23, నవంబర్ 2011, బుధవారం

మూడో రోజూ తెలంగానం


అధిక ధరలు, నల్లధనం, ప్రత్యేక తెలంగాణ నినాదాలతో పార్లమెంటు ఉభయ సభలు మూడోరోజు కూడా ప్రారంభం

అయిన కొద్ది సేపటికే వాయిదా పడ్డాయి. గురువారం ఉభయ సభలు ప్రారంభం కాగానే ప్రతిపక్షాలు వాయిదా తీర్మానాలపై చర్చ జరపాలంటూ పట్టుబట్టాయి. తెలంగాణ ఎంపీలు స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లి తెలంగాణ నినాదాలు చేశారు. తెలంగాణ రాష్ట్రం ప్రకటించాలని డిమాండ్ చేశారు.
ప్రత్యేక తెలంగాణ నినాదాలతో లోక్ సభ, రాజ్యసభల్లో గందరగోళం నెలకొంది. సభా కార్యక్రమాలకు సజావుగా కొనసాగేందుకు అవకాశం లేకపోవటంతో ఉభయ సభలు మధ్యాహ్నం 12 గంటల వరకూ వాయిదా పడ్డాయి. మొదట కేసీఆర్, విజయశాంతి తెలంగాణ నినాదాలు చేయడంతో వెంటనే కాంగ్రెస్, టీడీపీ నేతలు తెలంగాణ నినాదాలు ప్రారంభించారు.

19, నవంబర్ 2011, శనివారం

వైఎస్ బాటలోనే కిరణ్ : హరీష్‌రావు


తెలంగాణ ప్రాంతానికి దక్కాల్సిన మైనింగ్, గిరిజన యూనివర్సిటీలు, సైనిక్ స్కూళ్లను ముఖ్యమంత్రి సీమాంధ్ర

 ప్రాంతానికి తరలించారని విమర్శించారు. సమైక్యం అంటూ తెలంగాణ నిధులను తరలించుకుపోతున్న నేతలకు బుద్ధి చెప్పాలంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే మార్గమని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు.
నాడు వైఎస్ రాజశేఖరరెడ్డి తెలంగాణ నిధులను కడప జిల్లాకు తరలిస్తే, ముఖ్యమంత్రి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి చిత్తూరు జిల్లాకు తెలంగాణ నిధులను తరలిస్తున్నారని హరీష్‌రావు ఆరోపించారు. తెలంగాణ నిధులను తరలిస్తూనే కలిసి ఉందామని కథలు చెబుతున్నారని విమర్శించారు. తెలంగాణకు వచ్చిన వాటిని తెలంగాణలోనే  ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

18, నవంబర్ 2011, శుక్రవారం

తెలంగాణపై ఎస్సార్సీ వేయం : ఏఐసీసీ


తెలంగాణ సమస్యను, ఎస్సార్సీతో ముడిపెట్టలేమని ఏఐసీసీ అధికార ప్రతినిధి రషీద్ అల్వీ స్పష్టం చేశారు. రెండు అంశాలను వేరుగా చూడాలని అన్నారు. ఎస్సార్సీ పరిధి నుంచి తెలంగాణను వేరుగా చూస్తున్నామన్నారు. వనరులు, సాధ్యాసాధ్యాల్ని రాష్ట్రాల ఏర్పాటుకు కమిషన్ ప్రతిపాదనలు ఇస్తుందని ఆయన అన్నారు. దేశంలోని చిన్న రాష్ట్రాల ఏర్పాటును పరిశీలించడమే తమ అభిమతమని ఆయన మీడియాతో అన్నారు.
తెలంగాణ సమస్యను ఏఐఐసీసీ ప్రత్యేకంగా పరిగణిస్తోందని ఆయన చెప్పారు. తెలంగాణపై రెండో ఎస్సార్సీ వేయట్లేదని ఆయన స్ఫష్టం చేశారు. యూపీ విషయంలో రెండో ఎస్సార్సీపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.

14, నవంబర్ 2011, సోమవారం

రాజీనామాలు ఇప్పుడు అప్రస్తుతం : ఎర్రబెల్లి


తాము చేసిన రాజీనామాలు ఆమోదించమని స్పీకర్ వద్దకు తామొక్కరమే వెళ్లడం సరికాదని తెలంగాణ

 టీడీపీ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు.  టీడీఎల్పీ కార్యాలయంలో సీనియర్ ఎమ్మెల్యేలు మోత్కుపల్లి నర్సింహులు, ఎల్.రమణలతో కలిసి మీడియాతో మాట్లాడారు. రాజీనామాల విషయం ప్రస్తుతానికి అనవసర అంశమని అన్నారు. రాజీనామాలపై స్పీకర్ నిర్ణయం తీసుకునేంత వరకు మాత్రం అసెంబ్లీకి హాజరు కామన్నారు.
కాంగ్రెస్ తెలంగాణ లీడర్లు టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకొని అంతర్గతంగా ఏమి ఒప్పందం చేసుకున్నారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. పోలవరం టెండర్ల విషయంలో సీఎం స్వయంగా కాగితాలు మారుస్తూ టీఆర్‌ఎస్‌కు టెండర్ దక్కే విధంగా చేశాడని, దీనిని ప్రజల దృష్టికి తీసుకు అందరం రాజీనామాలు చేసి కలిసి ఉద్యమిద్దామంటే , తెలంగాణ కోసం పార్టీ పెట్టిన కేసిఆర్ ఎందుకు కలిసిరావడం లేదని మోత్కుపల్లి ప్రశ్నించారు.

13, నవంబర్ 2011, ఆదివారం

పరకాల ప్రభాకర్ కు దేహశుద్ది


విశాలాంధ్ర మహాసభ పేరుతో గత కొన్నాళ్లుగా సదస్సులు నిర్వహిస్తున్న మాజీ ప్రజారాజ్యం పార్టీ నేత, జర్నలిస్టు పరకాల ప్రభాకర్ పై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. హైదరాబాద్ లోని జర్నలిస్ట్ కాలనీలో ఈ సంఘటన జరిగింది. దీంతో పోలీసులు టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్, పరకాల ప్రభాకర్ ను అరెస్టు చేసిన పోలీసులు చంద్రశేఖర్‌ను గోల్కోండ పోలీస్ స్టేషన్‌కు, పరకాలను బంజారాహిల్స్ పీఎస్‌కు తరలించారు.  శుక్రవారం బషీర్ బాగ్ లో, అంతకుముందు సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో పరకాల నిర్వహించిన సదస్సులు వివాదాస్పదం అయ్యాయి.
తెలంగాణలో సమైక్యాంధ్ర వాదన వినిపించి ప్రజలను ఒప్పిస్తానని, దానికి సహకరించే దమ్ము తెలంగాణ నేతలకు ఉందా ? అని పరకాల ప్రభాకర్ సవాల్ విసిరారు. దీనికి స్పందించిన చంద్రశేఖర్ తన నియోజక వర్గం అయిన వికారాబాద్‌కు వచ్చి తెలంగాణ వాదం లేదని ఒక్కరితో అనిపించినా తాము ఉద్యమం చేయడం మానేస్తామని సవాల్ విసిరారు. ఏబీఎన్ ఆంద్రజ్యోతి చానల్‌లో జరిగిన చర్చల్లో వీరి మధ్య ఈ చర్చ చోటు చేసుకుంది. దీంతో  ఏకీభవించిన పరకాల ఏబీఎన్ ఆంధ్రజ్యోతి నుంచి బయలుదేరుదామని ఒప్పందం చేసుకున్నారు. ఈరోజు మధ్యాహ్నం ఏబీఎన్ కార్యాలయానికి చేరుకున్న ఇద్దరు వికారాబాద్ బయలుదేరేందుకు సిద్ధమయ్యారు. బయట ఉన్న తెలంగాణవాదులు అనూహ్యంగా  పరకాల ప్రభాకర్ పై దాడి చేశారు. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
కొద్దిరోజుల క్రితం ప్రొఫెసర్ జయశంకర్ అబద్దాల కోరు అని పరకాల వాదించారు. దీంతో తెలంగాణ వాదులు దాడికి సిద్దపడినట్లు తెలుస్తోంది. తెలంగాణలో తెలంగాణ వారు సమావేశాలు, సభలు పెట్టుకుట్టామంటే అనుమతులు ఇవ్వని పోలీసులు, ప్రభుత్వం పరకాలకు అనుమతులు ఎందుకు ఇస్తున్నారని టీఆర్ఎస్ నేత శ్రవణ్ కుమార్ ప్రశ్నించారు. రెండు ప్రాంతాల ప్రజలను రెచ్చగొట్టేలా చర్చలు పెడుతున్న పరకాలకు అనుమతులు ఇప్పించి ప్రభుత్వం పరోక్షంగా సహకరిస్తుందని విమర్శించారు.

పరకాల ఓ పిచ్చి కుక్క


పీఆర్పీలో ఉన్నప్పుడు సామాజిక తెలంగాణ.. బీజేపీలో ఉన్నప్పుడు ప్రత్యేక తెలంగాణ.. ఇప్పుడేమో విశాలాంధ్ర తిరుగుతూ పరకాల ప్రభాకర్ తెలంగాణపై ఓ పిచ్చి కుక్కలా మాట్లాడుతున్నారని జయశంకర్ సెంటర్ నేత, రాజకీయ విశ్లేషకులు వి. ప్రకాష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
విశాలాంధ్ర కోసం ఇంట్లో కుటుంబ సభ్యులనే ఒప్పించలేని వ్యక్తి తెలంగాణ ప్రజలను ఒప్పిస్తాను అనడం సిగ్గు చేటని అన్నారు.  ప్రొ.జయశంకర్ చెప్పినవి అబద్ధాలు అని నిరూపించినా, తెలంగాణకు వనరుల దోపిడీ జరగలేదని చూపించినా ఉద్యమం నుంచి తప్పుకుంటామని తేల్చి చెప్పారు. ఒక వేళ పరకాల ప్రభాకర్ చెప్పినవి అబద్ధాలు అయితే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లగడపాటి, రాయపాటి లాంటి వాళ్ల డబ్బు సంచులకు ఆశపడి తెలంగాణపై విషం కక్కుతున్నారని విమర్శించారు.

12, నవంబర్ 2011, శనివారం

కళ్లులేని కబోది ప్రధాని : కేసీఆర్


‘‘ప్రజా ఉద్యమాల మీద, ప్రజాస్వామిక మౌలిక విలువల మీద ప్రధానికి గౌరవం లేదు. తెలంగాణ ప్రజల

 ఉద్యమ స్ఫూర్తిని కళ్లుండి కూడా చూడలేని కబోది ప్రధాని మన్మోహన్ సింగ్’’ అని టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు విమర్శించారు. తెలంగాణపై ప్రధాని చేసిన వ్యాఖ్యలపై పై విధంగా ఆయన స్పందించారు.
తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్  తెలంగాణ ప్రజల కోపాన్ని రుచిచూస్తుందని హెచ్చరించారు. అన్నిరకాలు పోరాటాలు చేద్దాం. దానికి నేను అండగా ఉంటా. తెలంగాణను సాధించుకుందామని కేసీఆర్ పిలుపునిచ్చారు. ప్రధాని వ్యాఖ్యలను తెలంగాణ రాజకీయ జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరాం తప్పుపట్టారు. కాంగ్రెస్ కు ఖతం కరో అనే నినాదంతో తాము తెలంగాణ ప్రజల్లోకి వెళ్తామని, అసలు తెలంగాణ సమస్య నిన్న, మొన్నటిది అన్నట్లు ప్రధాని మాట్లాడుతున్నారని విమర్శించారు.