15, ఏప్రిల్ 2012, ఆదివారం

పేదింటి పెళ్లికి కేసీఆర్



‘‘తెలంగాణ కోసం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ిఇస్తానన్న డబ్బు తీసుకోకుండా తమకు తెలంగాణనే ముఖ్యమని చెప్పిన తన పార్టీ కార్యకర్త వెంకటేష్ గౌడ్ కుమార్తె కృష్ణవేణి వివాహానికి’’ కేసీఆర్ ఆదివారం స్వయంగా హాజరయ్యారు. మహబూబ్ నగర్ జిల్లా నాగర్ కర్నూలు నియోజకవర్గం తెలకపల్లిలో ఈ వివాహం జరిగింది. ఇటీవల టీడీపీ అభ్యర్థి మర్రి జనార్ధన్ రెడ్డి కృష్ణవేణి వివాహానికి డబ్బులు ఇస్తానన్న్నా ఆమె తిరస్కరించింది. దీంతో స్టేషన్  ఘన్ పూర్ బహిరంగసభలో కేసీఆర్  కృష్ణవేణి ని అభినందించారు. తాను దగ్గరుండి ఆమె వివాహం జరిపించి అత్తవారింటికి పంపిస్తానని మాటిచ్చాడు.
ఈ మేరకు ఆదివారం హాజరయిన కేసీఆర్  కృష్ణవేణి,  బాల్ రాజ్ గౌడ్ ల వివాహానికి హాజరయ్యారు. దంపతులిద్దరినీ ఆశీర్వదించి కృష్ణవేణికి ఓ నెక్లెస్ ను బహుమతిగా అందించారు. ఏ అవసరం వచ్చినా తనను సంప్రదించాలని భరోసా ఇచ్చారు. అనంతరం అక్కడ భోజనం చేసి వెళ్లారు. మీడియాతో మాట్లాడాలని కోరినా తిరస్కరించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు నాగర్ కర్నూలు ఎమ్మెల్యే నాగం జనార్ధన్ రెడ్డి, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జూపల్లి కృష్ణారావు,  రాజయ్య, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు విఠల్ రావు ఆర్య, పొలిట్ బ్యూరో సభ్యులు నిరంజన్ రెడ్డి, లక్ష్మారెడ్డి, నేతలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, గువ్వల బాల్ రాజ్ తదితరులు హాజరయ్యారు.

2, ఏప్రిల్ 2012, సోమవారం

తెలంగాణ ఆడపడుచు కృష్ణవేణి పెళ్లి 15న

సీమాంధ్రుల అంటకాగుతూ తెలంగాణకోసం రాజీనామా చేసిన నాగం జనార్ధన్ రెడ్డికి వ్యతిరేకంగా టీడీపీ తరపున పోటీ చేసిన హైదరాబాద్ జేసీ బ్రదర్స్ అధినేత మర్రి జనార్ధన్ రెడ్డి కి తలతిరిగే సమాధానం చెప్పిన తెలంగాణ వాది, తెలంగాణ ఆడపడుచు కృష్ణవేణి పెళ్లి ముహూర్తం ఖాయం అయింది. ఈ నెల 15 న మహబూబ్ నగర్ జిల్లా నాగర్ కర్నూల్ నియోజకవర్గం తెలకపల్లి మండలకేంద్రంలోని శివగంగ ఫంక్షన్ హాల్ లో వివాహం జరగనుంది.




                    పెళ్లికి డబ్బులిస్తా అని కృష్ణవేణి తండ్రి వెంకటేష్ గౌడ్ ను జనార్ధన్ రెడ్డి ప్రలోభ పెడితే ఆ డబ్బుతో పెళ్లి జరిగితే అమరుల ఆత్మ క్షోభిస్తుందని, అవసరమైతే ఆస్తులు అమ్మయినా పెళ్లి చేసుకుంటానని, తెలంగాణ కే ఓటు వేద్దామని చెప్పి ఆమె అందరికీ ఆదర్శంగా నిలిచింది. కృష్ణవేణి చెప్పిన మాటలు తెలంగాణ వాదులను అబ్బురపరిచాయి. ఏకంగా స్టేషన్ ఘన్ పూర్ బహిరంగ సభలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కృష్ణవేణి పెళ్లిని దగ్గరుండి జరిపించి అత్తారింటికి సాగనంపుతామని మాటిచ్చారు. ఈ నెల 15 న పెళ్లి చేసుకోనున్న తెలంగాణ ఆడపడుచు కృష్ణవేణి ని తెలంగాణా వాదులంతా హాజరై ఆశీర్వదించండి. అభినందించండి. తెలంగాణ కోసం ఆత్మహత్యలు వద్దు అంటూ తన పెళ్లి పత్రిక ద్వారా కృష్ణవేణి తెలంగాణ యువతకు పిలుపునిస్తోంది. పోరాటాలతోనే తెలంగాణ సాధ్యమని, తెలంగాణ తల్లికి గర్భశోకం మిగల్చవద్దని కోరుకుంటోంది.