18, మే 2014, ఆదివారం

కోట్లకొక్కడు ..కేసీఆర్



నూటికో ..కోటికో ..ఒక్కడు కాదు ..కోట్లాది మందికి ఒక్కడు కేసీఆర్. అరవై ఏళ్ల తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను నిజం చేసిన ఒకే ఒక్కడు కేసీఆర్. ఇప్పుడు విజయానందంలో ఉండవచ్చు కానీ గత 14 ఏళ్లుగా ఆయన పడ్డ వేదన ..అవహేళనలు ..అవమానాలు అన్నీ ఇన్నీ కావు. ఈ రోజు ఆయనకు పూలందిస్తున్న చేతులే ఆయన కాళ్లసందున కట్టెలు పెట్టిన సంఘటనలు చాలా ఉన్నాయి. ఒక వ్యక్తి వక్తిత్వం మీద.. అలవాట్ల మీద ..ఈ మధ్య కాలంలో ఎన్నడూ రాజకీయాల్లో ఏ నేత మీదా జరగలేదు. కేసీఆర్ మొండితనమే ఆయనను నిలబెట్టింది. కేసీఆర్ పట్టుదలనే ఈ రోజు తెలంగాణను సాధించిపెట్టింది. సహకరించామన్నవారు ..సాధించామన్నవారు చాలా మంది ఉండొచ్చు ...కానీ వారందరికన్నా ముందున్నది కేసీఆర్ మాత్రమే ..

సీమాంధ్ర మీడియా ..సీమాంధ్ర పెట్టుబడిదారులు..సీమాంధ్ర రాజకీయ నేతలు ముప్పేట దాడిచేస్తున్నా వెరవకుండా కేసీఆర్ అత్యంత వ్యూహాత్మకంగా గత 14 ఏళ్లుగా తెలంగాణ సాధనకు తన ప్రణాళికను అమలు చేశారు. మొదటిసారి కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని ఆ పార్టీని తెలంగాణకు ఒప్పించిన కేసీఆర్ .. ఆ తరువాత 2009లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని దానిని ముగ్గులోకి దింపి తెలంగాణ అంశం నుండి ఆ పార్టీలు వెనక్కి పోయే అవకాశం లేకుండా చేశాడు కేసీఆర్. ఈ మధ్యకాలంలో నిజంగా కేసీఆర్ పదవికో ..పైసలకో అశించినట్లయితే ఈ రోజు తెలంగాణ అంశం అనేదే మనం మరిచిపోయే వాళ్లం. కానీ కేసీఆర్ లక్ష్యం మీద గురిపెట్టి వ్యూహాత్మకంగా ముందుకు సాగారు.

అవకాశం కోసం పొంచిఉన్న వేటగాడిలా 2009 ఎన్నికల్లో ఓడిపోయి ఆ వెంటనే వైఎస్ మరణించగానే మూడు నెలల్లో రాష్ట్ర ముఖచిత్రాన్నే మార్చేశారు. సీమాంధ్ర రాజకీయ నాయకుల డొల్లతనాన్ని బట్టబయలు చేసి తెలంగాణ ప్రజలను అప్రమత్తం చేశారు. ఈ పరిస్థితులలో సీమాంధ్ర మీడియా ధాటికి ఏ రాజకీయ నాయకుడు అయినా చేతులెత్తేసేవారే కానీ కేసీఆర్ కాబట్టి మాత్రమే వాళ్లందరినీ తట్టుకుని పోరాడగలిగారు. 2001లో కేసీఆర్ పార్టీ పెట్టినప్పుడు ఆయనను గేలిచేసినవారు ..అసలు తెలంగాణ రాష్ట్రం అవసరం ఇప్పుడు ఏముందని ప్రశ్నించిన వారు...ఆ తరువాత చచ్చినట్లు కేసీఆర్ వెంటనడిచారు. అయితే సీమాంధ్ర మీడియా కేసీఆర్ మీద తెలంగాణ సమాజానికి అనుమానాలను పెంచింది. ఈ రోజు తెలంగాణ సాధించిన వ్యక్తిగా కేసీఆర్ పూర్థి స్థాయి క్రెడిట్ దక్కకపోవడానికి కారణమూ ఈ సీమాంధ్ర మీడియానే.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర బిల్లు కేంద్రం ఆమోదించిన తరువాత,.రాష్ట్రపతి దానికి ఆమోదముద్ర వేసి అపాయింటెడ్ డేట్ వచ్చిన తరువాత కూడా కేసీఆర్ ను తెరమరుగు చేసేందుకు ..తెలంగాణ వచ్చిన తరువాత ఇక ఆయనతో పనేంటి ..అసలు ఆయన చేసింది ఏంటి తెలంగాణ కోసం ..అన్న ప్రచారం పెద్ద ఎత్తున చేసి ఆయన గొప్పతనాన్ని తగ్గించే ప్రయత్నం చేశారు. తెలంగాణను అభివృద్ది చేసేందుకు గానీ ..భవిష్యత్ లో తెలంగాణ భద్రతకు గానీ కేసీఆర్  ఏ మాత్రం ఉపయోగపడడని ..కేసీఆర్ ను ఎన్నుకుంటే తెలంగాణకు నష్టం అని భారీ ఎత్తున ప్రచారం చేశారు. తెలంగాణ సమాజంలో కేసీఆర్ మీద నమ్మకం సన్నగిల్లేలా చేసేందుకు ప్రయత్నం చేశారు.

ఈ ప్రచారంలో ప్రత్యర్ధులు కొంతవరకు సఫలమయినట్లే భావించాలి. ఎందుకంటే 119 స్థానాలలో వాస్తవంగా టీఆర్ఎస్ కు 90కి పైగా స్థానాలు సాధించాలి. కానీ టీఆర్ఎస్ 63 స్థానాల వద్దనే ఆగిపోవడానికి కారణం అదే. కేసీఆర్ మీద ఎంత బురదజల్లినా ..తెలంగాణ సమాజం కీలకసమయంలో విజ్ఞతతో వ్యవహరించింది. ఇక ముందుకాలంలో కూడా తెలంగాణ కేసీఆర్ అండగా నిలవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది.

1 కామెంట్‌: