8, ఫిబ్రవరి 2012, బుధవారం

పోటెత్తిన మేడారం


ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర  మేడారం ‘సమ్మక్క – సారలమ్మ’ జాతరకు భక్త జనం పోటెత్తింది.
 ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివస్తుండటంతో  మేడారం జనారణ్యంగా మారింది. అతి పెద్ద గిరిజన జాతరగా ప్రసిద్దికెక్కిన మేడారం జాతర భక్తి తన్మయత్వంలో ముంచెత్తుతోంది.  ఎటు చూసినా యిసుకేస్తే రాలనంత జనంతో కిక్కిరిసి పోయింది.
సమక్క.. సారలమ్మలను దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు తరలివస్తూనే ఉన్నారు. ఇప్పటికే అమ్మవారి సన్నిధికి చేరుకున్న భక్తులు దేవతల గద్దెలను దర్శించుకున్నారు. ఈ ఏడు జాతరకు కోటి మంది భక్తులు రావొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. మేడారంలో హిజ్రాలు హల్ చల్ చేస్తున్నారు. నృత్యాలు చేస్తూ సమ్మక్కను ఎత్తుకుని మేళ తాళాలతో భారీ ప్రదర్శన నిర్వహించారు. జాతర భద్రతకు వేల మంది పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
మావోయిస్టు యాక్షన్ టీములు వచ్చే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించడంతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిఘా ఏర్పాటు చేస్తున్నారు.  జాతరకు వచ్చే వీవీఐపీలను మావోయిస్టులు టార్గెట్ గా చేసుకుని, హింసాత్మక సంఘటలనకు పాల్పడే అవకాశం ఉన్నందున పోలీసులు అప్రమత్తమయ్యారు. అమ్మవార్ల గద్దెల చుట్టూ 1200మందికి పైగా సాయుధ పోలీసులు పహరా కాస్తున్నారు. 40సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటిని 6భారీఎల్ ఈడీ స్క్రీన్ల ద్వారా పరిశీలిస్తారు.
ఎడ్లబండ్లపై మోజు…
పట్టణ ప్రాంతాల నుండి వచ్చే భక్తులు ఎండ్ల బండ్లపై జంపన్న వాగుకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఇక్కడి స్థానికులకు ఇదో కొత్త ఉపాధిగా మారింది. బస్టాండు నుండి జంపన్న వాగు దూరంగా ఉండడం, దీంతో పాటు ఎడ్లబండి ప్రయాణం కొత్త అనుభూతికి గురిచేయడంతో అత్యధికులు దీనిపై మోజుపడుతున్నారు. దీనికి గాను బండికి రూ.50 వసూలు చేస్తున్నారు. బుధవారం రాత్రి సమ్మక్క- సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులను గిరిజన పూజారులు గద్దెలపై ప్రతిష్టించారు. ఈ ప్రతిష్టాపనని తిలకించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. రెండేళ్లకోకసారి జరిగే ఈ జాతరను దాదాపు కోటిన్నర మంది దర్శించుకుంటారు.

4, ఫిబ్రవరి 2012, శనివారం

యువరాజ్ సింగ్ కు క్యాన్సర్


భారత క్రికెట్ అభిమానులకు ఓ బ్యాడ్ న్యూస్. భారత జట్టు డాషింగ్ ఆల్ రౌండర్ యువరాజ్సింగ్ అభిమానులకు ఇది మరింత ఆందోళన కలిగించే వార్త. యువరాజ్ సింగ్ క్యాన్సర్ తో బాధపడుతున్నాడని సమాచారం. ఈ మేరకు ఆయన అమెరికాలో కీమోథెరపీ చికిత్స పొందుతున్నారు. భారత్ కు మరోసారి ప్రపంచకప్ వచ్చేందుకు కారణమయిన యువరాజ్ సింగ్ ఆ తరువాత క్యాన్సర్ ఉందని తెలిసినట్లు సమాచారం.
మార్చి వరకు ఆయనకు కీమోథెరపి చికిత్స జరుగుతుందని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఆయనకు క్యాన్సర్ మొదటి దశలోనే ఉందని, ఆయనకు ఎలాంటి ప్రమాదంలేదని యువీ వ్యక్తిగత వైద్యుడు చెబుతున్నాడు. కీమోథెరపీ చికిత్స మూడుదశల్లో జరుగుతుందని వైద్యుడు జతిన్ చౌదరి చెబుతున్నారు. తన ఆటతీరుతో, అందచందాలతో బాలీవుడ్ భామల మనసులు దోచుకున్న యువరాజ్ క్రికెట్ లో తన సత్తా చాటుకున్నాడు. ఆయనకు క్యాన్సర్ ఉందన్న వార్తలు అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి.
గత అక్టోబర్ లోనే గుండెకు, ఊపిరితిత్తుల మధ్య వైద్యులు కణితిని గుర్తించారు. అయితే అది అంత ప్రమాదకరం కాదని మొదట అనుకున్నారు. క్రమేణా అది ఇబ్బందిగా మారడంతో చికిత్సను ప్రారంభించారు.