15, జూన్ 2014, ఆదివారం

మీడియా – తెలంగాణ


వాళ్లకు మన ఉనికి నచ్చదు. వాళ్లకు మన ఉన్నతి నచ్చదు. అరవైఏళ్లుగా జీర్ణించుకుపోయిన ఆంధ్రా ఆధిపత్య అహంకార ధోరణి వారిని ఊరికె ఉండనివ్వదు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది అన్న ఆలోచనే వారికి ఇంకా తట్టలేదు. ప్రపంచంలోనే అత్యంత ప్రజాస్వామికంగా పోరాడి తెలంగాణ ప్రజలు లక్ష్యాన్ని చేరుకోవడాన్ని వారు ఏ మాత్రం జీర్ణించుకోలేరు. అసలు సీమాంధ్ర నేతలకన్నా ఈ మీడియా మొగల్స్ తోనే తెలంగాణ ముందు ముందు పెను ప్రమాదం ముంచుకువస్తోంది. ఇది మొగ్గలోనే తుంచేయకపోతే తెలంగాణకు భవిష్యత్ లో తీరని అన్యాయం జరుగడం ఖాయం.

తెలంగాణ శాసనసభ్యులను హేళన చేస్తూ టీవీ 9, సీమాంధ్ర ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ తెలంగాణ ప్రభుత్వం మీద విషం చిమ్ముతూ ఆంధ్రజ్యోతి దినపత్రిక చేసిన ప్రసారాలు, రాసిన వార్తలు వారిలోని తెలంగాణ వ్యతిరేకతను నగ్నంగా బయటపెట్టుకున్నాయి. స్వయంగా కేసీఆర్ స్పందించడం ..తెలంగాణ శాసనసభ ఆగ్రహం వ్యక్తం చేయడంతో మొక్కుబడి క్షమాపణలు వచ్చినా అవి భవిష్యత్ లో తమ తీరు మార్చుకుంటాయని భావించడం అత్యాశనే అవుతుంది.

అసలు ఈ సీమాంధ్ర మీడియా మూలలను దెబ్బతీస్తేనే తెలంగాణకు భవిష్యత్ ఉంటుంది. సీమాంధ్ర పెట్టుబడిదారుల కొమ్ముకాసే ఈ సీమాంధ్ర మీడియా అవకాశం దొరికితే తెలంగాణ ప్రభుత్వాలను అస్థిర పరిచేందుకు కాచుక్కూర్చుంటాయి. తెలంగాణ ప్రభుత్వాన్ని దెబ్బకొట్టడం ద్వారా తెలంగాణ ప్రజల్లో అభద్రతా భావాన్ని పెంచి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయేలా చేయడం వీటి ప్రధాన

లక్ష్యం. భవిష్యత్ లో ఏ రోజు అవకాశం వచ్చినా ఇవి దాన్ని చేజార్చుకోవు.

అసలు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడడం ..కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ..ఆయన మంత్రివర్గంలో ఎలాంటి లుకలుకలు లేకపోవడం ..తొలి శాసనసభ సమావేశాలు అత్యంత హుందాగా సాగడం ..కేసీఆర్ తన భవిష్యత్ ప్రణాళిక స్పష్టంగా సభ ముందు ఉంచడం ..దానికి ప్రతిపక్షాలు కూడా ప్రశంసలు తెలపడం ఈ మీడియాకు ఏ మాత్రం మింగుడు పడడం లేదు. మీడియా మొగల్స్ పంచవర్ష ప్రణాళికలు అమలు పరిచే సీమాంధ్ర నేతలతో కేసీఆర్ ను పోల్చి చూసుకుని ఈ వర్గాలు కుమిలిపోతున్నాయని చెప్పక తప్పదు. కేసీఆర్ కు తెలంగాణలోని 119 నియోజక వర్గాల మీద పట్టుంది. ఏ నియోజకవర్గానికి ఏ సమస్య ఉంది అన్నది ఆయన దృష్టిలో ఉంది. గత 14 ఏళ్లుగా తెలంగాణ అణువణువూ కేసీఆర్ తిరిగి చూసిందే. అందుకే శాసనసభలో ఏకంగా 2 గంటల 40 నిమిషాలు ఎలాంటి తడబాటు లేకుండా సాగిన తన ప్రసంగంలో నీళ్లు, విద్యుత్, వ్యవసాయం, పరిశ్రమలు, విద్య, వైద్యం వంటి అంశాల మీద స్పష్టమయిన వైఖరిని బయటపెట్టారు. ఈ పరిణామాలు ఏవీ సీమాంధ్ర మీడియాకు రుచించడం లేదు.

ఎంతసేపూ తెలంగాణ నేతలను బలహీన పరచడం ..తెలంగాణ ప్రజల దృష్టిలో వారి మీద అనుమానాలు రేకెత్తించడం ..అసలు వీళ్లు ఏమీ అభివృద్ది చేయలేరని, వీరికి అసలు పరిపాలన రాదని, పరిపాలనకు వీరు పనికేరారని చెప్పడం వారి ప్రధాన ఉద్దేశం. వాస్తవంగా తెలంగాణ జిల్లాలలో సీమాంధ్ర మీడియాను జనం విశ్వసించడం మానేసి చాలా కాలమయింది. కాకపోతే ఇన్నాళ్లు అలవాటు పడిన పత్రికలను, ఛానళ్లను ఒకేసారి మానుకోవడం ..దానికి తగినంత ప్రత్యామ్నాయాలు లేకపోవడం మూలంగా ఆంధ్రా మీడియాకు అవకాశంగా మారింది. అయితే తెలంగాణ ప్రభుత్వం సీమాంధ్ర మీడియాను తలదన్నే ఛానళ్లు, పత్రికలు తెలంగాణ ఔత్సాహికులు ఏర్పాటు చేసేలా తగినంత ప్రోత్సాహం ఇవ్వాలి. తెలంగాణలో ఓ ప్రత్యేకమయిన ప్రణాళికతో ఇది జరగాలి. ఇది ఎంత త్వరగా జరిగితే తెలంగాణ సమాజానికి ..తెలంగాణ ప్రభుత్వానికి ..తెలంగాణ భవిష్యత్ కు అంత లాభదాయకంగా ఉంటుంది.

- సందీప్ రెడ్డి కొత్తపల్లి
http://www.telanganatalkies.com/మీడియా-తెలంగాణ/

1 కామెంట్‌: