24, అక్టోబర్ 2013, గురువారం

దూడను చీకమంటడు..బర్రెను..?! సోయి తప్పిన సెంద్రబాబు..!!

ఈ దేశంలో ఇప్పటి వరకు మొత్తం 28 రాష్ట్రాలున్నాయి. ఇప్పుడు 29వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పాటు కాబోతుంది. కానీ ఇంతవరకు ఏ ప్రాంతీయ పార్టీ కూడా రెండు రాష్ట్రాలలో అధికారం దక్కించుకున్న దాఖలాలు లేవు. కాకపోతే మిగతా రాష్ట్రాలలో ఒకటో ..రెండో స్థానాలు దక్కించుకున్నాయి తప్పితే ప్రభావం చూపడం..ప్రతిపక్ష స్థానాన్ని దక్కించుకున్న చరిత్ర కూడా లేదు. కానీ చరిత్రలో చేయని పనులే చేయడం..చరిత్ర హీనుడిగా మిగలడం ఒక్క చంద్రబాబుకు మాత్రమే అలవాటుగా ఉన్నట్లుంది.

ఈ రాష్ట్రానికి తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా, మరో తొమ్మిదేళ్లు
ప్రతిపక్ష నాయకుడిగా చేస్తున్న ఆయనకు రాష్ట్ర విభజన విషయంలో ఓ ఖచ్చితమయిన అభిప్రాయం లేదు. ఎదుటి పార్టీలు విభజనను రాజకీయ అవకాశవాదంగా వాడుకుంటున్నాయి అనే దుగ్ద.. రాష్ట్రాన్ని ఇలా విభజిస్తారా ? ఇక్కడ పెద్ద మనుషులు లేరా ? తెలుగు జాతి మధ్య చిచ్చుపెడతారా ? అని ఆరోపించడం తప్పితే తనయితే ఎలా విభజిస్తాడు ? తనయితే ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తాడు ? అని మాత్రం చెప్పడు. అప్పటికి తానేదో రాజకీయ ప్రయోజనాలకోసం అస్సలు వెంపర్లాడడం లేదు అన్నట్లు మాట్లాడుతున్నాడు.

తెలంగాణ ప్రకటన వచ్చిన తరువాత కూడా తాను సమైక్య వాదిని అన్న వైఎస్ జగన్ కంటే, రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటూ అన్ని ప్రాంతాలను సమానంగా చూడకుండా తెలంగాణకు పచ్చి వ్యతిరేకంగా పనిచేస్తూ నిస్సిగ్గుగా నిధులు దోచుకుపోతున్నకిరణ్ కంటే.. వ్యతిరేకం కాదంటూనే తెలంగాణకు వీలయినంత ఎక్కువ నష్టం చేసే చంద్రబాబునాయుడు, జయప్రకాష్ నారాయణ వంటి వారి మూలంగానే ఎక్కువ నష్టం. తెలంగాణకు వ్యతిరేకం కాదంటూనే సీమాంధ్ర ప్రయోజనాలు, సీమాంధ్ర సమస్యలు బయటపెట్టకుండా, వాటికి పరిష్కారాలు కోరకుండా తెలంగాణ గురించి ప్రకటనలు చేసే దిగ్విజయ్ సింగ్ ను చంద్రబాబు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేత విమర్శలు చేయిస్తాడు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను నిలిపేయాలని పయ్యావుల కేశవ్ తో పిల్ లు వేయిస్తాడు.

వీలయినన్ని ఎక్కువ సమస్యలు సృష్టించేందుకు తన వంధిమాగధులయిన మీడియా యాజమాన్యాల చేత తెలంగాణ విభజన మూలంగా సీమాంధ్రులు కోల్పోతున్న వాటిని భూతద్దంలో పెట్టి చూయించి ప్రచారం చేయిస్తాడు. కానీ తెలంగాణ ఇన్నాళ్లు కోల్పోయిన దాని గురించి మాట్లాడడు. వెయ్యి మంది బలిదానాల గురించి ఒక్క నాడు మాట్లాడని చంద్రబాబు అరవై రోజుల కృత్రిమ ఆందోళనను భూతద్దంలో చూయించే తన తరపు మీడియాతో కలిసి గుండెలు బాదుకుంటాడు. లేని సమైక్య భావనను తట్టి లేపేందుకు ప్రయత్నాలు చేస్తుంటాడు. నంది ఎప్పుడూ పంది కాదు. తెలంగాణ ఉద్యమం నంది లాంటిది..సీమాంధ్ర ఉన్మాదం పంది లాంటిది. చంద్రబాబు నాయుడు లాంటి  నేతలు మన రాష్ట్రంలో ప్రముఖులుగా చెలామణికావడం, జయప్రకాష్ నారాయణ లాంటి వారు మేధావులు అని ఫీలవ్వడం నిజంగా దురదృష్టం.

ఒకవైపు తెలంగాణకు మద్దతు అంటూనే మరో వైపు సీమాంధ్ర గురించి మాట్లాడడం దూడను చీకమనడం..బర్రెను తన్నమనడం సామెతను గుర్తుకుచేస్తుంది. నిజంగా చంద్రబాబు నాయుడు ఇప్పుడు విభజన మూలంగా ఎదురయ్యే సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి నిజాయితీగా పోరాడి సాధించుకునే ప్రయత్నం చేస్తే భవిష్యత్ లో బాబుకు సీమాంధ్రలో మంచి భవిష్యత్ ఉంటుంది. తెలంగాణలో జనం అభిమానం కూడా కాస్త మిగులుతుంది. ఇప్పుడు సమైక్య నినాదం ఎత్తుకుని జగన్ తాత్కాలికంగా లాభపడవచ్చు. కానీ జగన్ కు భవిష్యత్ ఉండదు. చంద్రబాబు కూడా జగన్ దారినే నమ్ముకుంటే నట్టేట్లో మునగడం ఖాయం.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి