో ..ఆరోగ్యశ్రీ కార్డు కోసమో ..లీటరు కిరసనాయిలు ..అద్దకిల చక్కెర, పావుకిల పప్పు ..కిల ఉప్పు ..అద్దకిల చింతపండు ..వంటి తాత్కాలిక అవసరాలకు మనల్ని బానిసలను చేసి ..మన కాళ్ల మీద మనం నిలబడే అవకాశం ఇవ్వకుండా ..కేవలం ఓట్లేసే యంత్రాలుగా చేసిన సీమాంధ్ర కుట్రలకు కాలం చెల్లింది.

తెలంగాణ జెండా ఎగిరింది. తెలంగాణ ఉద్యమపార్టీ గద్దెనెక్కింది ఇప్పుడు మన రాష్ట్రం ...మన ప్రభుత్వం. బిడ్డ ఎదిగితే తల్లికి ఎంత సంతోషమో ..ఈ రాష్ట్రంలోని పౌరుడు తన కాళ్ల మీద తాను ఎవరిమీదా ఆధారపడకుండా జీవిస్తే ఈ ప్రభుత్వానికి అంత సంతోషం. ఎదిగిన బిడ్డ ఎంతసేపూ తల్లిదండ్రుల మీద ఆధారపడి బతుకుంటే ఆ తల్లిదండ్రులకు ఎంత మానసిక ఆందోళన ఉంటుందో ..తెలంగాణ ప్రభుత్వానిది కూడా అదే ఆందోళన. అందుకే తెలంగాణ ప్రభుత్వం దీర్ఘకాలిక ప్రయోజనాలను ఆశించి అసలు ప్రజల వద్ద ఉన్నది ఏంటి ? మనం వారికి ఇవ్వాల్సింది ? ఏం చేస్తే వాళ్లు వారి కాళ్ల మీద నిలబడ గలుగుతారు ?

ఉద్యోగం ? వ్యవసాయం ? పరిశ్రమలు ? సంక్షేమ కార్యక్రమాలు ? ఏవి అందిస్తే వారికి  ఉపయోగకరంగా ఉంటుంది ? అన్నదే తెలంగాణ ప్రభుత్వం తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. ఇక్కడ ఎవరి భూములు గుంజుకోవడానికో ? మరెవరి ఆస్తులో ఆక్రమించుకోవడానికో తెలంగాణ ప్రభుత్వం ఈ సర్వేను ఉపయోగించుకోవాలనే ఆలోచనలో లేదు. కేవలం తెలంగాణ బిడ్డల అభ్యున్నతి లక్ష్యంగానే ఈ సర్వేను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతుంది. నిజంగా అక్రమంగా ఉన్న ఆస్తులు, భూములు లాగాలనుకుంటే హైదరాబాద్ లో అవి చాలా ఉన్నాయి. ఆ దిశగా ప్రభుత్వం ఇప్పటికే ముందడుగు వేసింది. కేవలం తెలంగాణ ప్రభుత్వ వ్యతిరేక మీడియా, సీమాంధ్ర నాయకుల అడుగులకు మడుగులొత్తే కొందరు స్వార్ధ రాజకీయ నాయకులు ప్రజల్లో అనవసర గందరగోళానికి తెరలేపుతున్నారు.

ఈ విషయంలో తెలంగాణ ప్రజలు ఎవరూ ఆపోహా పడాల్సిన పనిలేదు. ఉపాధి నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు భేషుగ్గా అక్కడే ఉండొచ్చు. ఇంటి వద్ద ఉన్న మీ వాళ్లతో మీ సమాచారం ఇంటికి వచ్చిన ఎన్యూమరేటర్లకు చెప్పించండి. మీకు ఎన్ని ఎకరాల భూమి ఉంది. సొంత ఇల్లు ఉందా ? లేదా ? మీ ఇంట్లో ఉన్న కుటుంబాలు ఎన్ని ? మీ బ్యాంకు ఖాతా వివరాలు ? వంటి ఇంటి స్థితిగతులను తెలియజేసే సమాచారమే తప్ప అంతకుమించింది ఏమీ లేదు. దీనిని బట్టి ప్రభుత్వానికి ప్రజలకు అందజేస్తున్న సంక్షేమ పథకాల మీద, ఇక ఇతర రంగాలలో అందించాల్సిన సేవల మీద పూర్తి అవగాహన వస్తుంది.

అందుకే ఈ నెల 19న ప్రభుత్వం చేపట్టే సర్వేకు ప్రజలు స్వచ్చంధంగా సహకరించండి. మీ సమాచారాన్ని నిర్భయంగా వెల్లడించండి. మీకు ప్రభుత్వం అండగా ఉంటుంది తప్పితే ..ఎలాంటి హానీ చేయదు. ఇది మన ప్రభుత్వం ..మనందరి ప్రభుత్వం. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం. సమగ్ర సర్వే తెలంగాణ పునర్నిర్మాణంలో ఓ మైలురాయిగా నిలిచిపోవాలి. రేపటి బంగారు తెలంగాణకు ఇది నాంది కావాలి.

జై తెలంగాణ

sandeepreddy kothapally 

10, ఆగస్టు 2014, ఆదివారం

రాధాకృష్ణ ..ఉత్త పలుకు ..తొత్తు పలుకు !


చింత చచ్చినా పులుపు చావలేదు. ఎకిలి రాతలతోని తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పట్టించే కుట్రపూరిత కథనం.
తెలంగాణ ప్రభుత్వం మీద ప్రజలలో అనుమానాలను పెంచే కుతంత్రం. తెలంగాణ ప్రభుత్వ చర్యలు తెలంగాణ ప్రజలకు నష్టం అని చెప్పాలని పించే విద్రోహపూరిత యత్నం. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఆదివారం కొత్తపలుకు శీర్షికలో అద్యంతం తెలంగాణ మీద విషంకక్కారు.

కేసీఆర్ మీద వ్యతిరేకతను ప్రదర్శించే ప్రయత్నంలో తెలంగాణ మీద ఉన్న  వ్యతిరేకతను కూడా బయటపెట్టుకున్నాడు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మీద ఉన్న స్వామిభక్తిని చాటుకున్నాడు. 'ఉల్టా చోర్ కొత్వాల్ కు డాంటే' అన్నట్లు తెలంగాణ విద్యుత్ కోటాను అడ్డుకుంటూ తెలంగాణలో విద్యుత్ కష్టాలకు కారణం అవుతున్న చంద్రబాబును పొగిడేసి కేసీఆర్ ను దోషిగా నిలబెట్టే సాహసం చేశాడు.

కేసీఆర్ కు వివిధ అంశాల మీద ఉన్న అవగాహన చూసి సమీక్షా సమావేశాలలో ఐఎఎస్ అధికారులు ఆశ్చర్యపోతుంటే వారు ఆయన తీరు మీద గుర్రుగా ఉన్నారని, సమావేశాలలో ఆయన మాట్లాడనివ్వడం లేదని వాపోతున్నారని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారు. ఇటీవల కేసీఆర్ ను తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ కలిశారు. ఆయనతో పాటు ఓ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కూడా ఉన్నారు. ఎంపీ నిధులను విడుదల చేయొద్దని, తెలంగాణ ఎంపీలం అందరం కలిసి ఓ ప్రణాళికి సిద్దం చేసుకుంటామని, ఆ తరువాత దాని ప్రకారం వాటిని వినియోగించుకుంటామని కేసీఆర్ కేంద్రానికి లేఖ రాశారట. ఎందుకు నిధులు ఆపమని లేఖ రాశారు అన్నవిషయం తెలుసుకునేందుకు వెళ్లిన ఎంపీ, కాంగ్రెస్ నేతలు చిన్న అంశం మీద కూడా కేసీఆర్ కు ఉన్న అవగాహన చూసి అచ్చెరువొందారు. కానీ రాధాకృష్ణ లాంటి వ్యక్తులు మాత్రం కేసీఆర్ ను బద్ నాం చేసే ప్రయత్నంలో ఉన్నారు.

కేసీఆర్ ఒకరి వద్దకు నేను వెళ్లడం ఏంటి ? అందరూ నా వద్దకే రావాలి అన్న ధీమాతో ఉన్నారని కేసీఆర్ ఉన్నారని ఆయన నడతను తప్పుపట్టే ప్రయత్నం చేశారు రాధాకృష్ణ. తెలంగాణ ఉద్యమం జరిగినన్ని రోజులు కేసీఆర్ ను తాగుబోతుగా చిత్రించే ప్రయత్నం చేసి తెలంగాణ ఉద్యమాన్ని దెబ్బకొట్టే ప్రయత్నం చేశారు. ఫాంహౌజ్ లో వ్యవసాయం చేస్తుంటే తప్పుడు ప్రచారం చేసి సంకలు గుద్దుకున్నారు. ఇప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తరువాత కూడా ఆయన వ్యక్తిత్వాన్ని, హుందాతనాన్ని దెబ్బతీసే ప్రయత్నం ఈ కథనంలో కనిపించింది.

బురదలో పొర్లే పంది తనతోడిదే లోకం అనుకుంటుందట. రాధాకృష్ణ కూడా ఇప్పుడు అదే స్థానంలో ఉన్నట్లు కనిపిస్తోంది. తప్పులను వెనకేసుకు రావడం, దోపిడీ దారులకు కొమ్ముకాయడం, అప్పనంగా భూములు కొట్టేయడానికి మద్దతుగా నిలుస్తూ వచ్చిన వ్యక్తికి ఎదుటి వారి ఒప్పులు కూడా తప్పులుగానే కనిపిస్తాయి. కేసీఆర్ అంటే ..తెలంగాణ అంటే నరనరాన వ్యతిరేక భావన నింపుకున్న రాధాకృష్ణకు తెలంగాణ వారి భక్తిపాటలు కూడా బూతుపురాణం లాగే వినిపిస్తుంది. ఇప్పటికి ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి మాత్రమే తెలంగాణలో ఆగిపోయింది. భవిష్యత్ లో ఆంధ్రజ్యోతి దినపత్రిక కూడా అవశేషంగా మిగిలిపోవడం ఖాయం.

sandeepreddy kothapally