31, మే 2014, శనివారం

ఎన్ని నిద్రలేని రాత్రులో ..ఎన్ని లెక్కలేని నిందలో ..!


ఒకడు ఫార్మ్ హౌజ్ పార్టీ అన్నడు ...మరొకడు తాగి తందనాలు అన్నడు ..ఒగడు వసూల్ రాజా అన్నడు ..ఇంకొకడు కుటుంబ పార్టీ అని అన్నడు ..అన్నోడు ఆంధ్రోడయినా ..ఆని పక్కన నిలవడి సంకలు గుద్దింది మన తెలంగాణకు చెందిన బానిస నేతలే. ఊరంత తెలంగాణ వైపు ఉంటే ఈ కుహానా మేథావులు మాత్రం ఆంధ్రోని చెంగువట్టుకోని తిరిగిండ్రు. అవకాశం దొరికిన ప్రతిసారి ఉద్యమనేత మీద ఆధారాలు లేని విమర్శలతో ..ఆమోదించలేని వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. వీరి పైత్యానికి సీమాంధ్ర మీడియా పైశాచికత్వం తోడయింది. 60 ఏళ్ల తెలంగాణ కలను 14 ఏళ్లలో సాకారం చేసిన కేసీఆర్ మీద ఇంకా తెలంగాణలో అనుమానాలు ఉన్నాయంటే ఇలాంటి బానిస మనస్తత్వం ఉన్న నేతలు, తెలంగాణలో పాతుకుపోయిన సీమాంధ్ర మీడియా పుణ్యమే.

2001 ఏప్రిల్ 27న తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావానికి ముందే స్వర్గీయ ప్రొఫెసర్ జయశంకర్ సాన్నిహిత్యం, మార్గదర్శనంతో ..పక్కా ప్రణాళికతో కేసీఆర్ తన పార్టీని స్థాపించారు. 2004 ఎన్నికల తరువాత దేశంలోని 32 రాజకీయ పార్టీలతో తెలంగాణకు అనుకూలంగా లేఖలు సంపాదించి కేంద్రానికి అందించాడు జయశంకర్ సార్, కేసీఆర్ ద్వయం. తెలంగాణ ప్రజల ఆకాంక్ష కాబట్టే తెలంగాణతో ఎలాంటి సంబంధంలేని, తెలంగాణలో ఎలాంటి రాజకీయ ప్రయోజనాలు ఆశించని రాజకీయ పార్టీలు ఎన్నో తెలంగాణ డిమాండ్ కు మద్దతు పలికాయి. తెలంగాణ న్యాయమయిన ఆకాంక్ష అని గుర్తించాయి. ఈ క్రమంలో పార్టీలను ఒప్పించేందుకు ..తెలంగాణ ఆకాంక్షను వారికి ఇప్పించేందుకు వారు ఎన్నో నిద్దరలేని రాత్రులు గడిపారు. ఎన్నో ప్రణాళికలు ...కొన్ని వందల గంటల చర్చలు దీనికోసం జరిగాయి. దేశంలోని రాజకీయ పార్టీలన్నీ తెలంగాణకు మద్దతు ఇచ్చినా ..మన రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ మాత్రం 2008 ఎన్నికలకు ముందు మాత్రమే అధికారం కోసం మాత్రమే తెలంగాణకు అనుకూలం అంటూ ఓ లేఖ ఇచ్చింది. 2009 డిసెంబరు 9 ప్రకటన తరువాత మాట మార్చి టీడీపీ అంటే తెలంగాణ ద్రోహుల పార్టీ అని తన నైజాన్ని చాటుకుంది. కాంగ్రెస్ నిర్లక్ష్యం ..టీడీపీ మోసం మూలంగా 1200 మంది తెలంగాణ బిడ్డలు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. దీనికి బాధ్యత వహించాల్సింది ఆ రెండు పార్టీలే. ఈ ఆత్మహత్యల పాపం ఆ రెండు పార్టీల పుణ్యమే.

ఒకవైపు కేసీఆర్ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తుంటే ..దానికి సహకరించకుండా తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలలోని ఎందరో నేతలు, ప్రజాసంఘాలు అని పేరు పెట్టుకుని, తమను తాము నేతలుగా ప్రకటించుకున్న ఎందరో నేతలను సీమాంధ్ర మీడియా మహానేతలను చేసి కేసీఆర్ మీద బురదచల్లించింది. ఆంధ్రబాబులకు గులాంలు అయిన ఎందరో నేతలు కేసీఆర్ మీద అబద్దపు ప్రచారాలు చేసి శునకానందం పొందారు. తెలంగాణ బిడ్డల ఆత్మహత్యలకు కారకులు అయిన ఆంధ్రానేతలు తెలంగాణలో తిరుగుతుంటే వారి యాత్రకు వంధిమాగధులుగా పనిచేసి అమరుల ఆత్మలకు క్షోభ కలిగించారు. తెలంగాణ బిల్లు పార్లమెంటుకు వచ్చిన తరువాత కూడా ఈ బురద చల్లడం ఆగలేదు. తెలంగాణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందిన తరువాత కూడా కేసీఆర్ మీద విషకక్కారు.

తన పార్టీని తాను విలీనం చేయాలా ? వద్దా ? అన్నది కేసీఆర్ కు సంబంధించిన సమస్య. టీఆర్ఎస్ పార్టీ అంతర్గత సమస్య. కానీ సీమాంధ్ర మీడియా తెలంగాణ బిల్లు రాగానే టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేశాయి. కాదు కూడదంటే కేసీఆర్ ను మోసం చేశాడని దుమ్మెత్తిపోశాయి. చివరకు ఒంటరిగా ఎన్నికలకు వెళ్లిన కేసీఆర్ ను, ఆయన పార్టీని కూడా ఈ మీడియా ...దాని వంధిమాగధులు వదిలిపెట్టలేదు. విషపురుగుల్లా వెంటాడారు. వేటాడారు. కానీ ప్రజాక్షేత్రంలో వాటి పప్పులు ఉడకలేదు. కేవలం హైదరాబాద్, దాని చుట్టుపక్కల సీమాంధ్ర కాలనీలలో తప్ప. ఈ మధ్యకాలంలోనే హైదరాబాద్ లో ఏకంగా ఆరులక్షల మంది కొత్త ఓటర్లను హైదరాబాద్ పరిసరాలలో కొత్తగా చేర్పించి అక్కడ తెలంగాణ ద్రోహుల పార్టీ గెలిచేందుకు ఎత్తులు వేశారంటే సీమాంధ్ర పార్టీలు..సీమాంధ్ర మీడియా ఎంత జిత్తులమారి నక్కలో అర్ధం చేసుకోవాలి.

ఇప్పుడు కేసీఆర్ అధికారం చిక్కినా ఈ సీమాంధ్ర మీడియా ..అవి తెలంగాణలో పెంచి పోషించిన నేతలు అడుగడుగునా అడ్డంకులు సృష్టించడం ఖాయం. తెలంగాణ పునర్నిర్మాణంలో కేంద్రం సహకారం లభించకుండా సీమాంధ్ర మీడియా నేతలు తమ వంతు ప్రయత్నాలు చేయడం ఖాయం. ఇక వాటికి తోడుగా నాయుడు ద్వయం కలిసి కేంద్రం మనసును కలుషితం చేస్తూనే ఉంటాయి. వీటన్నింటిని అధిగమించి తెలంగాణ పునర్నిర్మాణంలో కేసీఆర్ ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. మొత్తానికి ఏదీ ఏమయినా తెలంగాణను అర్ధం చేసుకున్నది ..తెలంగాణ అర్ధం చేసుకున్నది ఒక్క కేసీఆర్ ను మాత్రమే. ఆయనకు ఇక నుండి ఇప్పటివరకు అందించిన అండదండలకంటే రెట్టింపుగా ఇక నుండి అందించాల్సిన బాధ్యత తెలంగాణ సమాజం మీద ఉంది.

sandeepreddy kothapally

27, మే 2014, మంగళవారం

కేసీఆర్ ఎందుకు గెలిచాడు ?


తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర తొలి తెలంగాణ ప్రభుత్వం మరో నాలుగు రోజుల్లో కొలువుదీరబోతుంది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. కొమ్ములు తిరిగిన సీమాంధ్ర మీడియా దుష్ర్పచారాన్ని ..పదేళ్లుగా అధికారం చేజిక్కించుకుని మందబలం..ఆర్థికబలం పెంచుకున్న కాంగ్రెస్ ను ఢీ కొని ఏకంగా టీఆర్ఎస్ పార్టీ అధికారపీఠం ఎలా దక్కించుకుంది ? ప్రజలు ఏం చూసి టీఆర్ఎస్ కు ఓట్లేశారు ? ఏం చేస్తారని టీఆర్ఎస్ కు ఓట్లేశారు ? ఐదేళ్లలో టీఆర్ఎస్ అద్భుతాలు చేస్తుందా ? లేక అరచేతిలో స్వర్గం చూపెడుతుందా ? కేసీఆర్ ను ప్రజలు ఎందుకు నమ్మారు ?

2001లో టీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబునాయుడు, అప్పట్లో ఆయనకు అండగా ఉన్న తెలంగాణలోని ప్రముఖ నాయకగణం అంతా ఇది మఖలో పుట్టి పుబ్బలో పోతుంద
ని అన్నారు. అసలు తెలంగాణ అక్కర్లేదు అన్నారు. కేసీఆర్ వెంట నడిచిన వారి మీద దాడులు కూడా జరిగాయి. 2004 ఎన్నికల వరకు కేసీఆర్ కాంగ్రెస్ టీఆర్ఎస్ తో పొత్తుపెట్టుకుంటే గానీ టీడీపీని ఓడించలేం అన్న స్థితికి తీసుకువచ్చారు. ఇక అప్పటి నుండే కేసీఆర్ తన వ్యూహానికి పదునుపెట్టాడు. దేశంలో ప్రధానపార్టీ అయిన కాంగ్రెస్ ను తెలంగాణకు ఒప్పించాడు.

2004 ఎన్నికల్లో అధికారం దక్కిన వెంటనే వైఎస్ తన నైజాన్ని బయటపెట్టుకున్నాడు. టీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయాలని కుట్రలు పన్నాడు. ఎమ్మెల్యేలను చీల్చాడు. కేంద్రంలో కేసీఆర్ మంత్రిపదవి దక్కినా దానిమీద మక్కువ పెంచుకోలేదు.. తెలంగాణ డిమాండ్ ను యూపీఏ ఉమ్మడి ప్రణాళికలో చేర్పించడం మీదనే దృష్టిపెట్టాడు. కొన్నినెలలు శాఖలేని మంత్రిగానే కొనసాగాడు. మరో వైపు వైఎస్ తెలంగాణ నేతలతో రెచ్చగొట్టించి కేసీఆర్ ను రాజీనామా దిశగా పురిగొల్పుతున్నా కేసీఆర్ భయపడలేదు. మంత్రిపదవికి ..ఎంపీ పదవికి రాజీనామా చేసి తెలంగాణవాదానికి పరీక్ష పెట్టాడు. తాను పులిమీద స్వారీ చేస్తున్నానని తెలిసినా కేసీఆర్ వెనుకంజ వేయలేదు. రెండులక్షల పై చిలుకు ఓట్లతో గెలిచి సత్తాచాటారు.

2008లో తన మొత్తం ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి కేసీఆర్ మరోసారి ప్రజలను తెలంగాణ దిశగా ఆలోచించే ప్రయత్నం చేశారు. ఆ ఎన్నికల్లో ప్రాభవం కోల్పోయినా 2009 ఎన్నికలలో ఈసారి రాష్ట్రంలోని ప్రధాన పార్టీ టీడీపీని ముగ్గులోకి దింపి తెలంగాణకు అనుకూల లేఖ రాయించారు. మహాకూటమి అని పెట్టుకుని పురిట్లోని మిత్రధర్మానికి చంద్రబాబు గండికొట్టి టీఆర్ఎస్ కు కేటాయించిన 46 స్థానాలలో 33 చోట్ల బీ ఫాంలు ఇచ్చి మోసం చేశాడు. వైఎస్ అధికారం దక్కిన తరువాత టీఆర్ఎస్ ను అంతం చేయాలని చూస్తే చంద్రబాబు అధికారం రాకముందే టీఆర్ఎస్ ను నాశనం చేయాలని ప్రయత్నించాడు. టీడీపీ మోసం మూలంగా 10 శాసనసభ, 2 ఎంపీ స్థానాలకే పరిమితమయినా కేసీఆర్ నిరుత్సాహపడలేదు. అవకాశం కోసం కాచుక్కూర్చున్నాడు.

2009లో అధికారం దక్కిన నాలుగు నెలలకే వైఎస్ చనిపోవడంతో ఆ తరువాత రెండు నెలలకే రాష్ట్ర రాజకీయాలను కేసీఆర్ మలుపుతిప్పారు. ఫ్రీ జోన్ అంశం మీద నిరహారదీక్ష మొదలుపెట్టి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ ను ముందుకు తెచ్చారు. 11 రోజుల నిరహారదీక్షతో కేంద్రం తెలంగాణ ప్రకటన చేసే పరిస్థితిని కల్పించారు. దీంతో 2009 డిసెంబరు 9న తెలంగాణ ప్రకటన వచ్చింది. ఇక ఆ వెంటనే సీమాంధ్ర నేతల మోసం, కుట్రలు బయటపడ్డాయి. ప్రకటన వచ్చీరాగానే వారంతా సమైక్యాంధ్ర అంటూ నాటకాలు మొదలుపెట్టడం..చంద్రబాబు రెండు కళ్ల నైజం, చిరంజీవి సమైక్యవాదం ఎత్తుకోవడం మొదలయింది. ఈ పరిణామాలతో అప్పటి వరకు స్థబ్దుగా ..తెలంగాణ ఉద్యమానికి దూరంగా ఉన్న తెలంగాణ సమాజం తెలంగాణ గురించి ఆలోచించడం మొదలుపెట్టింది. డిసెంబరు 23 కేంద్రం తెలంగాణ నిర్ణయం మీద వ్యతిరేక ప్రకటన రావడంతో తెలంగాణ సమాజం ఒక్కతాటి మీదకు వచ్చింది. అసలు వచ్చిన తెలంగాణను ఎందుకు ఆపారు ? తెలంగాణ ఏర్పాటుకు ఎందుకు మోకాలడ్డుతున్నారు ? అన్న చర్చ మొదలయింది.

2009 మొదలు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర బిల్లు పార్లమెంటు ఉభయసభల్లో ఆమోదం పొందేవరకు కేసీఆర్ తెలంగాణ సమాజం వెంట నడిచారు. సకలజనుల సమ్మె, మిలియన్ మార్చ్, సాగరహారం ఏ కార్యక్రమం జరిగినా ..ఏ ఆందోళన చేసినా జేఏసీ వెంటనడిచింది టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్ పార్టీని జేఏసీ వెంట నడిపించిన ఘనత కేసీఆర్ ది. తెలంగాణ ఉద్యమంలో లాఠీదెబ్బలు తిన్నవారికి ..అనాలోచితంగా ఆత్మహత్యలు చేసుకున్న అమరులకు, కేసుల పాలయిన విద్యార్థులకు అండగా ఉండి ఆదుకున్నది టీఆర్ఎస్ ..టీఆర్ఎస్ అంటేనే తెలంగాణ. తెలంగాణ అంటేనే టీఆర్ఎస్. ఇక్కడ పోలీసుల నుండి గానీ, కాంగ్రెస్ నుండి గానీ, టీడీపీ నుండి గానీ ఇబ్బందులు ఎదుర్కొన్నది ప్రధానంగా టీఆర్ఎస్ పార్టీ నేతలే.
 ఈ నాలుగేళ్ల కాలంలో తెలంగాణ ఇవ్వకుండా ఎన్నికలకు వెళ్లలేని పరిస్థితులను కేసీఆర్ కాంగ్రెస్ పార్టీకి కల్పించాడు. తెలంగాణ బిల్లు శాసనసభలో పెట్టినప్పుడు టీడీపీ, కాంగ్రెస్ నాటకాలను ప్రజాక్షేత్రంలో టీఆర్ఎస్ ఎండగట్టింది. ఈ మధ్యకాలంలో జరిగిన ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులనే కాదు తెలంగాణ కోసం రాజీనామా చేసిన అందరు అభ్యర్థులకు టీఆర్ఎస్ పార్టీ అండగా నిలిచి గెలిపించింది. 2010లో నిజామాబాద్ లో బీజేపీ అభ్యర్థి యెండెల లక్ష్మీనారాయణ, ఆ తరువాత నాగర్ కర్నూలులో నాగం జనార్ధన్ రెడ్డి గెలుపులే దీనికి నిదర్శనం.

తెలంగాణ బిల్లు శాసనసభ నుండి పార్లమెంటుకు వెళ్లాక ఢిల్లీకి వెళ్తూ కేసీఆర్ "ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నుండి వెళ్తున్నా ..తెలంగాణ రాష్ట్రంలో అడుగుపెడ్తా" అని చెప్పడం ఆయనలోని ఆత్మవిశ్వాసానికి అద్దంపడుతుంది. పార్లమెంటులో బిల్లు సంధర్బంగా బీజేపీ నేతల వ్యవహారం, టీడీపీ నేతల వ్యవహారం, చివరివరకూ చంద్రబాబు, జగన్ నాటకాలు అన్నీ కేసీఆర్ మీద తెలంగాణ ప్రజలకు విశ్వాసాన్ని పెంచాయి. నాలుగేళ్లగా ప్రజా ఉద్యమానికి దూరంగా, తెలంగాణ ఉద్యమం మీద ఉక్కుపాదం మోపిన కాంగ్రెస్ నేతలు తీరా కేంద్రం తెలంగాణ ఇచ్చాక ఇచ్చింది తామేనని తెలంగాణ హీరోలం తామేనని చెప్పుకోవడం జనాలకు కాంగ్రెస్ నేతల మీద అసహ్యం పెంచింది. అసలు గ్రామస్థాయిలో నిర్మాణమే లేదన్న టీఆర్ఎస్ పార్టీకి ప్రజలే పునాదులుగా నిలిచి పట్టంకట్టారు.

ఇంతకుముందు ఏ పార్టీకి లేనంతంగా టీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు ఒక్కొక్కరు 10 వేల నుండి 93 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ స్థాయి మెజార్టీలు 1994 ఎన్నికల్లో గానీ, 2004 ఎన్నికల్లో గానీ ఏ పార్టీకి రాలేదు. శాసనసభతో పాటు లోక్ సభ సభ్యుల విషయంలో కూడా ప్రజలు కేసీఆర్ మీదనే విశ్వాసం ఉంచారు. కేసీఆర్ కేవలం 10 రోజుల్లో 110 సభల్లో పాల్గొని తన లక్ష్యాన్ని, తన ప్రణాళికను తెలంగాణ ప్రజల దగ్గరకు తీసుకువెళ్లారు. అరవైఏళ్ల వయసులోనూ ఆయన అత్యంత ఉత్సాహంగా రోజుకు పది సభల్లో అలుపెరగకుండా ఆత్మవిశ్వాసంతో పాల్గొన్నారు. ఆయన పోరాటమే ఈ రోజు ఆయనను నిలబెట్టింది. తెలంగాణ ప్రజలు నమ్మింది ఒక్క కేసీఆర్ ను ..తెలంగాణ విషయంలో ఆయన నిబద్దతను..మొండి పట్టుదలను. అయిదేళ్లలో కేసీఆర్ అద్భుతాలు చేస్తాడని ప్రజలు ఆశించడం లేదు. కేవలం తెలంగాణకు అవసరం అయిన పని కేసీఆర్ చేస్తాడన్న నమ్మకమే ప్రజలను కేసీఆర్ వెంట నడిపించింది. కేసీఆర్ ప్రజల మనసును గెలిచాడు. అందుకే ఆయన ఈ రోజు సగర్వంగా నిలిచాడు.

sandeepreddy kothapally

18, మే 2014, ఆదివారం

కోట్లకొక్కడు ..కేసీఆర్నూటికో ..కోటికో ..ఒక్కడు కాదు ..కోట్లాది మందికి ఒక్కడు కేసీఆర్. అరవై ఏళ్ల తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను నిజం చేసిన ఒకే ఒక్కడు కేసీఆర్. ఇప్పుడు విజయానందంలో ఉండవచ్చు కానీ గత 14 ఏళ్లుగా ఆయన పడ్డ వేదన ..అవహేళనలు ..అవమానాలు అన్నీ ఇన్నీ కావు. ఈ రోజు ఆయనకు పూలందిస్తున్న చేతులే ఆయన కాళ్లసందున కట్టెలు పెట్టిన సంఘటనలు చాలా ఉన్నాయి. ఒక వ్యక్తి వక్తిత్వం మీద.. అలవాట్ల మీద ..ఈ మధ్య కాలంలో ఎన్నడూ రాజకీయాల్లో ఏ నేత మీదా జరగలేదు. కేసీఆర్ మొండితనమే ఆయనను నిలబెట్టింది. కేసీఆర్ పట్టుదలనే ఈ రోజు తెలంగాణను సాధించిపెట్టింది. సహకరించామన్నవారు ..సాధించామన్నవారు చాలా మంది ఉండొచ్చు ...కానీ వారందరికన్నా ముందున్నది కేసీఆర్ మాత్రమే ..

సీమాంధ్ర మీడియా ..సీమాంధ్ర పెట్టుబడిదారులు..సీమాంధ్ర రాజకీయ నేతలు ముప్పేట దాడిచేస్తున్నా వెరవకుండా కేసీఆర్ అత్యంత వ్యూహాత్మకంగా గత 14 ఏళ్లుగా తెలంగాణ సాధనకు తన ప్రణాళికను అమలు చేశారు. మొదటిసారి కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని ఆ పార్టీని తెలంగాణకు ఒప్పించిన కేసీఆర్ .. ఆ తరువాత 2009లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని దానిని ముగ్గులోకి దింపి తెలంగాణ అంశం నుండి ఆ పార్టీలు వెనక్కి పోయే అవకాశం లేకుండా చేశాడు కేసీఆర్. ఈ మధ్యకాలంలో నిజంగా కేసీఆర్ పదవికో ..పైసలకో అశించినట్లయితే ఈ రోజు తెలంగాణ అంశం అనేదే మనం మరిచిపోయే వాళ్లం. కానీ కేసీఆర్ లక్ష్యం మీద గురిపెట్టి వ్యూహాత్మకంగా ముందుకు సాగారు.

అవకాశం కోసం పొంచిఉన్న వేటగాడిలా 2009 ఎన్నికల్లో ఓడిపోయి ఆ వెంటనే వైఎస్ మరణించగానే మూడు నెలల్లో రాష్ట్ర ముఖచిత్రాన్నే మార్చేశారు. సీమాంధ్ర రాజకీయ నాయకుల డొల్లతనాన్ని బట్టబయలు చేసి తెలంగాణ ప్రజలను అప్రమత్తం చేశారు. ఈ పరిస్థితులలో సీమాంధ్ర మీడియా ధాటికి ఏ రాజకీయ నాయకుడు అయినా చేతులెత్తేసేవారే కానీ కేసీఆర్ కాబట్టి మాత్రమే వాళ్లందరినీ తట్టుకుని పోరాడగలిగారు. 2001లో కేసీఆర్ పార్టీ పెట్టినప్పుడు ఆయనను గేలిచేసినవారు ..అసలు తెలంగాణ రాష్ట్రం అవసరం ఇప్పుడు ఏముందని ప్రశ్నించిన వారు...ఆ తరువాత చచ్చినట్లు కేసీఆర్ వెంటనడిచారు. అయితే సీమాంధ్ర మీడియా కేసీఆర్ మీద తెలంగాణ సమాజానికి అనుమానాలను పెంచింది. ఈ రోజు తెలంగాణ సాధించిన వ్యక్తిగా కేసీఆర్ పూర్థి స్థాయి క్రెడిట్ దక్కకపోవడానికి కారణమూ ఈ సీమాంధ్ర మీడియానే.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర బిల్లు కేంద్రం ఆమోదించిన తరువాత,.రాష్ట్రపతి దానికి ఆమోదముద్ర వేసి అపాయింటెడ్ డేట్ వచ్చిన తరువాత కూడా కేసీఆర్ ను తెరమరుగు చేసేందుకు ..తెలంగాణ వచ్చిన తరువాత ఇక ఆయనతో పనేంటి ..అసలు ఆయన చేసింది ఏంటి తెలంగాణ కోసం ..అన్న ప్రచారం పెద్ద ఎత్తున చేసి ఆయన గొప్పతనాన్ని తగ్గించే ప్రయత్నం చేశారు. తెలంగాణను అభివృద్ది చేసేందుకు గానీ ..భవిష్యత్ లో తెలంగాణ భద్రతకు గానీ కేసీఆర్  ఏ మాత్రం ఉపయోగపడడని ..కేసీఆర్ ను ఎన్నుకుంటే తెలంగాణకు నష్టం అని భారీ ఎత్తున ప్రచారం చేశారు. తెలంగాణ సమాజంలో కేసీఆర్ మీద నమ్మకం సన్నగిల్లేలా చేసేందుకు ప్రయత్నం చేశారు.

ఈ ప్రచారంలో ప్రత్యర్ధులు కొంతవరకు సఫలమయినట్లే భావించాలి. ఎందుకంటే 119 స్థానాలలో వాస్తవంగా టీఆర్ఎస్ కు 90కి పైగా స్థానాలు సాధించాలి. కానీ టీఆర్ఎస్ 63 స్థానాల వద్దనే ఆగిపోవడానికి కారణం అదే. కేసీఆర్ మీద ఎంత బురదజల్లినా ..తెలంగాణ సమాజం కీలకసమయంలో విజ్ఞతతో వ్యవహరించింది. ఇక ముందుకాలంలో కూడా తెలంగాణ కేసీఆర్ అండగా నిలవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది.

11, మే 2014, ఆదివారం

అనంగ అనంగ ఓ దోస్తు..

అనంగ అనంగ ఓ దోస్తు ఉండెటోడు ..ఆనికి ఊరంటె మస్తు పానం.

ఆడు దోస్తు అంటె మామూలు దోస్తు గాదు. ఆడు ఊరికే దోస్తు..

వాడు ఊళ్ల ఉంటె ఊళ్ల ఆని దోస్తులకు ..ఆనికన్న చిన్నోళ్లకు ..పెద్దోళ్లకు పండుగనే పండుగ
ఆనికి మస్తు పొలం ఉంది. ఆడుత పాడుత పొలం జేసెటోడు. పదో తర్గతి కాడనే సదువు సాలిచ్చుకున్నడు వాడు. ఆనికి అది అంత వంటవట్టలే ..30 ఎకరాల పొలం ..చేతినిండ పైసలు.
ఆనికి ఈడు ..వాడు అని లేదు. ఆడు చెల్క జెయ్యాలె.  దోస్తులతోని తిర్గాలె..కిర్ కెట్ ఆడాలె. ఆని ఊళ్ల ..సుట్టుపక్కల ఊళ్ల యాడ కిర్ కెట్ పోటీలు జర్గినా ఈనికి మతులావు వచ్చేది. ఎంట్రి పీజు ఈడె గట్టాలె ..ఊరి పోరగాళ్లను జమజేస్కోని పొయ్యి ఆట ఆడి వచ్చెటోడు. గెల్సుడు ..ఓడుడు తర్వాత సంగతి ..ఆళ్ల ఊరినుంచి వొయ్యి మాత్రం కిర్ కెట్ ఆడాలె. ఆడుత పాడుత.. ఆని జీవితం సాపీగ సాగుతున్నది. ఇంతలనే బజాజ్ పల్సర్ బండ్లొచ్చినయ్యి..ఆని కాయిసు బండి మీదికి మళ్లింది. బండి దెచ్చుకున్నడు ..ఇంగ వాని తిర్గుడు తిర్గుడ గాదు ...ఓ రోజు అచ్చంపేటకు వొయ్యిండు ..అనుకోకుండ ఆటో ఎదురొచ్చింది. ఆని బండికి గుద్దింది. ఆడు ఆడనే పానం ఇడ్సిండు. పాపం ఆని దోస్తులంత బాధవడ్డరు. ఏ తీర్గ జూసినా ఆడు లేడన్న బాధ మాత్రం తీరుత లేదు. ఆని గుర్తుగ ఏదో ఒకటి వెట్టుకోవాలె అనుకున్నరు. కానీ ఏం బెట్టుకోవాలె ? శానా దినాలు ఆలోచించిండ్రు. ఆనికి కిర్ కెట్ అంటె పానం గావట్టి వాటినే ఆని గుర్తుగ స్థూపం గట్టుకోవాలె అనుకున్నరు. అంతే ఊరి గేటుకాడ స్థూపం గట్టిండ్రు. దాని మీద మూడు వికెట్లు ..పైన రెండు బెల్స్ వెట్టిండ్రు. మధ్యల ఓ బాల్ వెట్టిండ్రు. అందులనే ఆని రూపాన్ని సూసుకోని ముర్సిపోతుండ్రు. యాడాదికోసారి ఆడు సచ్చిపొయ్యిన దినం గుర్తు వెట్టుకోని ఆని పేరు మీద కిర్ కెట్ పోటీలు వెడ్తున్నరు. ఆడులేడన్న బాధను ఆ విధంగ మర్సి పొయ్యేందుకు ప్రయత్నం జేస్తున్నరు. మంచి దోస్తులు గద..

(మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేట తాలూకా బల్మూరు మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన కీ.శే భాస్కర్ రెడ్డి అనే యువకుడు ..ఆయిన దోస్తుల కథ ఇది. బహూశా గత నెలలో అతని వర్ధంతి అనుకుంటా ఎప్పుడో 2006లో ఈనాడుకు ఈ వార్త రాశా ..ఇయ్యాల మల్ల ఎందుకో యాదికొచ్చిండు)

అమ్మ గురించి ...

అమ్మ గురించి ఇంత హృద్యంగా చెప్పిన Prakash Chimmala సార్ కు వందనాలు