11, మే 2014, ఆదివారం

అనంగ అనంగ ఓ దోస్తు..

అనంగ అనంగ ఓ దోస్తు ఉండెటోడు ..ఆనికి ఊరంటె మస్తు పానం.

ఆడు దోస్తు అంటె మామూలు దోస్తు గాదు. ఆడు ఊరికే దోస్తు..

వాడు ఊళ్ల ఉంటె ఊళ్ల ఆని దోస్తులకు ..ఆనికన్న చిన్నోళ్లకు ..పెద్దోళ్లకు పండుగనే పండుగ
ఆనికి మస్తు పొలం ఉంది. ఆడుత పాడుత పొలం జేసెటోడు. పదో తర్గతి కాడనే సదువు సాలిచ్చుకున్నడు వాడు. ఆనికి అది అంత వంటవట్టలే ..30 ఎకరాల పొలం ..చేతినిండ పైసలు.
ఆనికి ఈడు ..వాడు అని లేదు. ఆడు చెల్క జెయ్యాలె.  దోస్తులతోని తిర్గాలె..కిర్ కెట్ ఆడాలె. ఆని ఊళ్ల ..సుట్టుపక్కల ఊళ్ల యాడ కిర్ కెట్ పోటీలు జర్గినా ఈనికి మతులావు వచ్చేది. ఎంట్రి పీజు ఈడె గట్టాలె ..ఊరి పోరగాళ్లను జమజేస్కోని పొయ్యి ఆట ఆడి వచ్చెటోడు. గెల్సుడు ..ఓడుడు తర్వాత సంగతి ..ఆళ్ల ఊరినుంచి వొయ్యి మాత్రం కిర్ కెట్ ఆడాలె. ఆడుత పాడుత.. ఆని జీవితం సాపీగ సాగుతున్నది. ఇంతలనే బజాజ్ పల్సర్ బండ్లొచ్చినయ్యి..ఆని కాయిసు బండి మీదికి మళ్లింది. బండి దెచ్చుకున్నడు ..ఇంగ వాని తిర్గుడు తిర్గుడ గాదు ...ఓ రోజు అచ్చంపేటకు వొయ్యిండు ..అనుకోకుండ ఆటో ఎదురొచ్చింది. ఆని బండికి గుద్దింది. ఆడు ఆడనే పానం ఇడ్సిండు. పాపం ఆని దోస్తులంత బాధవడ్డరు. ఏ తీర్గ జూసినా ఆడు లేడన్న బాధ మాత్రం తీరుత లేదు. ఆని గుర్తుగ ఏదో ఒకటి వెట్టుకోవాలె అనుకున్నరు. కానీ ఏం బెట్టుకోవాలె ? శానా దినాలు ఆలోచించిండ్రు. ఆనికి కిర్ కెట్ అంటె పానం గావట్టి వాటినే ఆని గుర్తుగ స్థూపం గట్టుకోవాలె అనుకున్నరు. అంతే ఊరి గేటుకాడ స్థూపం గట్టిండ్రు. దాని మీద మూడు వికెట్లు ..పైన రెండు బెల్స్ వెట్టిండ్రు. మధ్యల ఓ బాల్ వెట్టిండ్రు. అందులనే ఆని రూపాన్ని సూసుకోని ముర్సిపోతుండ్రు. యాడాదికోసారి ఆడు సచ్చిపొయ్యిన దినం గుర్తు వెట్టుకోని ఆని పేరు మీద కిర్ కెట్ పోటీలు వెడ్తున్నరు. ఆడులేడన్న బాధను ఆ విధంగ మర్సి పొయ్యేందుకు ప్రయత్నం జేస్తున్నరు. మంచి దోస్తులు గద..

(మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేట తాలూకా బల్మూరు మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన కీ.శే భాస్కర్ రెడ్డి అనే యువకుడు ..ఆయిన దోస్తుల కథ ఇది. బహూశా గత నెలలో అతని వర్ధంతి అనుకుంటా ఎప్పుడో 2006లో ఈనాడుకు ఈ వార్త రాశా ..ఇయ్యాల మల్ల ఎందుకో యాదికొచ్చిండు)

3 కామెంట్‌లు:

  1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  2. చాలా మంచి స్నేహితులు! అభినందనీయులు! బ్రతికున్నప్పుదు అతని స్నేహపు మధురిమను ఆస్వాదించారు మరణించిన తర్వాత అతన్ని స్మరించుకుంటున్నారు! స్నేహానికి మంచి ఉదాహరణ!

    రిప్లయితొలగించండి