20, మార్చి 2012, మంగళవారం

కారు జోరు..టీడీపీ, కాంగ్రెస్ బేజారు


నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో టీఆర్ఎస్ అభ్యర్థి గంప గోవర్ధన్, స్టేషన్ ఘనపూర్ లో టీఆర్ఎస్ అభ్యర్థి తాటికొండ రాజయ్య ఘనవిజయం సాధించారు. కామారెడ్డిలో టీడీపీకి  డిపాజిట్ దక్కలేదు. స్టేషన్ ఘనపూర్ లో టీడీపీ అభ్యర్థి కడియం శ్రీహరి రెండో స్థానంలో నిలిచారు.
గంప గోవర్ధన్ అనూహ్యంగా 44 వేల ఓట్ల అధిక్యంతో విజయం సాధించగా, రాజయ్య 26 వేల ఓట్ల అధిక్యంతో విజయం సాధించారు. కామారెడ్డిలో అభ్యర్థిపై వ్యతిరేకత ఉందని, గెలుపు కష్టమని వార్తలు వచ్చాయి. అయితే ఓటింగ్ సరళిలో ఆ విషయం ఎక్కడా కనిపించలేదు. పూర్తిగా ప్రజలు ఏకపక్షంగా ఓట్లు వేసినట్లు కనిపిస్తోంది.

పాలమూరులో ముందుకెళ్లిన ’కారు‘

మహబూబ్ నగర్ అసేంబ్లీ నియోజకవర్గంలో రౌండ్ రౌండ్ కు ఫలితాల్లో తేడా వస్తోంది. ఆరు రౌండ్ల వరకు కాంగ్రెస్ అభ్యర్థి స్వల్ప ముందంజలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి ఎన్నం శ్రీనివాస్ రెడ్డి రెండో స్థానంలో ఉన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి నాలుగో స్థానంలో ఉన్నారు. అయితే అనూహ్యంగా టీఆర్ఎస్ అభ్యర్థి సయ్యద్ ఇబ్రహీం పుంజుకున్నారు.
ఎనిమిదో రౌండ్ పూర్తయ్యే సరికి 479 ఓట్ల అధిక్యంలోకి దూసుకెళ్లారు. బీజేపీ అభ్యర్థి రెండో స్థానంలో నిలిచారు. టీఆర్ఎస్ కు 15,470 ఓట్లు రాగా, బీజేపీకి 14,900 ఓట్లు, కాంగ్రెస్ కు 13,700 ఓట్లు, టీడీపీకి  9900 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ ఇక్కడ వెనకబడి పోగా బీజేపీ, టీఆర్ఎస్ ల మద్య ప్రధాన పోటీ నెలకొంది.
తాజాగా అందిన సమాచారం ప్రకారం సయ్యద్ ఇబ్రహీం 2317 ఓట్ల మెజారిటీలో ఉన్నారు. మహబూబ్ నగర్ లో ముస్లింల ప్రాబల్యం అభ్యర్థికి కలిసివచ్చినట్లు గా తెలిసి పోతుంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు ఖాయం అనుకోవచ్చు. టీఆర్ఎస్ అభ్యర్థికి 23 వేల 564 ఓట్లు రాగా, బీజేపీకి 21,560 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ 16 వేల ఓట్లు, టీడీపీకి 11 వేల ఓట్లు వచ్చాయి. ఇప్పటి వరకు 11 రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయింది. మరో ఏడు రౌండ్ల ఓట్లు లెక్కించాల్సి ఉంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి