22, అక్టోబర్ 2012, సోమవారం

మంద కృష్ణ వేలితో మన కన్ను !


                                         
తెలంగాణ సమస్య మీద ఎలాంటి స్పష్టమయిన హామీ ఇవ్వకుండా తెలంగాణలో తన పాదయాత్రను కొనసాగించడం ఎలా ? ఏ విధంగా ముందుకు వెళితే తన యాత్ర కొనసాగుతుంది ? అన్న విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వేసిన పాచిక పారింది. వ్యూహాత్మకంగా ఎలాంటి గొడవా లేకుండా తెలంగాణలో ప్రవేశించారు. ఎమ్మార్పీఎస్ ను, మంద కృష్ణ మాదిగను ముందుకు పెట్టి చంద్రబాబు తన పంతం పారించుకున్నారు.
చంద్రబాబుకు మంద కృష్ణ కు లింకేంటని ఆశ్చర్యపోతున్నారా ? అసలు లింకు అక్కడే ఉంది. యాత్రకు నెల ముందే తన యాత్రలో ఎదురయ్యే సమస్యలు, జవాబు చెప్పాల్సిన పలు విషయాలను చర్చించి చంద్రబాబు నాయుడు స్పష్టత ఇచ్చాడు. అలాగే తెలంగాణ గురించి కూడా స్పష్టత ఇస్తానని, ఆ ఒక్కటి తేలిస్తే టీడీపీకి ఎదురే ఉండదని, అందుకే చంద్రబాబు తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇస్తున్నాడని తన అనుకూల మీడియాతో పెద్ద హైప్ సృష్టించాడు చంద్రబాబు. బీసీ డిక్లరేషన్ ప్రకటించాడు. ఎస్సీ వర్గీకరణకు మద్దతు ప్రకటించాడు. కానీ తెలంగాణ కు మాత్రం మొండి చేయి చూపాడు. యాత్రకు ముందు తెలివిగా అఖిల పక్షం పెట్టాలని  ప్రధాని మన్మోహన్ సింగ్ కు ఓ లేఖ రాసి చేతులు దులుపుకున్నాడు.
తెలంగాణ నుండి పాదయాత్ర ప్రారంభిస్తున్నట్లు ప్రకటనలు చేయించి అనంతపూర్ నుండి ప్రారంభించి తెలంగాణ కు వచ్చేశారు. ఈ లోపే చంద్రబాబును  యాత్రలో కలుసుకుని ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణ మాదిగ మద్దతు ప్రకటించారు. వర్గీకరణకు మద్దతు ఇచ్చిన బాబుకు మద్దతు తెలపడం మా ధర్మం అని చెప్పారు. తెలంగాణలోకి రాగానే తెలంగాణ జేఏసీ, ఇతర నేతలు చంద్రబాబు పాదయాత్రకు అడ్డురాకుండా మాదిగ విద్యార్థి నేతలను రంగంలోకి దింపారు. అవసరం అయితే టీడీపీ శ్రేణులతో పనిలేకుండా జేఏసీ నేతలను వీరే ఎదుర్కొనేలా కార్యక్రమం సిద్దం చేశారు. ఈ నేపథ్యంలోనే సోమవారం శాంతినగర్ వద్ద తెలంగాణ జేఏసీ నేతలను ఎంఎస్ఎఫ్ నేతలు అడ్డుకున్నారు. ఈ వివాదం నేపథ్యంలోనే వారిని వదిలేసి పోలీసులు జేఏసీ నేతలను అరెస్టు చేశారు. మొత్తానికి మంద కృష్ణ మాదిగను అడ్డుపెట్టుకుని తెలివిగా చంద్రబాబు తెలంగాణలో అడుగుపెట్టారు. పాదయాత్రలో ఇక ముందు కూడా తెలంగాణ నిరసనలను ఎమ్మార్పీఎస్ మాత్రమే అడ్డుకునేలా కనిపిస్తోంది. మంద కృష్ణ  వేలితో మన కన్ను పొడిచేందుకు బాబు రంగం సిద్దం చేశాడన్న మాట.