9, డిసెంబర్ 2013, సోమవారం

చంద్రబాబు చెల్లని నోటు !

2009 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ మాజీ మంత్రి షబ్బీర్ అలీ గురించి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎల్లారెడ్డి ఎన్నికల సభలో
ఓ ప్రశ్న వేశారు. "కామారెడ్డిల చెల్లని రూపాయి ఎల్లారెడ్డిల చెల్తదా ? అని జనాన్ని ప్రశ్నించారు. చెల్లని రూపాయి ఎక్కడయినా చెల్లదు" అని జనం సమాధానం ఇచ్చారు.

కేసీఆర్ చెప్పినదానికి జర్రంత ఎక్వ తక్వ కాకుంట ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నడు. తెలంగాణ ఓట్ల కోసం కేంద్రానికి లేఖ ఇచ్చి 2009ల టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు ..ఈనాడు పేపరు రాసిన రాతలు జూసి ఆ పొత్తుకు పురిట్లనే సంధికొట్టిండు. వైఎస్ అధికారం వచ్చినంక టీఆర్ఎస్ పార్టీని గల్లంతు చేయాలని ప్రయత్నిస్తే..చంద్రబాబు అంతకుముందే ఆ పనికి ప్రయత్నించి విఫలమయ్యాడు. 46 స్థానాలలో టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుని 33 స్థానాలలో తన పార్టీ నేతలతో నామినేషన్లు వేయించి చివరి సమయంలో బీ ఫాంలు ఇచ్చి టీఆర్ఎస్ విజయాలను అడ్డుకున్నాడు. టీడీపీ అభ్యర్థులను టీఆర్ఎస్ గెలిపిస్తే..టీఆర్ఎస్ కు బాబు వెన్నుపోటు పొడిచి అధికారానికి దూరమయ్యాడు.

ఇక 2009లో కేసీఆర్ ఆమరణ దీక్ష సమయంలో అఖిలపక్షం పెడితే తెలంగాణ మీద వెంటనే అసేంబ్లీ ఏర్పాటు చేసి తీర్మానం చేస్తారా ? లేదా ? తీర్మానం మీరు పెడతారా ? లేక మమ్మల్ని పెట్టమంటారా ? అని బీరాలు పలికాడు. తీరా 2009 డిసెంబరు 9న తెలంగాణ ప్రకటన రాగానే 10 వ తేదీన అడ్డంతిరిగి అసలు తెలంగాణ ఎలా ఇస్తారు ? ఇంత పెద్ద నిర్ణయం రాత్రికి రాత్రే తీసుకుంటారా ? అని మొరాయించాడు. చంద్రబాబు పుణ్యం..సీమాంధ్ర నేతల మోసం ఫలితంగా  వేలాది మంది తెలంగాణ బిడ్డలు ఆత్మబలిదానాలు చేశారు.

ఇక ఆ తరువాత 2011 ఉప ఎన్నికలల్ల బాబ్లీ నాటకం ఆడి చంద్రబాబు మహారాష్ట్రల పోయి కూసున్న తెలంగాణ జనం ఎక్కడా కనీసం టీడీపీ డిపాజిట్ దక్కనివ్వలేదు. ఆ తరువాత గత ఏడాది పాదయాత్ర జేస్తున్న అని తెలంగాణ మీద కేంద్రం అఖిలపక్షం పెట్టాలని ప్రధానికి లేఖ రాసిండు. అఖిలపక్షంలో అడ్డదిడ్డంగ లేఖ ఇచ్చాడు. ఇన్నేళ్ల ఉద్యమం ఫలితంగా జులై 30న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తెలంగాణకు అనుకూల నిర్ణయం తీసుకున్న వెంటనే చంద్రబాబు నాయుడు సీమాంధ్ర రాజధానికి రూ.4.5 లక్షల కోట్లు నిధులడిగాడు. ఆ మరుసటి రోజు నుండి సమన్యాయం.. ఆ తరువాత ఇద్దరు కొడుకుల సిద్దాంతం.. ఆ తరువాత ఢిల్లీ దీక్ష..తాజాగా కొబ్బరికాయల సిద్దాంతం అని దిక్కు మాలిన వాదన చేస్తూ తెలంగాణ వ్యతిరేక వాదన చేస్తున్న చంద్రబాబు ఇప్పుడు ఉన్న కాస్త సిగ్గునూ పక్కన పెట్టి అసలు రాజధాని ఉన్న ప్రాంతం ఎక్కడయినా రాష్ట్రంగా విడిపోయిందా ? అడ్డగోలు విభజనకు అంగీకరించాలా ? సీమాంధ్ర రాజధాని అడవిలో పెట్టుకోవాలా ? అని ప్రశ్నలు వేస్తున్నాడు.

పూటకో మాటతో తెలంగాణ - సీమాంధ్రలో ఎక్కడా మొహం చెల్లని చంద్రబాబు నాయుడు బీజేపీ అధిష్టానం అయినా కరుణిస్తే ఈ సారి గట్టుక్కుతానా ? అని ఆలోచనల్లో పడ్డాడు. అరవింద్ కేజ్రివాల్ విజయాన్ని అబ్బో అని పొగుడుతున్నాడు. ఢిల్లీల ఉన్న కేజ్రివాల్ కూడా తెలంగాణ ఉద్యమానికి నిజాయితీగా మద్దతు తెలిపాడు. కానీ ఈ రాష్ట్రాన్ని తొమ్మిదేళ్లు పాలించిన నీకు ఓ స్పష్టమయిన వైఖరి లేకపోవడం ఇక్కడి ప్రజలంతా చేసుకున్న దౌర్భాగ్యం.

please like & share this page

www.facebook.com/thovva

8, డిసెంబర్ 2013, ఆదివారం

నిండుకుండ తొణకదు..ఎంగిలిస్తరాకులు ఎగిరెగిరి పడ్తయి

నిండు కుండ తొణకదు (KCR).. ఎంగిలి ఇస్తరాకులు ఎగిరెగిరి పడుతున్నయి (ఎవ్వలో నేం జెప్ప)


కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తెలంగాణ మీద నిర్ణయం తీసుకున్నప్పటి నుండి 13 ఏండ్ల సంది ఉద్యమం చేస్తున్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయాడు. ఇన్నేండ్ల ఉద్య మంల ఎన్నో రాజీనామాలు..అవమానాలు, ఆరోపణలు, అణచివేసే కుట్రలు, టీఆర్ఎస్ ను తెరమరుగు చేసే ప్రయత్నాలు..తెలంగాణోడు..ఆంధ్రోడు అందరు గలిసి కేసీఆర్ ను ఎన్ని తిప్పలు వెట్టాల్నో అన్ని వెట్టిండ్రు. ఒక రాజకీయ పార్టీ నేత మీద ఎన్ని విధాల దాడులు జరగకూడదో అన్ని విధాల దాడి కేసీఆర్ మీద జరిగింది. సీమాంధ్ర మీడియా కేసీఆర్ వ్యక్తిగత జీవితం మీద కూడా దాడి చేసింది. విలువల గురించి మాట్లాడే మేధావులు కేసీఆర్ విషయంలో వలువలు విడిచి రాస్తున్న మీడియా రాతలను ఖండించిన పాపాన పోలేదు. తెలంగాణ, టీఆర్ఎస్, కేసీఆర్ విషయంలో ఫోర్త్ ఎస్టేట్ అయిన మీడియా ఓ మాఫియాలా వ్యతిరేకంగా పనిచేసింది. పని చేస్తూనే ఉంది. తెలంగాణకు అనుకూల సంకేతాలు వచ్చిన ప్రతిసారి ఈ మాఫియా రెచ్చిపోయి అడ్డుకునే, గందరగోళంలోకి నెట్టే ప్రయత్నాలు చేస్తుంది. ఇన్నేళ్లు అన్నింటినీ తట్టుకుని ముందుకు సాగిన కేసీఆర్ గత మూడు నెలలుగా తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను నిశితంగా పరిశీలిస్తున్నారు. తెలంగాణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందేదాకా అప్రమత్తంగా ఉందాం అని తెలంగాణ సమాజాన్ని జాగృతం చేస్తున్నారు. సంబరాలైనా..సమావేశాలయినా ఆ తరువాతనే అని చెబుతున్నారు.

ఎంగిలి ఇస్తరాకులు ఎగిరెగిరి పడుతున్నయి

తెలంగాణ గురించి నిన్నటి మాట్లాడనోడు.. పొయ్యిల వన్పోడు..ఎగతాళి జేసినోడు..ఎక్కిరించినోడు..అడిగిన విద్యార్థులను అడ్డంబడి తన్నినోడు.. తెలంగాణ ఎందుకని మీడియా సాక్షిగా ప్రశ్నించినోడు..అసలు కేసీఆర్ ఎవరు ? అన్నోడు ..ఆయన బలమెంత అని బీరాలు వొయ్యినోడు..ఇచ్చేటోళ్లు..తెచ్చెటోళ్లు ..మద్దతిచ్చె టోళ్లు అందరు ఇప్పుడు తెలంగాణ గురించి మాట్లాడుతున్నారు. మేమే ముందట్కి వడి తెచ్చినవని తెగ ఫీలయితున్నరు. తెలంగాణ వచ్చిందా...అది ఇవ్వక తప్పని పరిస్థితి కేసీఆర్, తెలంగాణ సమాజం ఈ పార్టీలకు సృష్టించిండ్రా అన్నది అందర్కి ఎర్కనే..ఇక ఎంగిలిస్తారాకులు ఎవరో గుడ్క మీకే తెల్సు నేం జెప్పాల్సిన పనిలేదు.

please like & share this page

www.facebook.com/thovva


సందీప్ రెడ్డి కొత్తపల్లి

7, డిసెంబర్ 2013, శనివారం

మారనంటున్న కిరణ్ ..మారాం చేస్తున్న చంద్రబాబు..జగన్

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం తెలిపిన తరువాత కూడా సీల్డ్ కవర్ సీఎం కిరణ్, మాజీ ముఖ్యమంత్రి, రెండు కళ్ల చంద్రబాబులు మారడం లేదు. ఇంకా చెల్లిపోయిన సమైక్య సొల్లును కిరణ్ సొల్లుతూనే ఉన్నాడు. అసేంబ్లీలో తెలంగాణ బిల్లును ఓడిస్తానని రంకెలు వేస్తున్నడు. అసలు అసేంబ్లీల తెలంగాణ బిల్లు గురించి చర్చ జరుగుతుంది గానీ ఓటింగ్ ఏమీ జరగదు. జరిగినా దానిని పరిగణనలోకి తీసుకోరు. ఈ విషయం తెలిసి గుడ్క వాగుతున్న కిరణ్ సీమాంధ్ర జనం చెవిల పువ్వులు పెడుతుంటే ఎంపీ లగడపాటి పక్కనుండి చప్పట్లు కొడ్తున్నడు. కూట్ల రాయి తియ్యలేనోడు ఏట్ల రాయి తీస్తడా అని రాజీనామా జెయ్యనీకే ధైర్యంలేని ముఖ్యమంత్రి తెలంగాణను అడ్డుకుంటా అని పోజులు గొడ్తుండు. తాన్దూరనే సందులేని కిరణ్ మెడకో డోలు లగడపాటిని తగిలిచ్చుకున్నడు. సన్నాసి సన్నాసి రాసుకుంటె బూడిద రాలిందని ..ఈల్లు ఈసారి మళ్ల గెల్చె మొఖాలె గావు గానీ లేని సమైక్యాంధ్ర గురించి తెగ పీలయితున్నరు.

ఇక తెలంగాణనా ? సమైక్యాంధ్రనా ఏ సంగతి ఇంగా తెల్సుకోలేక తిప్పలు వడుతున్న చంద్రబాబు ఆరునెలలు అధికారం ఇస్తే ఏందనేది తేల్చుకోని ఆ తరువాత సమన్యాయం ఎట్ల చేయాలెనో ఆలోచించి.. ఆ తరువాత కొబ్బరికాయ సమంగ పల్గదీసి.. ఉన్నది ఒక్కడే కొడుకు గావట్క ఇద్దరు పిల్లలున్నోళ్ల ఇండ్ల సుట్టు తిర్గి. ఆళ్లకు ఏ పిల్ల ఇష్టమో తెల్సుకోని .. ఆ తరువాత చిత్తూరు నుంచి ఆదిలవాద్ కు .... రంగారెడ్డి నుండి శ్రీకాకుళానికి పాదయాత్ర జేసి ఆంధ్ర ప్రదేశ్ ఎంత పొడుగు ..ఎంత ఎడెల్పు ఉందో తన అడుగులతోనే లెక్క గట్కోని అప్పుడు ఓ దినం మేస్త్రీలను పిల్సుకోనొచ్చి దారం పట్టించి తెలంగాణ - ఆంధ్ర ఇబజిస్తడట. మనిషికో మాట ..గొడ్డుకో దెబ్బ అని అంటరు. చంద్రబాబు కు మాటలు, దెబ్బలు ఏవి గుడ్క పనిజేసెటట్లు లేదు.

ఇగ అయ్యకు అధికార మొచ్చిన తర్వాత ఎల్గుల కొచ్చిన కడప చిన్రాయుడు జగన్ బాబు సమైక్యాంధ్ర సమైక్యాంధ్ర అని దేశవంత తిరిగి చెప్తున్నడు. ప్రధాన ప్రతిపక్షం బీజేపీ, అధికార పక్షం యూపీఏ రెండు గుడ తెలంగాణ బిల్లుకు సై అన్నంక తెలంగాణ ఎట్ల ఆగుతదో ఈ చిన్రాయునికె తెల్వాలె. తండ్రి అధికారంల ఉంటెనే కోట్లు ముల్లె గట్టినోడు ..చేతికి అధికార దొరికితె చెరబట్టుడు ఖాయం. మొన్న తుపాను వచ్చిందని రైతులను కల్వనీకె వొయ్యి మైకుల మాట్లాడనీకె మడికెట్లల్ల సెక్యూరిటీ కానిస్టేబుల్ ను వంగవెట్టిండు జగన్. ఇసోంటోనికి గిట్ల సీమాంధ్ర జనం ఓట్లేస్తె జనం అందరినీ ఒంగవెట్టుడు ఖాయం.

ఇసవంటి నేతలతోని సీమాంధ్ర జనం ఎట్ల ముందలవడ్తరో .. ఏమో ..ఈళ్లను దేవుడే కాపాడాలె

sandeepreddy kothapally

please like & share

www.facebook.com/thovva 

6, డిసెంబర్ 2013, శుక్రవారం

ఎవరి అమ్మ ? ఎక్కడి అమ్మ ? ఎందుకు అమ్మ ?

ఎవరి అమ్మ ? ఎక్కడి అమ్మ ? ఎందుకు అమ్మ ?

తెలంగాణ ఇచ్చినంతట్లనే పొయ్యిన పిల్లలు తిరిగొస్తరా ?
సచ్చిన పానాలు లేచొస్తయా ? తల్లుల కడుపుకోత సల్లార్తదా ?
1300 మంది అమరుల ఉసురు కొట్టుకుపోతదా ?

ఇచ్చిన తెలంగాణను ఎన్కకు తీసుకోని
ఇగురం లేని కొడుకుల మాటలు వట్టుకోని
నాలుగేండ్ల సంది పిల్లల పానాలతోని ఆడుకోని

తెలంగాణ ఉద్యమాన్ని అన్గదొక్కనీకే
అవసరమయిన అన్ని ప్రయోగాలు జేసి
ఆఖర్కి ఇక ఇయ్యక తప్పదని తెల్సుకోని
ఇయ్యాల తెలంగాణ ఇచ్చింది

లేని పంచాయితి పెట్టొద్దు
అమ్మ మన అమ్మ కానే కాదు
అమ్మ మనకు ఎప్పటికీ సవతి తల్లె
సీమాంధ్ర పెట్టుబడిదారుల నుండి ఓట్లు రాలవన్న
పరిస్థితి తెలుసుకున్న తరువాతనే
తెలంగాణ వచ్చిందన్న విషయాన్ని అందరూ గుర్తవెట్టుకోవాలె

తెలంగాణ
నిఖార్సయిన
నిజాయితీ గల ఉద్యమం

ఇలాంటి ఉద్యమాలకు ఏ అమ్మయినా సలాం కొట్టాల్సిందే
అమరుల తల్లులకు తప్ప ఏ అమ్మకు తెలంగాణ సలాం కొట్టదు..కొట్టకూడదు

please like & share

www.facebook.com/thovva 

5, డిసెంబర్ 2013, గురువారం

తెలంగాణకు ఇక రెండడుగుల దూరంలో ..!

అమరుల త్యాగాలు..విద్యార్థులు, ఉద్యోగుల పోరాటం..సమస్త తెలంగాణ ప్రజల సహకారం. మొత్తానికి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర అంకంలో ఒక కీలకఘట్టం పూర్తి చేసుకుంది. సీమాంధ్ర పెట్టుబడిదారుల కుట్రలను ఛేధించుకుని కేంద్ర క్యాబినెట్ ఆమోదం దక్కించుకుంది. ఎన్నో బలిదానాలు.. ఎందరికో కడుపుకోత.. లాఠీఛార్జీలు, రబ్బరు బుల్లెట్లు..భాష్పవాయువు గోళాలు. తెలంగాణ అంతా పోలీసు పదఘట్టనల కింద నలిగిపోయింది. దెబ్బ తగిలిన ప్రతిసారి రెట్టింపు వేగంతో ఉద్యమంలోకి తెలంగాణ జనం వచ్చేశారు.

ప్రపంచ చరిత్రలో ఇంత సుధీర్ఘంగా సాగిన ఉద్యమం ఈ మధ్య కాలంలో ఏదీ లేదు. భవిష్యత్ లో ఏదీ ఉండదు కూడా. స్వాతంత్ర పోరాటం తరువాత అంత సుధీర్ఘంగా సాగింది. ఉద్యమాన్ని అణచివేసే క్రమంలో సీమాంధ్ర పెట్టుబడిదారులు, వారి అడుగులకు మడుగులొత్తే మీడియా వ్యవస్థ తెలంగాణ ఉద్యమం మీద, తెలంగాణ ఉద్యమ నాయకత్వం, తెలంగాణ ఏర్పడితే వచ్చే సమస్యల మీద చేసిన యాగీ అంతా ఇంతా కాదు. తెలంగాణ ఉద్యమ నాయకత్వానికి తెలంగాణ ప్రజల అండలేకుండా చేసేందుకు వారి వ్యక్తిగత జీవితం మీద కూడా కావాల్సినంత బురద చల్లాయి. ఎన్ని నిందలు పడ్డా..ఎంత అణగదొక్కాలని చూసినా నిఖార్సయినా ..నిజాయితీ గల తెలంగాణ ఉద్యమం ఎక్కడా ఉలిక్కిపడలేదు.

2009 ప్రకటన వెనక్కి తీసుకున్న తరువాత నాలుగేళ్లుగా తెలంగాణ విరామం లేని పోరాటం చేసింది. ఎందరో బిడ్డలు బలిదానాలు చేశారు. శ్రీకాంత చారితో మొదలయిన బలిదానాలు ..నిన్న రాయల తెలంగాణ అన్న వార్తల వరకు కొనసాగాయి. ఎన్ని సార్లు విజ్ఞప్తులు చేసినా సీమాంధ్ర విషపు మీడియా వార్తలు చదివి తెలంగాణ బిడ్డలు ఆందోళనతో ఆత్మహత్యలు చేసుకోవడం మాత్రం ఆపలేదు. తెలంగాణకు క్యాబినెట్ ఆమోదం వచ్చిన ఇప్పటి నుండి అయినా తెలంగాణ బిడ్డలు గుండెదిటవు చేసుకుని వచ్చే తెలంగాణలో బంగారు భవిష్యత్ ను చూసుకోవాలని కోరుకుందాం. ఇక బిల్లు రాష్ట్రపతికి వెళ్లిన నేపథ్యంలో అది అక్కడి నుండి అసేంబ్లీకి రావడం..తిరిగి పార్లమెంటుకు వెళ్లి ఆమోదం పొందడం అనే రెండు అడుగులు మిగిలి ఉన్నాయి. అప్పటి వరకు అప్రమత్తంగా ఉందాం. తెలంగాణ సాధించుకుందాం

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో అమరుల ఆశయాలను సాధిద్దాం..జయశంకర్ సార్ లక్ష్యాలను చేరుకుందాం

జై తెలంగాణ

మీ సందీప్ రెడ్డి కొత్తపల్లి

5, నవంబర్ 2013, మంగళవారం

శబరిమల యాత్ర - తెలంగానం

యాడికొయ్యినా మనకు తెలంగాణ యాదే ఉంటది. వెయ్యి మంది బలిదానాలు మనను ఒక్క తాన నిల్వనిస్తయా
..తెలంగాణను ఒక్క మాట అననిస్తయా. అందుకే మాల వేసుకుని శబరిమల వెళ్లినా యాది మాత్రం తెలంగాణ మీదనే ఉంటది. పోత పోత ఎర్మేలి కాడ చిత్తూరు జిల్లా పుంగనూరు నుంచి వచ్చిన మేస్త్రి కండ్లవడ్డడు. మన పానం ఊకుంటదా. ఏంది అన్నా మీ తాన సమైక్యాంధ్ర నంట గద ఎట్లుంది అని గెలుకుతి. మనోడు గుడ్క ఏమీ తడుముకోలే. పన్లేనోళ్లు నాలుగు దినాలు లొల్లి వెట్టిండ్రు. ఇప్పుడు ఎవడూ పత్తలేడు అని జెప్పిండు. ఆ జోలి ఇని నా కడుపు సల్లవడ్డది.

ఇంగ పంబల తానం జేసి కొండ ఎక్కవడ్తిమి. మనోళ్లు జర ముందల్నే పొయ్యిండ్రు. శరంగుత్తి ఆల్ కాడ శరం గుచ్చి టెంకాయలు కొట్టి అల్సట తీసుకునేందుకు కూసున్నరు. అంతే చిత్తూరాయిన పోరడు పాపం నాయకులు నేర్పిన నాలుగు మాటలు ఇన్నంటుంది. సమైక్యాంధ్ర అంటున్నడంట. మనం పోంగనే మనోళ్లు మనకు అంటిచ్చిండ్రు. అన్న ఈన సమైక్యాంధ్ర అంటున్నడు అని. నేను మొదలు వెట్టిన నీ సమైక్యం నీ తాననే ఉండని..  మా తెలంగాణ మేం ఏలుకుంటం అని అన్న. ఎప్పుడన్న రావాలన్పిస్తే మా ఇంటికి రా బువ్వ వెట్టి తోల్త అని జెప్పిన. మీరు గుడ్క
రాండ్రి తిరుపతిల మా దేవున్ని సూతురు అనవట్టె. అరె ఇప్పుడె సమైక్యం అంటివి అప్పుడే మీ దేవుడు ఎట్లయితడు రా బై అని మా బాలస్వామి అందుకున్నడు. మనోడు నోరు తెర్వలె.

మెల్లగ టెంకాయ గొట్టొచ్చి తెలంగాణ పాట వెట్టుకున్న. అదేంది దేవుని కాడికొచ్చి తెలంగాణ పాటలు వెట్టినవ్...అయ్యప్ప పాటలు వెట్టు అనవట్టె చిత్తూరాయిన. అరె బాబు మాకు దేవుడయినా ..దయ్యవయినా తెలంగాణనే. నీకు ఇష్టం లేకుంటే ఈన్నుంచి పో అని గట్టిగనే అన్న. మళ్ల మనోడు నోరు తెర్వలే. మెల్లగా మేం మళ్ల బాటవట్టినం. సన్నిదానం దగ్గరికోయినంక ఓ తాన కూసున్నం. పక్కనే ఓ అయ్యగారు (విజయవాడకు చెందిన బ్రాహ్మణుడు) వచ్చి శెల్ల ఏసుకోని పడుకున్నడు.

ఏం అయ్యగారు చానమంది వచ్చినట్లుంది అయ్యగార్లు (కింద పంబ నదిల మా పక్కననే తానం జేసిండ్రు) అని జోలి మొదలయింది. ఏంది మీ తాన సమైక్యం కథ అని అడిగినం. తెలంగాణ వచ్చేసింది గద ఇంగెక్కడి సమైక్యాంధ్ర. ఆల్రెడీ నిర్ణయం అయిపోయినంక ఇంగేముంటది అనవట్టె. అదేంది అయ్యగారు మీ తాన బాగ లొల్లి జేస్తుండ్రు గద ..మీడియాల ఒక్కటే సూపుతుండ్రు అని అడిగినం. మీడియా పేరు ఎత్తంగనే అయ్యగారికి మండింది. అసలు మీడియాను ఎవడండీ నమ్మేది. కృష్ణా నదిల నీళ్లు తగ్గినప్పుడు దానిలో ఇళ్లు కట్టుకుంటారు. వర్షాకాలం నీళ్లు వచ్చి ఇండ్లు మునగంగనే మునిగిపోయారని, ఇళ్లు కొట్టుకుపోయారని వార్తలు ఏస్తరు. అసలు అందులోకి వెళ్లేది ఎందుకు ? మునిగేది  ఎందుకు ?

తెలంగాణ ఇస్తే నేనేమన్న పౌరోహిత్యం మానేసి ఇంకో పని చేస్తనా..ఇదే పని గద చేసేది. పెద్దోళ్లు ఆడిస్తున్న నాటకం. లేనోడు అడుక్కు తింటున్నాడు..ఉన్నోడు దోచుకు తింటున్నాడు. అటు ఇటుగాని మధ్య తరగతి వాడు ఏం చేయాలో పాలుపోక ఇబ్బంది పడుతున్నడు అని అన్నడు. ఈ సారి జగన్ దొంగ అని తెల్సినా వాడికే ఓటెస్తరు...ఇక వచ్చేసారి చెప్పలేం. టీడీపీ జనం నమ్మట్లేదు అని అన్నడు. అయ్యగారి మాటలతో మాకు అందరికీ సంతోషం అయింది.

ఇక రాత్రికి దర్శనం చేసుకుని, పొద్దున్నే నెయ్యాభిషేకం చేయించుకుని తిరుగుబాట పట్టాం. శరంగుత్తి ఆల్ దగ్గరకు వచ్చే సరికి పక్కన్నే అర్చన  (మనవాళ్లు ఎవరయినా చనిపోతే అక్కడ ఓ పది రూపాయలు ఇస్తే వారి పేరు చెప్పి ఓ టపాకాయ్ పేలుస్తారు. అడవి జంతువులు భక్తుల దారిలోకి రాకుండా టపాకులు పేలుస్తారు. అయితే దానిని ఈ విధంగా మార్చి ఆలయానికి ఆదాయ మార్గంగా మార్చుకున్నారు) స్టాల్ కనిపించింది. వెంటనే అక్కడికి వెళ్లి జోహార్ తెలంగాణ అమర వీరులకు ..జై తెలంగాణ అని చెప్పించాను. ఆయన తెలంగాణ అని మరో రెండు సార్లు ఉచ్చరించాడు. తెలంగాణ పదం వినగానే ఆయన మొఖం వెలిగిపోయింది. పక్కనే ఉన్న కేరళ అయ్యప్ప స్వాములతో మళయాళంలో తెలంగాణ గురించి మాట్లాడడం మొదలు పెట్టాడు. తెలంగాణ వారికి అర్చన చెప్పించుకున్నాడు అని వారికి చెప్పడం మాకు అర్ధమయింది. శబరి మల వెళ్లే తెలంగాణ వారంతా ఈ సారి అమర వీరులకు ఇలాగే అర్చన చేయిస్తారని కోరుకుంటున్నాను. శరంగుత్తి ఆల్ తో పాటు పైన గుడి ఎదురుగా లైన్ల పక్కన కూడా ఇలా చెప్పే అర్చన కేంద్రం ఉంటుంది. ఎవరూ మర్చిపోవద్దని విజ్ఞప్తి.

24, అక్టోబర్ 2013, గురువారం

దూడను చీకమంటడు..బర్రెను..?! సోయి తప్పిన సెంద్రబాబు..!!

ఈ దేశంలో ఇప్పటి వరకు మొత్తం 28 రాష్ట్రాలున్నాయి. ఇప్పుడు 29వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పాటు కాబోతుంది. కానీ ఇంతవరకు ఏ ప్రాంతీయ పార్టీ కూడా రెండు రాష్ట్రాలలో అధికారం దక్కించుకున్న దాఖలాలు లేవు. కాకపోతే మిగతా రాష్ట్రాలలో ఒకటో ..రెండో స్థానాలు దక్కించుకున్నాయి తప్పితే ప్రభావం చూపడం..ప్రతిపక్ష స్థానాన్ని దక్కించుకున్న చరిత్ర కూడా లేదు. కానీ చరిత్రలో చేయని పనులే చేయడం..చరిత్ర హీనుడిగా మిగలడం ఒక్క చంద్రబాబుకు మాత్రమే అలవాటుగా ఉన్నట్లుంది.

ఈ రాష్ట్రానికి తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా, మరో తొమ్మిదేళ్లు
ప్రతిపక్ష నాయకుడిగా చేస్తున్న ఆయనకు రాష్ట్ర విభజన విషయంలో ఓ ఖచ్చితమయిన అభిప్రాయం లేదు. ఎదుటి పార్టీలు విభజనను రాజకీయ అవకాశవాదంగా వాడుకుంటున్నాయి అనే దుగ్ద.. రాష్ట్రాన్ని ఇలా విభజిస్తారా ? ఇక్కడ పెద్ద మనుషులు లేరా ? తెలుగు జాతి మధ్య చిచ్చుపెడతారా ? అని ఆరోపించడం తప్పితే తనయితే ఎలా విభజిస్తాడు ? తనయితే ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తాడు ? అని మాత్రం చెప్పడు. అప్పటికి తానేదో రాజకీయ ప్రయోజనాలకోసం అస్సలు వెంపర్లాడడం లేదు అన్నట్లు మాట్లాడుతున్నాడు.

తెలంగాణ ప్రకటన వచ్చిన తరువాత కూడా తాను సమైక్య వాదిని అన్న వైఎస్ జగన్ కంటే, రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటూ అన్ని ప్రాంతాలను సమానంగా చూడకుండా తెలంగాణకు పచ్చి వ్యతిరేకంగా పనిచేస్తూ నిస్సిగ్గుగా నిధులు దోచుకుపోతున్నకిరణ్ కంటే.. వ్యతిరేకం కాదంటూనే తెలంగాణకు వీలయినంత ఎక్కువ నష్టం చేసే చంద్రబాబునాయుడు, జయప్రకాష్ నారాయణ వంటి వారి మూలంగానే ఎక్కువ నష్టం. తెలంగాణకు వ్యతిరేకం కాదంటూనే సీమాంధ్ర ప్రయోజనాలు, సీమాంధ్ర సమస్యలు బయటపెట్టకుండా, వాటికి పరిష్కారాలు కోరకుండా తెలంగాణ గురించి ప్రకటనలు చేసే దిగ్విజయ్ సింగ్ ను చంద్రబాబు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేత విమర్శలు చేయిస్తాడు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను నిలిపేయాలని పయ్యావుల కేశవ్ తో పిల్ లు వేయిస్తాడు.

వీలయినన్ని ఎక్కువ సమస్యలు సృష్టించేందుకు తన వంధిమాగధులయిన మీడియా యాజమాన్యాల చేత తెలంగాణ విభజన మూలంగా సీమాంధ్రులు కోల్పోతున్న వాటిని భూతద్దంలో పెట్టి చూయించి ప్రచారం చేయిస్తాడు. కానీ తెలంగాణ ఇన్నాళ్లు కోల్పోయిన దాని గురించి మాట్లాడడు. వెయ్యి మంది బలిదానాల గురించి ఒక్క నాడు మాట్లాడని చంద్రబాబు అరవై రోజుల కృత్రిమ ఆందోళనను భూతద్దంలో చూయించే తన తరపు మీడియాతో కలిసి గుండెలు బాదుకుంటాడు. లేని సమైక్య భావనను తట్టి లేపేందుకు ప్రయత్నాలు చేస్తుంటాడు. నంది ఎప్పుడూ పంది కాదు. తెలంగాణ ఉద్యమం నంది లాంటిది..సీమాంధ్ర ఉన్మాదం పంది లాంటిది. చంద్రబాబు నాయుడు లాంటి  నేతలు మన రాష్ట్రంలో ప్రముఖులుగా చెలామణికావడం, జయప్రకాష్ నారాయణ లాంటి వారు మేధావులు అని ఫీలవ్వడం నిజంగా దురదృష్టం.

ఒకవైపు తెలంగాణకు మద్దతు అంటూనే మరో వైపు సీమాంధ్ర గురించి మాట్లాడడం దూడను చీకమనడం..బర్రెను తన్నమనడం సామెతను గుర్తుకుచేస్తుంది. నిజంగా చంద్రబాబు నాయుడు ఇప్పుడు విభజన మూలంగా ఎదురయ్యే సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి నిజాయితీగా పోరాడి సాధించుకునే ప్రయత్నం చేస్తే భవిష్యత్ లో బాబుకు సీమాంధ్రలో మంచి భవిష్యత్ ఉంటుంది. తెలంగాణలో జనం అభిమానం కూడా కాస్త మిగులుతుంది. ఇప్పుడు సమైక్య నినాదం ఎత్తుకుని జగన్ తాత్కాలికంగా లాభపడవచ్చు. కానీ జగన్ కు భవిష్యత్ ఉండదు. చంద్రబాబు కూడా జగన్ దారినే నమ్ముకుంటే నట్టేట్లో మునగడం ఖాయం.