ఎన్కంగ ఏనుగులు వొయ్యినా పర్వలేదు గాని ముందలంగ ఎల్కలను గుడ పోనిస్తలేరు భజనసేనకు చెందిన
స్వయంప్రకటిత అపర దేశభక్తులు. తెలంగాణలో తెలుగుదేశం - బీజేపీ పొత్తును జనం ఛీకొట్టడంతో మతి చెడ్డ ఈ ఫేస్ బుక్ యోధులు ఇక టీఆర్ఎస్ మీద, కేసీఆర్ మీద, కేసీఆర్ నిర్ణయాల మీద పడి ఏడుస్తున్నారు. తాజాగా కేసీఆర్ సానియా మీర్జాను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ ను చేసి రూ.కోటి నగదు పారితోషికం ప్రకటించడంతో ఈ మేధావులకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. ప్రజల సొమ్మంతా కేసీఆర్ దోచిపెడుతున్నాడు తెగ ఊగి పోతున్నారు.
కూట్లరాయి తియ్యలేనోడు ఏట్ల రాయి తీస్తనన్నట్లు ..సానియా మీర్జాను వివాదాల్లోకి లాగి హీరోలయిపోయినట్లు ఫీలయ్యారు. తీరా జాతీయ బీజేపీ పార్టీ కాస్త సానియాకు మద్దతు పలకడంతో రాష్ట్ర బీజేపీ నాయకులు తమ వ్యాఖ్యలను ఎలా వెనక్కు తీసుకోవాలో తెలియక తికమకపడ్డారు. బీజేపీ నేత లక్ష్మణ్ సానియామీర్జాను తప్పుపడితే ..పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి రంగంలోకి దిగి ఆంధ్రా విద్యార్థులకు కేసీఆర్ ఫీజు రీ ఎంబర్ప్ మెంట్ ఇవ్వడానికి 1956 స్థానికతను తెరమీదకు తెచ్చాడని, పిల్లలకు ఫీజులు కట్టడు గాని సానియాకు మాత్రం కోటి ఇచ్చాడని చెప్పడమే తమ పార్టీ ఎమ్మెల్యే లక్ష్మణ్ ఉద్దేశమని సర్ధి చెప్పుకొచ్చాడు. మొత్తానికి ఈ విషయంలో బీజేపీ పార్టీకి ఓ స్పష్టత లేదని, ఈ విషయంలో తాము తొందరపడి అనవసరంగా ఎంటరయ్యామని కాస్త లేటుగా తెలుసుకున్నారు.
ప్రజాధనం మీద ఇంత బాధ్యత ఉన్న ఈ భజనపరులు కేంద్రంలో మోడీ ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నించడానికి మాత్రం ముందుకురారు. కోటిరూపాయలు సానియామీర్జాకు ఇస్తే నెత్తీ నోరు బాదుకున్న వీరు మరి రిలయన్స్ అంబానీలకు లబ్ది చేకూర్చే పనిలో ఉన్న మోడీని ఎందుకు ప్రశ్నించరు అన్నది వారికే తెలియాలి. కేజీ బేసిన్ లో రిలయన్స్ ఉత్పత్తి చేస్తున్న గ్యాస్ ధరను యూనిట్ కు 4.1 డాలర్ల నుండి 8.2 డాలర్లకు పెంచేందుకు కేంద్రం రంగం సిద్దం చేసింది. ఈ నిర్ణయంతో లక్షల కోట్ల ప్రజాధనం రిలయెన్స్ కు దోచిపెట్టే కుట్ర ఉంది. యూపీఏ హయాంలో కేంద్రమంత్రి జైపాల్ రెడ్డిని తప్పించి మరీ గ్యాస్ ధరను పెంచుకునేందుకు సిద్దమయి విశ్వప్రయత్నాలు చేసి ఆగిపోయింది. కానీ మోడీ ప్రభుత్వం మాత్రం ఇప్పటికే మూడింటి ధరలు పెంచి ..ఇక రిలయెన్స్ గ్యాస్ ధర కూడా పెంచి వాళ్ల సేవలో తరించేందుకు సిద్దమవుతోంది.
కేసీఆర్ అధికారంలోకి వచ్చిన కొద్దిరోజుల్లోనే తన నిర్ణయాలతో ప్రజల మనసులు గెలుచుకున్నాడు. తొమ్మిదేళ్ల అనుభవం అంటూ మీడియా ముందు మీసాలు తిప్పుతున్న చంద్రబాబుకు తన చర్యలతో కేసీఆర్ అనుభవానికి - ఆచరణకు చాలా వ్యత్యాసం ఉంటుందని చాటుతున్నాడు. కేసీఆర్ నిర్ణయాలతో మోడీ భక్తులకు బుగులు రేగుతోంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ ను బద్ నాం చేయడానికి దొరికే ప్రతి అవకాశాన్ని వీళ్లు వదులుకోవడానికి సిద్దపడడంలేదు. రైలు ప్రమాదంలో పిల్లలు చనిపోతే వేగంగా స్పందించిన తెలంగాణ సర్కారు క్షతగాత్రులను ఆసుపత్రికి చేర్చి నాణ్యమైన వైద్యం అందేలా చూసింది. స్వయంగా మంత్రి పద్మారావు ఏకంగా సంఘటనా స్థలం నుండి అంబులెన్సులోనే ఆసుపత్రికి వచ్చారు. కేసీఆర్ మంత్రులను అప్రమత్తం చేసి తను యశోద ఆసుపత్రిలో పిల్లల పరిస్థితిని పరిశీలించారు.
కానీ ఈ అపర మేధావులు మాత్రం కేసీఆర్ సంఘటనా స్థలానికి వెళ్లలేదని, ఆయన నియోజకవర్గంలో అంతపెద్ద ప్రమాదం జరిగితే ఇంత నిర్లక్ష్యమా అని ప్రశ్నలు మొదలుపెట్టింది. గాయపడిన విద్యార్థులకు తక్షణ సహాయం అందిందా ? లేదా ? చనిపోయిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఏమయినా నిర్లక్ష్యం చేసిందా ? అన్న ప్రశ్నలు రావాల్సిన సమయంలో కేసీఆర్ రాలేదని ఓ రాయి విసిరి ఆనందపడ్డారు. ఇక వీరికి పచ్చమీడియా జేజేలు పలికి జెండాలు ఊపింది. ఎంతసేపూ కేసీఆర్ ప్రభుత్వం మీద బురదజల్లే ప్రయత్నాలు తప్పితే ఒక్కటి కూడా తెలంగాణకు పనికివచ్చే సూచన మాత్రం రాదు. అబద్దాలు ఒక్కోసారి ఎక్కువ ప్రచారంలోకి రావచ్చు ..అవి తాత్కాలిక ఆనందాన్ని కలిగించవచ్చు కానీ ..నిజాలు ఎప్పుడూ జనానికి గుర్తుండిపోతాయి. ఇప్పటికయినా ఈ చర్యలు మానుకోకుండా 'గోడమీద రాయి యాడనో నూక్కున్నట్లు' జనమే వీరికి తగిన సమాధానం చెబుతారు.
sandeepreddy kothapally