18, జూన్ 2014, బుధవారం

రిపోర్టర్ల పొట్టగొట్టి ..ఖజానా నింపుతున్న రాధాకృష్ణ !


రంకు నేర్చినమ్మ బొంకు నేర్వదా అని ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ చెబుతున్న గురివింద నీతులు చూస్తుంటే
ఆశ్చర్యం వేస్తుంది. అసలు ఆరునెలలుగా ఆంధ్రజ్యోతి ఆర్సీ ఇంఛార్జులకు జీతాలే గతిలేవు. ఆంధ్రజ్యోతి కంట్రిబ్యూటర్లు లైన్ అకౌంట్ మరిచిపోయి చాలా రోజులయింది. తన అడుగులకు మడుగులొత్తే వారిని బ్రాంచ్ మేనేజర్లుగా పెట్టుకుని రిపోర్టర్ల పొట్టగొట్టి వారి కుటుంబాలను పస్తులుంచుతున్న రాధాకృష్ణ ప్రజాస్వామ్యం ..దాని విలువల గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది.

ఆంధ్రజ్యోతిలో దసరాకు యాడ్లు ..దీపావళికి యాడ్లు ..కొత్త సంవత్సరానికి యాడ్లు ..సంక్రాంతికి యాడ్లు ..దీనికి తోడు ప్రతి ఏటా సీమాంధ్ర జ్యోతి వార్షికోత్సవానికి యాడ్లు. రిపోర్టర్లకు టార్గెట్లు నిర్ణయించి ..వారు తీసుకురాకుంటే డేట్ లైన్ ఉండదని హెచ్చరించి ..నలుగురిని బతిమిలాడి యాడ్లను పట్టుకొచ్చిన తరువాత ఆ యాడ్ల డబ్బులు రాలేదని డేట్ లైన్లు నిలిపివేసి రిపోర్టరు జీవితంతో బంతాట ఆడుతున్న రాధాకృష్ణ ఆండ్ కో పత్రికా స్వేచ్చ గురించి ..పత్రికా స్వేచ్చ మీద దాడి గురించి మాట్లాడుతుండడం నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అన్నట్లు ఉంది.

అసలు తన దగ్గర పనిచేసే కంట్రిబ్యూటర్లకు ఎలాంటి స్వేచ్చ ఇవ్వకుండా వారిని నిత్యం వేధింపుల గురించి మాట్లాడుతున్న రాధాకృష్ణకు తన వరకు వచ్చే సరికి ప్రజాస్వామ్యం గుర్తుకు వస్తుంది. ఇటీవల ఎన్నికల్లో అసలు కంట్రిబ్యూటర్లతో సంబంధం లేకుండా బీఎంలతో డబ్బులు దండుకుని ..రిపోర్టర్ల యాడ్స్ కమీషన్ కూడా అందకుండా దండుకు తిన్నారు. ఇలాంటి పత్రికా యాజమాన్యాలు జర్నలిజం విలువల గురించి మాట్లాడుతున్నాయి.

ఈనాడు, సాక్షి ఆఖరుకు ప్రజాశక్తి, ఆంధ్రభూమి దినపత్రికలు కూడా తమ కంట్రిబ్యూటర్లకు తృణమో ..పణమో నెలకింత ముట్టజెబుతున్నాయి. కానీ జిల్లాకు ఇంత టార్గెట్ పెట్టి ముక్కుపిండి వసూలు చేసుకుని తన ఖజానాలో జమ చేసుకుంటున్న రాధాకృష్ణ మాత్రం తన కంట్రిబ్యూటర్లకు ఒక్క పైసా విదిల్చింది లేదు. ఇప్పటికయినా కంట్రిబ్యూటర్ల కడుపు కొట్టకుండా ..ఆర్సీ ఇంఛార్జిల బకాయిలు చెల్లించి మాట్లాడితే కొంత సమంజసంగా ఉంటుంది.

కొత్తపల్లి సందీప్ రెడ్డి

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి