23, నవంబర్ 2011, బుధవారం

మూడో రోజూ తెలంగానం


అధిక ధరలు, నల్లధనం, ప్రత్యేక తెలంగాణ నినాదాలతో పార్లమెంటు ఉభయ సభలు మూడోరోజు కూడా ప్రారంభం

అయిన కొద్ది సేపటికే వాయిదా పడ్డాయి. గురువారం ఉభయ సభలు ప్రారంభం కాగానే ప్రతిపక్షాలు వాయిదా తీర్మానాలపై చర్చ జరపాలంటూ పట్టుబట్టాయి. తెలంగాణ ఎంపీలు స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లి తెలంగాణ నినాదాలు చేశారు. తెలంగాణ రాష్ట్రం ప్రకటించాలని డిమాండ్ చేశారు.
ప్రత్యేక తెలంగాణ నినాదాలతో లోక్ సభ, రాజ్యసభల్లో గందరగోళం నెలకొంది. సభా కార్యక్రమాలకు సజావుగా కొనసాగేందుకు అవకాశం లేకపోవటంతో ఉభయ సభలు మధ్యాహ్నం 12 గంటల వరకూ వాయిదా పడ్డాయి. మొదట కేసీఆర్, విజయశాంతి తెలంగాణ నినాదాలు చేయడంతో వెంటనే కాంగ్రెస్, టీడీపీ నేతలు తెలంగాణ నినాదాలు ప్రారంభించారు.

19, నవంబర్ 2011, శనివారం

వైఎస్ బాటలోనే కిరణ్ : హరీష్‌రావు


తెలంగాణ ప్రాంతానికి దక్కాల్సిన మైనింగ్, గిరిజన యూనివర్సిటీలు, సైనిక్ స్కూళ్లను ముఖ్యమంత్రి సీమాంధ్ర

 ప్రాంతానికి తరలించారని విమర్శించారు. సమైక్యం అంటూ తెలంగాణ నిధులను తరలించుకుపోతున్న నేతలకు బుద్ధి చెప్పాలంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే మార్గమని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు.
నాడు వైఎస్ రాజశేఖరరెడ్డి తెలంగాణ నిధులను కడప జిల్లాకు తరలిస్తే, ముఖ్యమంత్రి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి చిత్తూరు జిల్లాకు తెలంగాణ నిధులను తరలిస్తున్నారని హరీష్‌రావు ఆరోపించారు. తెలంగాణ నిధులను తరలిస్తూనే కలిసి ఉందామని కథలు చెబుతున్నారని విమర్శించారు. తెలంగాణకు వచ్చిన వాటిని తెలంగాణలోనే  ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

18, నవంబర్ 2011, శుక్రవారం

తెలంగాణపై ఎస్సార్సీ వేయం : ఏఐసీసీ


తెలంగాణ సమస్యను, ఎస్సార్సీతో ముడిపెట్టలేమని ఏఐసీసీ అధికార ప్రతినిధి రషీద్ అల్వీ స్పష్టం చేశారు. రెండు అంశాలను వేరుగా చూడాలని అన్నారు. ఎస్సార్సీ పరిధి నుంచి తెలంగాణను వేరుగా చూస్తున్నామన్నారు. వనరులు, సాధ్యాసాధ్యాల్ని రాష్ట్రాల ఏర్పాటుకు కమిషన్ ప్రతిపాదనలు ఇస్తుందని ఆయన అన్నారు. దేశంలోని చిన్న రాష్ట్రాల ఏర్పాటును పరిశీలించడమే తమ అభిమతమని ఆయన మీడియాతో అన్నారు.
తెలంగాణ సమస్యను ఏఐఐసీసీ ప్రత్యేకంగా పరిగణిస్తోందని ఆయన చెప్పారు. తెలంగాణపై రెండో ఎస్సార్సీ వేయట్లేదని ఆయన స్ఫష్టం చేశారు. యూపీ విషయంలో రెండో ఎస్సార్సీపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.

14, నవంబర్ 2011, సోమవారం

రాజీనామాలు ఇప్పుడు అప్రస్తుతం : ఎర్రబెల్లి


తాము చేసిన రాజీనామాలు ఆమోదించమని స్పీకర్ వద్దకు తామొక్కరమే వెళ్లడం సరికాదని తెలంగాణ

 టీడీపీ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు.  టీడీఎల్పీ కార్యాలయంలో సీనియర్ ఎమ్మెల్యేలు మోత్కుపల్లి నర్సింహులు, ఎల్.రమణలతో కలిసి మీడియాతో మాట్లాడారు. రాజీనామాల విషయం ప్రస్తుతానికి అనవసర అంశమని అన్నారు. రాజీనామాలపై స్పీకర్ నిర్ణయం తీసుకునేంత వరకు మాత్రం అసెంబ్లీకి హాజరు కామన్నారు.
కాంగ్రెస్ తెలంగాణ లీడర్లు టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకొని అంతర్గతంగా ఏమి ఒప్పందం చేసుకున్నారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. పోలవరం టెండర్ల విషయంలో సీఎం స్వయంగా కాగితాలు మారుస్తూ టీఆర్‌ఎస్‌కు టెండర్ దక్కే విధంగా చేశాడని, దీనిని ప్రజల దృష్టికి తీసుకు అందరం రాజీనామాలు చేసి కలిసి ఉద్యమిద్దామంటే , తెలంగాణ కోసం పార్టీ పెట్టిన కేసిఆర్ ఎందుకు కలిసిరావడం లేదని మోత్కుపల్లి ప్రశ్నించారు.

13, నవంబర్ 2011, ఆదివారం

పరకాల ప్రభాకర్ కు దేహశుద్ది


విశాలాంధ్ర మహాసభ పేరుతో గత కొన్నాళ్లుగా సదస్సులు నిర్వహిస్తున్న మాజీ ప్రజారాజ్యం పార్టీ నేత, జర్నలిస్టు పరకాల ప్రభాకర్ పై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. హైదరాబాద్ లోని జర్నలిస్ట్ కాలనీలో ఈ సంఘటన జరిగింది. దీంతో పోలీసులు టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్, పరకాల ప్రభాకర్ ను అరెస్టు చేసిన పోలీసులు చంద్రశేఖర్‌ను గోల్కోండ పోలీస్ స్టేషన్‌కు, పరకాలను బంజారాహిల్స్ పీఎస్‌కు తరలించారు.  శుక్రవారం బషీర్ బాగ్ లో, అంతకుముందు సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో పరకాల నిర్వహించిన సదస్సులు వివాదాస్పదం అయ్యాయి.
తెలంగాణలో సమైక్యాంధ్ర వాదన వినిపించి ప్రజలను ఒప్పిస్తానని, దానికి సహకరించే దమ్ము తెలంగాణ నేతలకు ఉందా ? అని పరకాల ప్రభాకర్ సవాల్ విసిరారు. దీనికి స్పందించిన చంద్రశేఖర్ తన నియోజక వర్గం అయిన వికారాబాద్‌కు వచ్చి తెలంగాణ వాదం లేదని ఒక్కరితో అనిపించినా తాము ఉద్యమం చేయడం మానేస్తామని సవాల్ విసిరారు. ఏబీఎన్ ఆంద్రజ్యోతి చానల్‌లో జరిగిన చర్చల్లో వీరి మధ్య ఈ చర్చ చోటు చేసుకుంది. దీంతో  ఏకీభవించిన పరకాల ఏబీఎన్ ఆంధ్రజ్యోతి నుంచి బయలుదేరుదామని ఒప్పందం చేసుకున్నారు. ఈరోజు మధ్యాహ్నం ఏబీఎన్ కార్యాలయానికి చేరుకున్న ఇద్దరు వికారాబాద్ బయలుదేరేందుకు సిద్ధమయ్యారు. బయట ఉన్న తెలంగాణవాదులు అనూహ్యంగా  పరకాల ప్రభాకర్ పై దాడి చేశారు. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
కొద్దిరోజుల క్రితం ప్రొఫెసర్ జయశంకర్ అబద్దాల కోరు అని పరకాల వాదించారు. దీంతో తెలంగాణ వాదులు దాడికి సిద్దపడినట్లు తెలుస్తోంది. తెలంగాణలో తెలంగాణ వారు సమావేశాలు, సభలు పెట్టుకుట్టామంటే అనుమతులు ఇవ్వని పోలీసులు, ప్రభుత్వం పరకాలకు అనుమతులు ఎందుకు ఇస్తున్నారని టీఆర్ఎస్ నేత శ్రవణ్ కుమార్ ప్రశ్నించారు. రెండు ప్రాంతాల ప్రజలను రెచ్చగొట్టేలా చర్చలు పెడుతున్న పరకాలకు అనుమతులు ఇప్పించి ప్రభుత్వం పరోక్షంగా సహకరిస్తుందని విమర్శించారు.

పరకాల ఓ పిచ్చి కుక్క


పీఆర్పీలో ఉన్నప్పుడు సామాజిక తెలంగాణ.. బీజేపీలో ఉన్నప్పుడు ప్రత్యేక తెలంగాణ.. ఇప్పుడేమో విశాలాంధ్ర తిరుగుతూ పరకాల ప్రభాకర్ తెలంగాణపై ఓ పిచ్చి కుక్కలా మాట్లాడుతున్నారని జయశంకర్ సెంటర్ నేత, రాజకీయ విశ్లేషకులు వి. ప్రకాష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
విశాలాంధ్ర కోసం ఇంట్లో కుటుంబ సభ్యులనే ఒప్పించలేని వ్యక్తి తెలంగాణ ప్రజలను ఒప్పిస్తాను అనడం సిగ్గు చేటని అన్నారు.  ప్రొ.జయశంకర్ చెప్పినవి అబద్ధాలు అని నిరూపించినా, తెలంగాణకు వనరుల దోపిడీ జరగలేదని చూపించినా ఉద్యమం నుంచి తప్పుకుంటామని తేల్చి చెప్పారు. ఒక వేళ పరకాల ప్రభాకర్ చెప్పినవి అబద్ధాలు అయితే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లగడపాటి, రాయపాటి లాంటి వాళ్ల డబ్బు సంచులకు ఆశపడి తెలంగాణపై విషం కక్కుతున్నారని విమర్శించారు.

12, నవంబర్ 2011, శనివారం

కళ్లులేని కబోది ప్రధాని : కేసీఆర్


‘‘ప్రజా ఉద్యమాల మీద, ప్రజాస్వామిక మౌలిక విలువల మీద ప్రధానికి గౌరవం లేదు. తెలంగాణ ప్రజల

 ఉద్యమ స్ఫూర్తిని కళ్లుండి కూడా చూడలేని కబోది ప్రధాని మన్మోహన్ సింగ్’’ అని టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు విమర్శించారు. తెలంగాణపై ప్రధాని చేసిన వ్యాఖ్యలపై పై విధంగా ఆయన స్పందించారు.
తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్  తెలంగాణ ప్రజల కోపాన్ని రుచిచూస్తుందని హెచ్చరించారు. అన్నిరకాలు పోరాటాలు చేద్దాం. దానికి నేను అండగా ఉంటా. తెలంగాణను సాధించుకుందామని కేసీఆర్ పిలుపునిచ్చారు. ప్రధాని వ్యాఖ్యలను తెలంగాణ రాజకీయ జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరాం తప్పుపట్టారు. కాంగ్రెస్ కు ఖతం కరో అనే నినాదంతో తాము తెలంగాణ ప్రజల్లోకి వెళ్తామని, అసలు తెలంగాణ సమస్య నిన్న, మొన్నటిది అన్నట్లు ప్రధాని మాట్లాడుతున్నారని విమర్శించారు.

శాంతి, ఏకాభిప్రాయం, తెలంగాణ : ప్రధాని


తెలంగాణపై ఏకాభిప్రాయ సాధన కోసం కృషి చేస్తున్నామని, అంతకంటే ముందు తెలంగాణలో

 శాంతియుత వాతావరణం ఏర్పడాలని ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ అన్నారు. శనివారం మాల్దీవుల నుండి తిరిగివస్తూ ఆయన ప్రత్యేక విమానంలో మీడియాతో మాట్లాడారు. ”తెలంగాణ చాలా సంక్లిష్టమైన సమస్య. ఏకాభిప్రాయం రావాలని మేం కోరుకుంటున్నాం. అన్ని ప్రాంతాల ప్రజలు ఈ పరిష్కారం అత్యుత్తమమని భావించేలా వుండాలనుకుంటున్నాం. కేవలం తెలంగాణ ఇస్తామని అంగీకరించడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించలేం. ఎందుకంటే ఇతర ప్రాంతాల్లో కల్లోలానికి, అశాంతికి దారి తీస్తుంది.” అని ప్రధాని పేర్కొన్నారు. 
                 తెలంగాణపై కేంద్రం ఏం ఆలోచిస్తున్నదని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన పైవిధంగా సమాధానమిచ్చారు. ఈ సమస్యకు తగిన పరిష్కారం కోసం, అన్ని ప్రాంతాల వారికి ఆమోదయోగ్యంగా వుండేలా ఆచరణాత్మక పద్ధతులు, మార్గాలను అన్వేషించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. మొత్తానికి మన్మోహన్ మాటలు చూస్తే కాంగ్రెస్ తెలంగాణ సమస్యను నానబెట్టేందుకే సిద్దమయిందని, సీమాంధ్ర పెట్టుబడిదారులు కేంద్ర ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ అధిష్టానాన్ని బాగానే మేనేజ్ చేస్తున్నారని తేలిపోయింది.

నాగం రాజీనామా ఆమోదం


తెలంగాణ కోసం రాజీనామా చేసిన తెలంగాణ నగారా సమితి నేత,  ఎమ్మెల్యే నాగం జనార్ధన రెడ్డి, మరో టీడీపీ అసమ్మతి ఎమ్మెల్యే  నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిల రాజీనామాలను శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఆమోదించారు. వీరిద్దరూ తెలుగుదేశం పార్టీపై తిరగబడిన ఎమ్మెల్యేలే.
తన రాజీనామాను ఆమోదించాలని, స్పీకర్ ఎందుకు ఆమోదించలేదో ప్రశ్నించాలని డిమాండ్ చేస్తూ నాగం జనార్ధన్ రెడ్డి శుక్రవారం  హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆయన పిటిషన్ హైకోర్టులో మంగళవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఈలోపలే ఆయన రాజీనామాని స్పీకర్ ఆమోదించారు. ప్రసన్న కుమార్ రెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలని తెలుగుదేశం పార్టీ కోరింది. దానిని స్పీకర్ తోసిపుచ్చారు.
కాంగ్రెస్ ను వీడి జగన్ పార్టీ వైపు వెళ్లిన 26 మంది ఎమ్మెల్యేల గురించి మాత్రం స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీనిని బట్టి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ మనుగడకు ఎలాంటి ఇబ్బంది లేకుండా స్పీకర్ వ్యవహరిస్తున్నట్లు తేలిపోయింది.

11, నవంబర్ 2011, శుక్రవారం

రెండో ఎస్సార్సీ అంటే మెరుపు సమ్మె


తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం విషయంలో కేంద్ర ప్రభుత్వం రెండో ఎస్సార్సీ అంటే మెరుపు సమ్మెకు దిగుతామని తెలంగాణ గెజిటెడ్‌ ఉద్యోగుల సంఘం అధ్య క్షుడు శ్రీనివాస్‌గౌడ్‌ హెచ్చరించారు. ప్రజాప్రతినిధులంతా ఉద్యోగులతో కలిసి రావాలని ఆయన డిమాండ్ చేశారు. కొంత మంది తెలంగాణ ప్రజా ప్రతినిధుల వైఖరి వల్లే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆలస్యం అవుతుందని ఆయన మండిపడ్డారు.

తెలంగాణలో సకల జనుల సమ్మెను విరమిస్తేనే తెలంగాణ గురించి స్పష్టమయిన ప్రకటన చేస్తామని గులాం నబీ ఆజాద్ సూచించారని, ఆయన విన్నపం మేరకు తాము సకల జనుల సమ్మెను విరమించామని, మళ్లీ తెలంగాణ విషయంలో మోసం చేస్తే సమ్మె చేసేందుకు వెనకడుగు వేయమని హెచ్చరించారు.
దీంతో పాటు  చిన్న రాష్ట్రాల ఏర్పాటును సమర్థించిన బీజేపీ, రెండో ఎస్సార్సీని వ్యతిరేకిస్తుందని ఆ పార్టీ నేత బండారు దత్తాత్రేయ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు రెండో ఎస్సార్సీ అంటూ కొత్త నాటకాన్ని తెరపైకి తీసుకు వచ్చిందని మండిపడ్డారు. చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు రెండో ఎస్సార్సీ పరిష్కారం కాదని ఆయన స్పష్టం చేశారు.
మహబూబ్ నగర్ జిల్లా ఊట్కూర్‌లో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన మంత్రి డీకే అరుణను తెలంగాణ వాదులు అడ్డుకున్నారు. తెలంగాణ ద్రోహి అయిన డీకే అరుణ వెళ్లిపోవాలని పెద్ద ఎత్తున తెలంగాణవాదులు నినాదాలు చేశారు. దీంతో రచ్చబండ రసాభాసగా మారింది. 

ఎస్సార్సీ కాలం చెల్లిన మందు : నారాయణ


రెండో ఎస్‌ఆర్‌సి అనేది అవుట్ డేటెడ్ మెడిసిన్ వంటిదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు.

 విజయవాడలో ఆయన తెలంగాణ అంశంపై మాట్లాడారు. రెండో ఎస్సార్సీయే కాంగ్రెస్ పార్టీ విధానం అని చెప్పడానికి ఇన్ని కమిటీలు ? ఇంత కాలయాపన అవసరమా ? అని ఆయన ప్రశ్నించారు.  కాంగ్రెస్‌ది శాడిస్ట్‌ లక్షణమని, అందుకే రాష్ట్రాన్ని ఫుట్‌బాల్‌ ఆడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రెండో ఎస్‌ఆర్‌సి కాంగ్రెస్ పార్టీ విధానమే అయితే రాష్ట్రంలో మీ పుట్టి మునగడం ఖాయమని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్‌ ఎంపీల సాయంతో నడుస్తున్న కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని బ్రష్టు పట్టించే విధంగా వ్యవహరించడం సరికాదని అన్నారు.ఈ రాష్ట్రం ఏమైపోయినా సరే కాంగ్రెస్‌ను ఎలా బతికించుకోవాలనేదే ఆ పార్టీ నేతల యోచనగా వుందని అన్నారు. అనిశ్చితి వున్న చోట అభివృద్ధి అసాధ్యమని, కాంగ్రెస్‌ చేసిన రాజకీయ తప్పిదానికి ఆపార్టీ సర్వనాశనం కాక తప్పదన్నారు. తెలంగాణ అంశం వెంటనే తేల్చాలని అన్నారు.

9, నవంబర్ 2011, బుధవారం

కాంగ్రెస్ నోట మళ్లీ ఎస్సార్సీ మాట


తెలంగాణ విషయంలో కాంగ్రెస్‌ పార్టీ నోట పాతపాట మరోసారి విన్పించింది. కొత్తగా ప్రత్యేక రాష్ట్రాల ఏర్పాటుకు రాష్ట్రాల పునర్విభజన కమిషన్‌ (ఎస్‌ఆర్‌సి) ఒక్కటే ప్రత్యామ్నాయమని కాంగ్రెస్‌ పార్టీ సూచన ప్రాయంగా వెల్లడించింది. ఢిల్లీలో ఆ పార్టీ అధికార ప్రతినిధి రషీద్‌ అల్వీ, బోఫాల్‌లో పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజరు సింగ్‌లు ఒకేసారి ఈ ప్రకటన చేయడం  రాష్ట్రంలో కలకలం సృష్టించింది.                                                                                   దేశవ్యాప్తంగా చిన్న రాష్ట్రాల ఏర్పాటుపై ఒక ప్రత్యేక కమిషన్‌ను నియమించాలని ఎఐసిసి అధికార ప్రతినిధి రషీద్‌ అల్వీ అన్నారు. ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. ఈనెల 10వ తేదీ తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి పి.చిదంబరం తెలంగాణకు సంబంధించి ఒక ప్రకటన చేస్తారని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి గులాంనబీ ఆజాద్‌ ప్రకటించిన మరునాడే రషీద్‌ అల్వీ ఈ ప్రకటన చేయడం విశేషం. తెలంగాణ సమస్య కూడా ప్రత్యేక కమిషన్‌ ద్వారానే పరిష్కార మవుతుందని రషీద్‌ అల్వీ అన్నారు. దేశంలోని పలు ప్రాంతాల్లో రాష్ట్రాల ఏర్పాటు కోసం డిమాండ్లు వస్తున్న నేప థ్యంలో ప్రత్యేక కమిషన్‌ను నియమించడమొక్కటే పరిష్కారమని ఆయన అభిప్రాయపడ్డారు.
చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు ప్రత్యేక కమిషన్‌ వేయాలి. తెలంగాణ సమస్య కూడా ఇలాంటి కమిషన్‌ ద్వారానే పరిష్కారమవుతుంది. దేశంలో చాలా చోట్ల చిన్న రాష్ట్రాల డిమాండ్‌ వుంది. చిన్న రాష్ట్రాల డిమాండ్‌ దృష్ట్యా ప్రత్యేక కమిషన్‌ ఏర్పాటు అవసరం వుంది. నేను చిన్న రాష్ట్రాల పట్ల కాంగ్రెస్‌ పార్టీ విధానాన్ని చెపుతున్నాను. అందులో మార్పు వుండదు అని ఆయన పునరుద్ఘాటించారు. కాంగ్రెస్‌ పార్టీ దేశవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటుందని అన్నారు. కేవలం ఒక రాష్ట్రాన్ని దృష్టిలో వుంచుకొని ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడం జరగదని స్పష్టంచేశారు. దేశప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవడం అవసర మన్నారు. అయితే తెలంగాణకు ఇదే సూత్రం వర్తిస్తుందా అన్న అంశంపై రషీద్‌అల్వీ స్పష్టత ఇవ్వలేదు.
తెలంగాణ సమస్య భిన్నమైనదేమీ కాదు. కాకపోతే క్లిష్టమైనది. అంతేగాకుండా ఈ సమస్య చాలా కాలంగా కొనసాగుతున్నది. ఈ అంశాన్ని ఆంధ్ర ప్రదేశ్‌ పార్ట్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జి గులాంనబీ ఆజాద్‌ చూస్తున్నారు. ఈ విషయం గురించి ఆయననే అడిగితే మంచిది. కాకపోతే చిన్నరాష్ట్రాల సమస్య అంతా ఒక్కటేనన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి” అని ఆయనన్నారు. భోపాల్‌లో జరిగిన ఒక సమావేశంలో కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి దిగ్విజరుసింగ్‌ మాట్లాడుతూ, తెలంగాణతోపాటు చిన్న రాష్ట్రాల విషయంలో కాంగ్రెస్‌ వైఖరి స్పష్టంగా వుందని చెప్పారు. ఇటువంటి సమస్యల పరిష్కారానికి రెండవ ఎస్సార్సీ ఒక్కటే పరిష్కారమార్గమని ఆయనన్నారు. సమయానుకూలంగా ఎస్సార్సీని ఏర్పాటు చేయడం అవసరమన్నారు.

6, నవంబర్ 2011, ఆదివారం

కోమటిరెడ్డిపై కేసు


మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై నల్లగొండ పోలీసులు 309 సెక్షన్‌కింద ఆత్మహత్యయత్నం కేసు నమోదు చేశారు. ఈ కేసు నల్లగొండ వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో నమోదయ్యింది. అయితే తెలంగాణ కోసం నిరాహార దీక్ష చేస్తున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై ప్రభుత్వం ఆత్మహత్యాయత్నం కేసుపెట్టడాన్ని టీఆర్‌ఎస్ శాసన సభ్యుడు కల్వకుంట్ల తారక రామారావు ఖండించాడు.
ఇంత దుర్మార్గపు చర్యకు పాల్పడిన ప్రభుత్వంలో హోంమంత్రిగా తెలంగాణ ఆడబిడ్డ సబితా ఇంద్రారెడ్డి పని చేయడం తగదన్నారు. ఉద్యమంలో ఉన్నామనే తెలంగాణ మంత్రులు జానారెడ్డి, తదితరులు ఈ కేసు విషయమై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రులకు తెలియకుండా నిర్ణయాలు తిసుకునే ప్రభుత్వంలో పనిచేయడం సిగ్గు చేటని ఎద్దేవా చేశారు. ప్రజాసామ్యాన్ని ఈ ప్రభుత్వం పోలీసు రాజ్యంగా మార్చిందని ఆరోపించారు.
                                                 తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేస్తున్న ఆమరణ నిరాహారదీక్ష ఏడోరోజుకు చేరుకుంది. కోమటిరెడ్డి ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తుంది. ఉపిరితిత్తులలో ఇన్‌ఫెక్షన్ సోకడంతో పరిస్థితి విషమంగా ఉంది. మూత్ర పిండాల నొప్పితో బాధ పడుతున్నారు. పొటాషియం లెవల్స్ దారుణంగా పడిపోయాయి.
కోమటిరెడ్డి వెంకటరెడ్డిని జగిత్యాల మాజీ శాసన సభ్యుడు, మాజీ మంత్రి జీవన్‌రెడ్డి నిమ్స్ ఆసుపత్రిలో పరామర్శంచారు. కేంద్ర ప్రభుత్వం నాన్చుడు ధోరణ వల్లే కోమటిరెడ్డి దీక్ష చేపట్టారని అన్నారు. తెగించి కొట్లడితేనే తెలంగాణ వస్తుందని జీవన్‌రెడ్డి అన్నారు. నిమ్స్‌లో కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పరామర్శించిన ఆయన విలేకరులతో మాట్లాడారు. డిసెంబర్ 9 ప్రకటనకు కేంద్రం కట్టుబడి ఉండాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి మేనేజ్‌మెంట్‌లో తెలంగాణ కాంగ్రేస్ నేతలు పడవద్దని సూచించారు