తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర తొలి తెలంగాణ ప్రభుత్వం మరో నాలుగు రోజుల్లో కొలువుదీరబోతుంది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. కొమ్ములు తిరిగిన సీమాంధ్ర మీడియా దుష్ర్పచారాన్ని ..పదేళ్లుగా అధికారం చేజిక్కించుకుని మందబలం..ఆర్థికబలం పెంచుకున్న కాంగ్రెస్ ను ఢీ కొని ఏకంగా టీఆర్ఎస్ పార్టీ అధికారపీఠం ఎలా దక్కించుకుంది ? ప్రజలు ఏం చూసి టీఆర్ఎస్ కు ఓట్లేశారు ? ఏం చేస్తారని టీఆర్ఎస్ కు ఓట్లేశారు ? ఐదేళ్లలో టీఆర్ఎస్ అద్భుతాలు చేస్తుందా ? లేక అరచేతిలో స్వర్గం చూపెడుతుందా ? కేసీఆర్ ను ప్రజలు ఎందుకు నమ్మారు ?
2001లో టీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబునాయుడు, అప్పట్లో ఆయనకు అండగా ఉన్న తెలంగాణలోని ప్రముఖ నాయకగణం అంతా ఇది మఖలో పుట్టి పుబ్బలో పోతుంద
ని అన్నారు. అసలు తెలంగాణ అక్కర్లేదు అన్నారు. కేసీఆర్ వెంట నడిచిన వారి మీద దాడులు కూడా జరిగాయి. 2004 ఎన్నికల వరకు కేసీఆర్ కాంగ్రెస్ టీఆర్ఎస్ తో పొత్తుపెట్టుకుంటే గానీ టీడీపీని ఓడించలేం అన్న స్థితికి తీసుకువచ్చారు. ఇక అప్పటి నుండే కేసీఆర్ తన వ్యూహానికి పదునుపెట్టాడు. దేశంలో ప్రధానపార్టీ అయిన కాంగ్రెస్ ను తెలంగాణకు ఒప్పించాడు.
2004 ఎన్నికల్లో అధికారం దక్కిన వెంటనే వైఎస్ తన నైజాన్ని బయటపెట్టుకున్నాడు. టీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయాలని కుట్రలు పన్నాడు. ఎమ్మెల్యేలను చీల్చాడు. కేంద్రంలో కేసీఆర్ మంత్రిపదవి దక్కినా దానిమీద మక్కువ పెంచుకోలేదు.. తెలంగాణ డిమాండ్ ను యూపీఏ ఉమ్మడి ప్రణాళికలో చేర్పించడం మీదనే దృష్టిపెట్టాడు. కొన్నినెలలు శాఖలేని మంత్రిగానే కొనసాగాడు. మరో వైపు వైఎస్ తెలంగాణ నేతలతో రెచ్చగొట్టించి కేసీఆర్ ను రాజీనామా దిశగా పురిగొల్పుతున్నా కేసీఆర్ భయపడలేదు. మంత్రిపదవికి ..ఎంపీ పదవికి రాజీనామా చేసి తెలంగాణవాదానికి పరీక్ష పెట్టాడు. తాను పులిమీద స్వారీ చేస్తున్నానని తెలిసినా కేసీఆర్ వెనుకంజ వేయలేదు. రెండులక్షల పై చిలుకు ఓట్లతో గెలిచి సత్తాచాటారు.
2008లో తన మొత్తం ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి కేసీఆర్ మరోసారి ప్రజలను తెలంగాణ దిశగా ఆలోచించే ప్రయత్నం చేశారు. ఆ ఎన్నికల్లో ప్రాభవం కోల్పోయినా 2009 ఎన్నికలలో ఈసారి రాష్ట్రంలోని ప్రధాన పార్టీ టీడీపీని ముగ్గులోకి దింపి తెలంగాణకు అనుకూల లేఖ రాయించారు. మహాకూటమి అని పెట్టుకుని పురిట్లోని మిత్రధర్మానికి చంద్రబాబు గండికొట్టి టీఆర్ఎస్ కు కేటాయించిన 46 స్థానాలలో 33 చోట్ల బీ ఫాంలు ఇచ్చి మోసం చేశాడు. వైఎస్ అధికారం దక్కిన తరువాత టీఆర్ఎస్ ను అంతం చేయాలని చూస్తే చంద్రబాబు అధికారం రాకముందే టీఆర్ఎస్ ను నాశనం చేయాలని ప్రయత్నించాడు. టీడీపీ మోసం మూలంగా 10 శాసనసభ, 2 ఎంపీ స్థానాలకే పరిమితమయినా కేసీఆర్ నిరుత్సాహపడలేదు. అవకాశం కోసం కాచుక్కూర్చున్నాడు.
2009లో అధికారం దక్కిన నాలుగు నెలలకే వైఎస్ చనిపోవడంతో ఆ తరువాత రెండు నెలలకే రాష్ట్ర రాజకీయాలను కేసీఆర్ మలుపుతిప్పారు. ఫ్రీ జోన్ అంశం మీద నిరహారదీక్ష మొదలుపెట్టి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ ను ముందుకు తెచ్చారు. 11 రోజుల నిరహారదీక్షతో కేంద్రం తెలంగాణ ప్రకటన చేసే పరిస్థితిని కల్పించారు. దీంతో 2009 డిసెంబరు 9న తెలంగాణ ప్రకటన వచ్చింది. ఇక ఆ వెంటనే సీమాంధ్ర నేతల మోసం, కుట్రలు బయటపడ్డాయి. ప్రకటన వచ్చీరాగానే వారంతా సమైక్యాంధ్ర అంటూ నాటకాలు మొదలుపెట్టడం..చంద్రబాబు రెండు కళ్ల నైజం, చిరంజీవి సమైక్యవాదం ఎత్తుకోవడం మొదలయింది. ఈ పరిణామాలతో అప్పటి వరకు స్థబ్దుగా ..తెలంగాణ ఉద్యమానికి దూరంగా ఉన్న తెలంగాణ సమాజం తెలంగాణ గురించి ఆలోచించడం మొదలుపెట్టింది. డిసెంబరు 23 కేంద్రం తెలంగాణ నిర్ణయం మీద వ్యతిరేక ప్రకటన రావడంతో తెలంగాణ సమాజం ఒక్కతాటి మీదకు వచ్చింది. అసలు వచ్చిన తెలంగాణను ఎందుకు ఆపారు ? తెలంగాణ ఏర్పాటుకు ఎందుకు మోకాలడ్డుతున్నారు ? అన్న చర్చ మొదలయింది.
2009 మొదలు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర బిల్లు పార్లమెంటు ఉభయసభల్లో ఆమోదం పొందేవరకు కేసీఆర్ తెలంగాణ సమాజం వెంట నడిచారు. సకలజనుల సమ్మె, మిలియన్ మార్చ్, సాగరహారం ఏ కార్యక్రమం జరిగినా ..ఏ ఆందోళన చేసినా జేఏసీ వెంటనడిచింది టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్ పార్టీని జేఏసీ వెంట నడిపించిన ఘనత కేసీఆర్ ది. తెలంగాణ ఉద్యమంలో లాఠీదెబ్బలు తిన్నవారికి ..అనాలోచితంగా ఆత్మహత్యలు చేసుకున్న అమరులకు, కేసుల పాలయిన విద్యార్థులకు అండగా ఉండి ఆదుకున్నది టీఆర్ఎస్ ..టీఆర్ఎస్ అంటేనే తెలంగాణ. తెలంగాణ అంటేనే టీఆర్ఎస్. ఇక్కడ పోలీసుల నుండి గానీ, కాంగ్రెస్ నుండి గానీ, టీడీపీ నుండి గానీ ఇబ్బందులు ఎదుర్కొన్నది ప్రధానంగా టీఆర్ఎస్ పార్టీ నేతలే.
ఈ నాలుగేళ్ల కాలంలో తెలంగాణ ఇవ్వకుండా ఎన్నికలకు వెళ్లలేని పరిస్థితులను కేసీఆర్ కాంగ్రెస్ పార్టీకి కల్పించాడు. తెలంగాణ బిల్లు శాసనసభలో పెట్టినప్పుడు టీడీపీ, కాంగ్రెస్ నాటకాలను ప్రజాక్షేత్రంలో టీఆర్ఎస్ ఎండగట్టింది. ఈ మధ్యకాలంలో జరిగిన ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులనే కాదు తెలంగాణ కోసం రాజీనామా చేసిన అందరు అభ్యర్థులకు టీఆర్ఎస్ పార్టీ అండగా నిలిచి గెలిపించింది. 2010లో నిజామాబాద్ లో బీజేపీ అభ్యర్థి యెండెల లక్ష్మీనారాయణ, ఆ తరువాత నాగర్ కర్నూలులో నాగం జనార్ధన్ రెడ్డి గెలుపులే దీనికి నిదర్శనం.
తెలంగాణ బిల్లు శాసనసభ నుండి పార్లమెంటుకు వెళ్లాక ఢిల్లీకి వెళ్తూ కేసీఆర్ "ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నుండి వెళ్తున్నా ..తెలంగాణ రాష్ట్రంలో అడుగుపెడ్తా" అని చెప్పడం ఆయనలోని ఆత్మవిశ్వాసానికి అద్దంపడుతుంది. పార్లమెంటులో బిల్లు సంధర్బంగా బీజేపీ నేతల వ్యవహారం, టీడీపీ నేతల వ్యవహారం, చివరివరకూ చంద్రబాబు, జగన్ నాటకాలు అన్నీ కేసీఆర్ మీద తెలంగాణ ప్రజలకు విశ్వాసాన్ని పెంచాయి. నాలుగేళ్లగా ప్రజా ఉద్యమానికి దూరంగా, తెలంగాణ ఉద్యమం మీద ఉక్కుపాదం మోపిన కాంగ్రెస్ నేతలు తీరా కేంద్రం తెలంగాణ ఇచ్చాక ఇచ్చింది తామేనని తెలంగాణ హీరోలం తామేనని చెప్పుకోవడం జనాలకు కాంగ్రెస్ నేతల మీద అసహ్యం పెంచింది. అసలు గ్రామస్థాయిలో నిర్మాణమే లేదన్న టీఆర్ఎస్ పార్టీకి ప్రజలే పునాదులుగా నిలిచి పట్టంకట్టారు.
ఇంతకుముందు ఏ పార్టీకి లేనంతంగా టీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు ఒక్కొక్కరు 10 వేల నుండి 93 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ స్థాయి మెజార్టీలు 1994 ఎన్నికల్లో గానీ, 2004 ఎన్నికల్లో గానీ ఏ పార్టీకి రాలేదు. శాసనసభతో పాటు లోక్ సభ సభ్యుల విషయంలో కూడా ప్రజలు కేసీఆర్ మీదనే విశ్వాసం ఉంచారు. కేసీఆర్ కేవలం 10 రోజుల్లో 110 సభల్లో పాల్గొని తన లక్ష్యాన్ని, తన ప్రణాళికను తెలంగాణ ప్రజల దగ్గరకు తీసుకువెళ్లారు. అరవైఏళ్ల వయసులోనూ ఆయన అత్యంత ఉత్సాహంగా రోజుకు పది సభల్లో అలుపెరగకుండా ఆత్మవిశ్వాసంతో పాల్గొన్నారు. ఆయన పోరాటమే ఈ రోజు ఆయనను నిలబెట్టింది. తెలంగాణ ప్రజలు నమ్మింది ఒక్క కేసీఆర్ ను ..తెలంగాణ విషయంలో ఆయన నిబద్దతను..మొండి పట్టుదలను. అయిదేళ్లలో కేసీఆర్ అద్భుతాలు చేస్తాడని ప్రజలు ఆశించడం లేదు. కేవలం తెలంగాణకు అవసరం అయిన పని కేసీఆర్ చేస్తాడన్న నమ్మకమే ప్రజలను కేసీఆర్ వెంట నడిపించింది. కేసీఆర్ ప్రజల మనసును గెలిచాడు. అందుకే ఆయన ఈ రోజు సగర్వంగా నిలిచాడు.
sandeepreddy kothapally
too good
రిప్లయితొలగించండితెలంగాణ ఇచ్చినా కాంగ్రెస్ ఎందుకు ఘోరంగా ఓడింది. విశ్లేషించండి
రిప్లయితొలగించండి