30, జూన్ 2012, శనివారం

నల్లమలలో నేను !



ఓ పాత్రికేయ మిత్రుడి కోరిక మేరకు చెంచుల గురించి ఓ కథనం రాసేందుకు తమ్ముడు శివతో కలిసి చాన్నాళ్ల తర్వాత నల్లమలకు శనివారం ఉదయమే బయలుదేరా. మన్ననూరులో పాత్రికేయ మిత్రుడు అంజన్న చేరిక..  అక్కడే టిఫిన్..అక్కడి నుండి నల్లమలకు ప్రయాణం. వెళ్తుంటే దారిలో అటవీ అధికారులు, డీఎఫ్ఓ పలకరింపు.. .ఆ తరువాత ఫరహాబాద్ వ్యూ పాయింట్ కు వెళ్లేదారిలో చెక్ పోస్ట్. అది  తెరిచే ఉంది.

రయ్యిన టూ వీలర్ అడవిలోకి దూసుకెళ్లింది. గార్డులెవ్వరూ లేరు కదా ముందుటే చెబుదామని కొంచెం ముందుకు వెళ్లాం. వెంటనే వెనకనుండి కేకలు..అరుపులు. వెనక్కిరాగానే కొడతాడా అన్నట్లుగా గార్డు మీదకే వస్తున్నాడు. ఎందుకు అంత కోపం అని రూంలోకి వెళ్లి అప్పాపూర్ కు వెళ్తున్నామని చెప్పాం. అప్పాపూర్ కే వెళ్లి రావాలి..అలా కాదని ఫరహాబాద్ వ్యూ పాయింట్ కు వెళ్లారో గార్డు బెదిరింపులు.

 అంతలోనే అంతకుముందు కలిసిన డీఎఫ్ఓ టిఫిన్ చేయడానికే అక్కడికే వచ్చారు. బయట ఆయనతో మా మాటలు మొదలు కాగానే గార్డు మా వైపు చూడడం మానేశాడు. మల్లాపూర్ పెంట పరిస్థితి అడిగితే అది వదిలేసి ‘‘అప్పాపూర్ లో పిల్లలు బడికి రావడం లేదని, అక్కడ ఎవరూ లేరు ..చెంచులు అక్కడ ఎందుకు ఉండడం..పాఠశాల అంతా పశువుల పేడతో నిండింది’’ అని డీఎఫ్ఓ అన్నాడు. అంతే అప్పాపూర్ స్వరూపం అప్పుడే కొంత కళ్ల ముందు మెదులు తుండగానే బండి అడవిలోకి దూసుకెళ్లింది.  ఆరేళ్ల క్రితం అప్పాపూర్ కు ఓ మూడు సార్లు వెళ్లా. అప్పుడు చెంచులు అడవిలోనే ఉండేవారు ఇప్పుడు వారంతా అటవీశాఖలో ఉద్యోగులయ్యారు. కొంచెం చురుగ్గా ఉండే యువకులను అధికారులు అటవీ వాచర్లుగా మార్చేశారు. ఇక అడవి అంతటా వారే.


 దట్టమయిన అడవి. అడవిలో నాలుగు కిలోమీటర్లు వెళ్లగానే ఫరహాబాద్ కు బండి మళ్లే మలుపులో అడవి కోళ్ల స్వాగతం..ఆ తరువాత మరో నాలుగు కిలోమీటర్లు పుల్లాయపల్లి ఇంకా రెండు కిలోమీటర్లు ఉందనగానే .. గుంపులు..గుంపులుగా జింకలు...ఫోటో తీసుకుందామనే లోపే చెట్లచాటుకు మాయం. చలికాలమా అనిపించేలా ఉదయం 9 గంటలకు చల్లటిగాలి...నల్లమల ఎందుకో ఈ సారి కొత్తగా అనిపించింది. గతంలో కంటే కొత్తగా..మరింత చిక్కగా...డీఎఫ్ఓ శంకరన్ పుణ్యమే ఇది.

మన్ననూరు దాటాక శ్రీశైలం రహదారిలో కనిపించే ప్రతి అటవీ బోర్డులు, గార్డ్ వాచ్ రూం లు,  ఫరహాబాద్ వ్యూ పాయింట్ వద్ద నిర్మించిన గది, ఇతర ప్రతి అభివృద్ధి అంతా శంకరన్ శ్రమ ఫలితమే. ఎక్కడో తమిళనాడుకు చెందిన ఆయన కుటుంబం సికింద్రాబాద్ లో స్థిరపడ్డా ఆయన పుట్టింది మాత్రం ..రెండో ప్రపంచ యుద్ద సమయంలో బర్మాలో జన్మించారు. ఆయన అచ్చంపేట డీఎఫ్ఓగా రావడం నల్లమల చేసుకున్న పుణ్యం. ఆయన వచ్చాకే స్వేచ్చగా నల్లమల అడవుల్లో తిరిగ స్మగ్లర్ల అక్రమాలకు అడ్డుకట్ట పడింది. ఈనాడులో పనిచేస్తున్నప్పుడు ఆయనను కలిసిన సమయాన్ని నెమరు వేసుకుంటూ ముందుకు వెళ్తున్నా.

నలుగురు చెంచు మహిళలు వెనక ఏదయినా వాహనం వస్తుందా అని అడిగారు. రావడం లేదు ఎక్కడి కెళ్తున్నారు అని ప్రశ్నించాం. పుల్లాయపల్లి అని చెప్పారు. మరి కొంత ముందుకు వెళ్లగానే  ఓ వ్యక్తి చేతిలో గొడ్డలితో మీదకు వస్తున్నట్లే అనిపించాడు. అంతలోపే మా బండి అతడిని దాటేసింది. పుల్లాయపల్లి గుడిసెలు..ఆ తరువాత అప్పాపూర్ దారి కొంత దెబ్బతింది. మరో మూడు కిలోమీటర్లు వెళ్లగానే అప్పాపూర్ కనిపించింది. ఛాన్నాళ్ల తరువాత వెళ్తున్నా అక్కడి వాతావరణం అడుగు పెట్టగానే అర్ధం అయింది.

పెంట అంతా స్మశాన నిశ్శబ్దం. మెల్లగా ముందుకు వెళ్తే అరుగుమీద నల్లమూతుల వెంకటయ్య పడుకుని ఉన్నాడు. పక్కనే ఇల్లు అలుకుతూ అమ్మాయి. ఏకాదశి కదా చెంచులు శివభక్తులు అందుకే అలుకుతున్నారు. వెంకటయ్యతో మాట కలిపి మాట్లాడుతుండగానే తోకల ఈదయ్య, గురువయ్యలు వచ్చి చేరారు. ఈదయ్య వచ్చి ‘‘మీడియా వాళ్లు చాలామంది వచ్చి వెళ్తున్నారు. కానీ ఎవరూ మా వ్యవసాయం గురించి మాట్లాడటం లేదు. ఇక్కడ 30 ఎకరాల పట్టాభూమి ఉంది. బోర్లు వేయిస్తే వ్యవసాయం చేసుకుంటాం’’ అని అడిగాడు. ఇంత వరకు ఎవరూ అడగని ప్రశ్న.

ఆశ్చర్యం ఇక్కడ ఇంతకు ముందు వ్యవసాయం చేసేవారా అని అడిగా..అవును మా నాన్న వాళ్లు చేసేవారు..బోర్లు వేయిస్తే మేమూ చేసుకుంటాం ఐటీడీఏ వాళ్లు మేం కొంత భరిస్తేనే వాళ్లు కొంచెం భరిస్తాం అంటున్నారు అన్నాడు. అందరూ కలిసివస్తే ఓ సారి  పీఓ దగ్గరికి వెళదాం అన్నాడు మిత్రుడు అంజన్న. ఇలా మాట్లాడుతూనే ఉన్నాం.
 50 ఇళ్లున్న పెంటలో మమ్మల్ని కలిసింది...మేం కలిసి మాట్లాడేందుకు లభించింది వారిద్దరేనా అనిపించింది. వారితో మాట్లాడుతున్నా అడవిలో గొడ్డలితో కనిపించిన అతను వచ్చాడు.

అడవిలో కనిపిస్తే సమాధానం చెప్పకుండా వస్తారా ? మనిషి కనిపిస్తే ఆగి ఎక్కడికెళ్తున్నారో చెప్పరా ? అంత బలుపా మీకు ? అంటూ అరుస్తూనే ఉన్నాడు. వెన్నులో సన్నటి వణుకు ఎందుకు అరుస్తున్నాడో అర్ధంకాలే. చెంచులు నచ్చచెబుతున్నా అతడు వినడం లేదు. తరువాత తెలిసింది అతను కూడా అటవీశాఖలో చేరిన వాచర్ అని.

అక్కడి నుండి ఒకతను అనారోగ్యంతో బాధపడుతున్నాడు అని తెలిస్తే వెళ్లాం అతడు లేడు. పక్క గుడిసె బాగుంటే ఓ ఫోటో తీశా..మా పర్మిషన్ లేకుండా మా గుడిసె ఫోటో తీస్తావా అని కొంచెం మోడ్రన్ గా ఉన్న ఓ చెంచు మహిళ గద్దించింది. నా పక్కన అతన్ని అడిగే తీశానని అతన్ని చూయించా..ఇంకే మనకుండా ఇంట్లోకి వెళ్లింది. అన్ని ఇళ్లూ పరిశీలిస్తూ వెళ్తుంటే ఓ చెట్టుకు కట్టిన చీర ఊయలలో చిన్న పాప తనని తనే ఊపుకుంటోంది. ఆ పక్కనే కుక్కలకు అన్నం పెడితే ఎద్దు వచ్చి తింటోంది దీంతో కుక్కలన్నీ ఎద్దు మీదకు వెళ్లాయి. కొమ్ములతోనే ఎద్దు వాటిని బెదిరిస్తోంది.

మెల్లగా ఆశ్రమ పాఠశాల వద్దకు వెళ్లాం..పాఠశాల ముందు అంతా పేడతో నిండింది. ఇప్పుడు పశువులన్నీ అడవిలోకి వెళ్లినట్లుంది. పాఠశాలలో ఎలాంటి సందడి లేదు. నలుగురు పిల్లలు ఆడుకుంటున్నారు. ఆశ్రమ పాఠశాల అయినా ఉపాధ్యాయులు ఎవరూ లేరు. తినడానికి వచ్చే విద్యార్థులకు అన్నం వండిపెట్టారు. ఉపాధ్యాయుల గురించి అడిగితే..అక్కడి వాళ్లు ఇంకా పాఠశాల మొదలుకాలేదని సెలవిచ్చారు.

బయటకు వచ్చాం. అక్కడ ఐదుగురు పిల్లలు. రాళ్లను గోటీలలా గుండ్రంగా తయారు చేసి వాటితోనే ఆడుతున్నారు. వెంబడున్న వారికి థ్యాంక్స్ చెప్పి బయలుదేరాం..మద్యలో పుల్లాయపల్లి. పుల్లాయపల్లికి వెళ్లగానే ఇంటిబయట ఓ కుటుంబం. తల్లి వండుతోంది. తండ్రి నించున్నాడు. పిల్లలు అన్నం పెట్టుకుని కూరకోసం వెయిటింగ్. మమ్మల్ని చూడగానే దూరంగా ఉన్న అటవీ వాచర్లు దగ్గరికి వచ్చారు. వచ్చిన ఇద్దరు మేం మాట్లాడుతున్న గురువయ్య, ఆయన తమ్ముడి కొడుకులే. గురువయ్య కూతురు మూతినిండా పుళ్లయ్యాయి. మందులు తీసుకోలేదా అని అడిగాం నిన్ననే మన్ననూరు వెళ్లి వచ్చామని సమాధానం. అడవిలో పులులున్నాయా ? అని వాచర్లను అడిగాం ఉన్నాయని చెప్పారు. పులులు మనుషుల మీదకు వస్తాయా ? అని గురువయ్యను అడిగాం. రావు..నరుడు నా కంట పడవద్దని పులి ప్రతిరోజూ సూర్యనమస్కారం చేస్తుందని చెప్పాడు.


ఇంటి ముందు దూరంగా అందంగా మర్రిచెట్టు. ఇంటి పక్క చెట్టుకింద రోలు ..రోకలి. అక్కడి బయలుదేరగానే పక్కనే ఉన్న అటవీ గార్డు వాచ్ రూం ముందు మరో వాచర్ ఆపేశాడు. ఆగండి అని సైగ చేశాడు. ఏంటి అని అడిగాం చెప్పడానికి నోరు తిరగడం లేదు. అర్ధమయింది సారా తాగాడు. జేబులోనుండి ఫోన్ తీశాడు. మీ వాళ్లకు చెప్పే వచ్చాం అని చెప్పాం. లేదు ఆగండి అన్నాడు. అర్ధమయింది ఫోటో తీస్తాడని..ఫోటో తీస్తావా అని అడిగాం ..అవును మీకు ఇబ్బంది ఉండదు..నాకూ ఉండదు అని చెప్పాడు. ఫోటో తీయగానే వెళ్లొచ్చా అని అడిగాం..ఆ వెళ్లు అని తలూపాడు. కొంచె ముందుకు రాగానే ఇంతకు ముందు కనిపించిన చోటే జింకలు. ఫోటో తీసుకుందామనే లోపు మళ్లీ పారిపోయాయి. ఫరహాబాద్ చెక్ పోస్టు వద్దకు వచ్చి రెండు ఫోటోలు దిగగానే కెమెరా బ్యాటరీ లో అని వస్తోంది. హమ్మయ్య పని అయిపోయింది అని తారు రోడ్డుమీదెక్కి మన్ననూరు వచ్చేశాం.











3 కామెంట్‌లు: