ఎన్యూమరేటర్ మీ ఇంటి కొస్తాడు ..మీ నట్టింటి కొస్తాడు ..మీ బెడ్ రూమ్ కొస్తాడు .మీ వంట రూమ్ కు వస్తాడు ..మీ రేషన్ కార్డు ఆపేస్తారు ..మీ ఫించను లాగేస్తారు.. మీ ఆస్తులు గుంజుకుంటారు అంటూ సీమాంధ్ర మీడియా ..తెలంగాణలో ఉన్న సీమాంధ్ర పార్టీల తొత్తు నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ప్రజలు ఏ మాత్రం నమ్మవద్దు. ఇది తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ఓ బృహత్తర కార్యక్రమం.
అక్రమార్కులను దూరం పెట్టి నిజమయిన లబ్దిదారుడు ప్రభుత్వ అండతో పైకి రావాలన్న ఆకాంక్షతో చేస్తున్న నిఖార్సయిన కార్యక్రమం.
అయితే ప్రజల్లో ఈ సర్వే విషయంలో నెలకొన్న సందేహాలు కూడా చాలానే ఉన్నాయి. 60 ఏళ్ల నుండి నెలకు ఓసారి ఇచ్చే రేషన్ కార్డు కోసమో, ఫించను కోసమో ..ఆరోగ్యశ్రీ కార్డు కోసమో ..లీటరు కిరసనాయిలు ..అద్దకిల చక్కెర, పావుకిల పప్పు ..కిల ఉప్పు ..అద్దకిల చింతపండు ..వంటి తాత్కాలిక అవసరాలకు మనల్ని బానిసలను చేసి ..మన కాళ్ల మీద మనం నిలబడే అవకాశం ఇవ్వకుండా ..కేవలం ఓట్లేసే యంత్రాలుగా చేసిన సీమాంధ్ర కుట్రలకు కాలం చెల్లింది.
తెలంగాణ జెండా ఎగిరింది. తెలంగాణ ఉద్యమపార్టీ గద్దెనెక్కింది ఇప్పుడు మన రాష్ట్రం ...మన ప్రభుత్వం. బిడ్డ ఎదిగితే తల్లికి ఎంత సంతోషమో ..ఈ రాష్ట్రంలోని పౌరుడు తన కాళ్ల మీద తాను ఎవరిమీదా ఆధారపడకుండా జీవిస్తే ఈ ప్రభుత్వానికి అంత సంతోషం. ఎదిగిన బిడ్డ ఎంతసేపూ తల్లిదండ్రుల మీద ఆధారపడి బతుకుంటే ఆ తల్లిదండ్రులకు ఎంత మానసిక ఆందోళన ఉంటుందో ..తెలంగాణ ప్రభుత్వానిది కూడా అదే ఆందోళన. అందుకే తెలంగాణ ప్రభుత్వం దీర్ఘకాలిక ప్రయోజనాలను ఆశించి అసలు ప్రజల వద్ద ఉన్నది ఏంటి ? మనం వారికి ఇవ్వాల్సింది ? ఏం చేస్తే వాళ్లు వారి కాళ్ల మీద నిలబడ గలుగుతారు ?
ఉద్యోగం ? వ్యవసాయం ? పరిశ్రమలు ? సంక్షేమ కార్యక్రమాలు ? ఏవి అందిస్తే వారికి ఉపయోగకరంగా ఉంటుంది ? అన్నదే తెలంగాణ ప్రభుత్వం తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. ఇక్కడ ఎవరి భూములు గుంజుకోవడానికో ? మరెవరి ఆస్తులో ఆక్రమించుకోవడానికో తెలంగాణ ప్రభుత్వం ఈ సర్వేను ఉపయోగించుకోవాలనే ఆలోచనలో లేదు. కేవలం తెలంగాణ బిడ్డల అభ్యున్నతి లక్ష్యంగానే ఈ సర్వేను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతుంది. నిజంగా అక్రమంగా ఉన్న ఆస్తులు, భూములు లాగాలనుకుంటే హైదరాబాద్ లో అవి చాలా ఉన్నాయి. ఆ దిశగా ప్రభుత్వం ఇప్పటికే ముందడుగు వేసింది. కేవలం తెలంగాణ ప్రభుత్వ వ్యతిరేక మీడియా, సీమాంధ్ర నాయకుల అడుగులకు మడుగులొత్తే కొందరు స్వార్ధ రాజకీయ నాయకులు ప్రజల్లో అనవసర గందరగోళానికి తెరలేపుతున్నారు.
ఈ విషయంలో తెలంగాణ ప్రజలు ఎవరూ ఆపోహా పడాల్సిన పనిలేదు. ఉపాధి నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు భేషుగ్గా అక్కడే ఉండొచ్చు. ఇంటి వద్ద ఉన్న మీ వాళ్లతో మీ సమాచారం ఇంటికి వచ్చిన ఎన్యూమరేటర్లకు చెప్పించండి. మీకు ఎన్ని ఎకరాల భూమి ఉంది. సొంత ఇల్లు ఉందా ? లేదా ? మీ ఇంట్లో ఉన్న కుటుంబాలు ఎన్ని ? మీ బ్యాంకు ఖాతా వివరాలు ? వంటి ఇంటి స్థితిగతులను తెలియజేసే సమాచారమే తప్ప అంతకుమించింది ఏమీ లేదు. దీనిని బట్టి ప్రభుత్వానికి ప్రజలకు అందజేస్తున్న సంక్షేమ పథకాల మీద, ఇక ఇతర రంగాలలో అందించాల్సిన సేవల మీద పూర్తి అవగాహన వస్తుంది.
అందుకే ఈ నెల 19న ప్రభుత్వం చేపట్టే సర్వేకు ప్రజలు స్వచ్చంధంగా సహకరించండి. మీ సమాచారాన్ని నిర్భయంగా వెల్లడించండి. మీకు ప్రభుత్వం అండగా ఉంటుంది తప్పితే ..ఎలాంటి హానీ చేయదు. ఇది మన ప్రభుత్వం ..మనందరి ప్రభుత్వం. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం. సమగ్ర సర్వే తెలంగాణ పునర్నిర్మాణంలో ఓ మైలురాయిగా నిలిచిపోవాలి. రేపటి బంగారు తెలంగాణకు ఇది నాంది కావాలి.
జై తెలంగాణ
sandeepreddy kothapally