9, నవంబర్ 2011, బుధవారం

కాంగ్రెస్ నోట మళ్లీ ఎస్సార్సీ మాట


తెలంగాణ విషయంలో కాంగ్రెస్‌ పార్టీ నోట పాతపాట మరోసారి విన్పించింది. కొత్తగా ప్రత్యేక రాష్ట్రాల ఏర్పాటుకు రాష్ట్రాల పునర్విభజన కమిషన్‌ (ఎస్‌ఆర్‌సి) ఒక్కటే ప్రత్యామ్నాయమని కాంగ్రెస్‌ పార్టీ సూచన ప్రాయంగా వెల్లడించింది. ఢిల్లీలో ఆ పార్టీ అధికార ప్రతినిధి రషీద్‌ అల్వీ, బోఫాల్‌లో పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజరు సింగ్‌లు ఒకేసారి ఈ ప్రకటన చేయడం  రాష్ట్రంలో కలకలం సృష్టించింది.                                                                                   దేశవ్యాప్తంగా చిన్న రాష్ట్రాల ఏర్పాటుపై ఒక ప్రత్యేక కమిషన్‌ను నియమించాలని ఎఐసిసి అధికార ప్రతినిధి రషీద్‌ అల్వీ అన్నారు. ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. ఈనెల 10వ తేదీ తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి పి.చిదంబరం తెలంగాణకు సంబంధించి ఒక ప్రకటన చేస్తారని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి గులాంనబీ ఆజాద్‌ ప్రకటించిన మరునాడే రషీద్‌ అల్వీ ఈ ప్రకటన చేయడం విశేషం. తెలంగాణ సమస్య కూడా ప్రత్యేక కమిషన్‌ ద్వారానే పరిష్కార మవుతుందని రషీద్‌ అల్వీ అన్నారు. దేశంలోని పలు ప్రాంతాల్లో రాష్ట్రాల ఏర్పాటు కోసం డిమాండ్లు వస్తున్న నేప థ్యంలో ప్రత్యేక కమిషన్‌ను నియమించడమొక్కటే పరిష్కారమని ఆయన అభిప్రాయపడ్డారు.
చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు ప్రత్యేక కమిషన్‌ వేయాలి. తెలంగాణ సమస్య కూడా ఇలాంటి కమిషన్‌ ద్వారానే పరిష్కారమవుతుంది. దేశంలో చాలా చోట్ల చిన్న రాష్ట్రాల డిమాండ్‌ వుంది. చిన్న రాష్ట్రాల డిమాండ్‌ దృష్ట్యా ప్రత్యేక కమిషన్‌ ఏర్పాటు అవసరం వుంది. నేను చిన్న రాష్ట్రాల పట్ల కాంగ్రెస్‌ పార్టీ విధానాన్ని చెపుతున్నాను. అందులో మార్పు వుండదు అని ఆయన పునరుద్ఘాటించారు. కాంగ్రెస్‌ పార్టీ దేశవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటుందని అన్నారు. కేవలం ఒక రాష్ట్రాన్ని దృష్టిలో వుంచుకొని ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడం జరగదని స్పష్టంచేశారు. దేశప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవడం అవసర మన్నారు. అయితే తెలంగాణకు ఇదే సూత్రం వర్తిస్తుందా అన్న అంశంపై రషీద్‌అల్వీ స్పష్టత ఇవ్వలేదు.
తెలంగాణ సమస్య భిన్నమైనదేమీ కాదు. కాకపోతే క్లిష్టమైనది. అంతేగాకుండా ఈ సమస్య చాలా కాలంగా కొనసాగుతున్నది. ఈ అంశాన్ని ఆంధ్ర ప్రదేశ్‌ పార్ట్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జి గులాంనబీ ఆజాద్‌ చూస్తున్నారు. ఈ విషయం గురించి ఆయననే అడిగితే మంచిది. కాకపోతే చిన్నరాష్ట్రాల సమస్య అంతా ఒక్కటేనన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి” అని ఆయనన్నారు. భోపాల్‌లో జరిగిన ఒక సమావేశంలో కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి దిగ్విజరుసింగ్‌ మాట్లాడుతూ, తెలంగాణతోపాటు చిన్న రాష్ట్రాల విషయంలో కాంగ్రెస్‌ వైఖరి స్పష్టంగా వుందని చెప్పారు. ఇటువంటి సమస్యల పరిష్కారానికి రెండవ ఎస్సార్సీ ఒక్కటే పరిష్కారమార్గమని ఆయనన్నారు. సమయానుకూలంగా ఎస్సార్సీని ఏర్పాటు చేయడం అవసరమన్నారు.

1 కామెంట్‌: