ఏ రాజకీయ నాయకుడు అయినా చేసేది ఒక్కటే పని. అధికారం చేతికి వస్తే ..మనకేం గిట్టుబాటవుతుంది ..మన
చుట్టుపక్కల వారికి ఏం గిట్టుబాటవు తుంది. ఈ అయిదేళ్లలో ఎంత మాత్రం వెనకేసుకోగలం. ప్రతిపక్షాలను ఎలా ఇరుకున పెట్టగలం. ప్రజల దృష్టిని ఎలా పక్కకు మళ్లించగలం. మన తప్పిదాలను ప్రజలు గుర్తించకుండా ఏం చేయగలం ? ఇలాంటి ఆలోచనలు తప్పితే రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమయిన విషయాల మీద కూడా కనీసం స్పష్టమయిన అవగాహన ఉండదు. ఏ విషయం తెలుసుకోవాలన్న కిందిస్థాయి అధికారులు సమాచారం ఇవ్వాల్సిందే. వారు చెప్పిన వివరాలనే చెప్పడం తప్పితే సొంతంగా ఓ అంశం మీద ఎలాంటి అవగాహన ఉండదు. కానీ తెలంగాణ తొలి అసెంబ్లీ సమావేశాలు చూసిన రాజకీయ నేతలంతా కేసీఆర్ ను చూసి నేర్చుకోవాలి. ఆయనను పాఠంగా భావించి చదువుకోవాలి.
కృష్ణ, గోదావరి నదులకు సంబంధించిన వాటా గురించి బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు ముఖ్యమంత్రి హోదాలో స్వయంగా నేనే వాదిస్తాను అని నిండు శాసనసభ సాక్షిగా కేసీఆర్ ప్రకటించడం చూస్తే ఖచ్చితంగా ఇంతవరకూ ఏ నాయకుడూ ఇంత ధైర్యంగా ప్రకటించిన దాఖలాలు లేవనే చెప్పాలి. కేసీఆర్ కు నదీ జలాల కేటాయింపుల విషయంలో ఎంత అవగాహన లేకుంటే స్వయంగా తానే వాదిస్తానన్న ప్రకటన చేసి ఉంటారు. జల నిపుణులు, తలపండిన ఇంజనీర్లు చేయాల్సిన పనిని తాను చేస్తానని కేసీఆర్ తేల్చేశాడు. కేసీఆర్ ఏం వాదిస్తాడు అని కనీసం ప్రతిపక్షాలు అభ్యంతరం కూడా చెప్పలేకపోయాయి అంటే కేసీఆర్ వారిని ఎంతలా ఒప్పించగలిగారో ..మెప్పించగలిగారో అర్ధం చేసుకోవాలి.
తెలంగాణకు సంబంధించి సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో జరుగుతున్న వాద ..ప్రతివాదాలపై కేసీఆర్ కు స్పష్టమయిన అవగాహన ఉంది. కిందిస్థాయిలో జరుగుతున్న ప్రతి విషయం కేసీఆర్ కు తెలుసు. ఆయనకు ఈ విషయంలో ప్రత్యేకంగా జిల్లాల వారి క్షేత్ర వివరాలు ప్రత్యేకంగా వేగులు ఉంటారని ..వారు ఎవరితోనూ సంబంధం లేకుండా నేరుగా కేసీఆర్ తో టచ్ లో ఉంటారని అంటుంటారు. కానీ ఎంత మంది ఆంధ్రానాయకులకు ఈ విధంగా అవగాహన ఉంది. కేసీఆర్ లా ఎంతమందికి క్షేత్రస్థాయి వివరాలు తెలుసుకుంటుంటారు అంటే అది అనుమానమే.
శాసనసభను ఉద్దేశించి ముఖ్యమంత్రి స్థాయిలో కేసీఆర్ దాదాపు రెండుగంటలు మాట్లాడితే విద్యుత్, విద్య, వైద్యం, తెలంగాణ ఉద్యమం, అమరులు, వారి కుటుంబాలు, తెలంగాణకు సహకరించిన రాజకీయ పార్టీలు, తెలంగాణ జిల్లాలలో పేదలు, బలహీనవర్గాలు, ఎన్నికల్లో తాను ఇచ్చిన హామీలు ..వాటిని అమలు చేయబోయే విధానం, తమిళనాడు తరహా రిజర్వేషన్, తమిళనాడులో అసలు అలా రిజర్వేషన్లు ఎందుకు డిమాండ్ లోకి వచ్చాయి. వాటిని వారు ఎలా అమలు చేస్తున్నారు. ఆ తరహా రిజర్వేషన్లు తెలంగాణకు ఎందుకు అవసరం. రుణమాఫీ అమలు ఎలా ..తెలంగాణకు భవిష్యత్ లో విద్యుత్ అవసరాలను ఎలా తీర్చుకోవాలి. రాబోయే సంవత్సరాలలో ఎంత విద్యుత్ ఉత్పత్తి స్థాయికి ఎదగాలి. తెలంగాణ నదీ జలాల వాటాలు ..ఏ జిల్లాకు ..ఏ నియోజకవర్గానికి సాగునీరు అవసరాలు ఎలా తీర్చాలి. ఏ ప్రాజెక్టు పూర్తి చేస్తే ..ఏ ప్రాంతానికి సాగునీరు అందుతుంది.
తెలంగాణలోని పది జిల్లాలు ..119 నియోజకవర్గాల మీద కేసీఆర్ కు స్పష్టమయిన అవగాహన ..తెలంగాణలో ఏ జిల్లాలో ఏ పంటలు వేస్తారు ? ఎక్కడ ఏ పంట అధికంగా పండుతుంది. ఎత్తిపోతల పథకాలకు విద్యుత్ సరఫరా ఎలా ? ఏ జిల్లాలో ఏ పరిశ్రమలు పెట్టవచ్చు. వాటికి నిధులు ఎలా తీసుకురావాలి అంటూ కేసీఆర్ అనర్గళంగా ప్రసంగించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. కేసీఆర్ ప్రసంగం విన్న విపక్ష నేతలంతా ఆయనను అభినందించకుండా ఉండలేకపోయారు. ప్రతిపక్ష నేతలు పలు విషయాలలో కేసీఆర్ ను డిఫెన్స్ లోకి నెట్టే ప్రయత్నం చేసినా కేసీఆర్ ఎక్కడా తడబడలేదు. అన్ని సమస్యలకు అఖిలపక్షం వేసి సమిష్టి నిర్ణయాలతో ముందుకు వెళ్తామని చెప్పి ప్రతిపక్షాల ముందరికాళ్లకు బంధం వేశారు. పదే పదే అధికారం దక్కిందన్న గర్వం లేదు. గెలిచాం కాబట్టి మేం చెప్పినట్లే వినాలన్న భేషజం లేదు అని ప్రకటించి ప్రతిపక్షాలనే డిఫెన్స్ లోకి నెట్టేశారు. తెలంగాణ ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని ..వారి కలలు నెరవేర్చేందుకు సహకరించాలని చెప్పి వారు కలిసి రావాల్సిన పరిస్థితిని కల్పించారు. కేసీఆర్ వ్యవహార శైలి ..సమస్యలపై కేసీఆర్ కు ఉన్న అవగాహన ..క్షేత్రస్థాయి అంశాలపై కేసీఆర్ కు ఉన్న పరిశీలనా దృష్టి ప్రతి నేతకూ అవసరం. తెలంగాణ అంశాన్ని పక్కన పెడితే కేసీఆర్ కు ఉన్న విషయ పరిజ్ఞానం ..పరిశీలనను నేతలు అలవాటు చేసుకోవాలి. ఈ విషయంలో ప్రాంతాలకు అతీతంగా నేతలు ఆయనను ఫాలో కావాలి. నేతలంతా ఖచ్చితంగా ఓ పాఠంగా స్వీకరించాల్సిన అవసరం ఎంతయినా ఉంది.
sandeepreddy kothapally