21, నవంబర్ 2012, బుధవారం

ఈ ‘షర్మిల’ ఏ ‘వీసా’తో ?


మయసభల ద్రౌపదిలా మీ అయ్య శాసనసభల నవ్విన ఎకిలి నవ్వులు ఇంకా మా కండ్లల్ల మెదులుతనే ఉన్నయి..అధికారం కోసం మా పంచన చేరి..తెలంగాణ డిమాండును ఢిల్లీ పెద్దలకు చెప్పి ఎన్నికల్ల గెలిచినంక పొత్తు పెట్టుకున్న పార్టీని చిలువలు పలువలు చేసి అసలు తెలంగాణ ఊసే లేకుండా చేయాలన్న కుటిలయత్నం మాకు ఇంగా గుర్తుంది.

ఏరు దాటినంక తెప్ప తగలేసినట్లు తెలంగాణల ఓట్లు ముగిసినదాంక ఏం మాట మాట్లాడకుండా నంధ్యాల సభల మీ అయ్య మాట్లాడిన మాటలు మా చెవుల్ల మార్మోగుతనే ఉన్నయి. తెలంగాణకు పోవాల్నంటే.. వీసా కావాల్నంట...హైదరాబాద్ వాళ్ల అయ్య జాగీరంట అని అన్న మాటలు మా గుండెల్ని మండిస్తనే ఉన్నయి. అవును హైద్రవాదు..మా అయ్య జాగీరే...ఇయ్యాల మీరు ...మీ కుటుంబం ఏ వీసా మీద తెలంగాణల తిరగుతున్నరు. అయ్య కోసం చచ్చిండ్రని ఓదార్పు కథలు చెప్పిన మీరు...తెలంగాణ కోసం బలయిన వందల అమరుల కుటుంబాల్లో ఒక్కరినయినా ఓదార్చిండ్రా ?

సీమ కథలు చెబితె నమ్మే చిన్నపిల్లలు ఈడ లేరు..తెలంగాణ ల మీరు యాత్రలు చేయొచ్చు కాని మీరు ఎన్నడయితే ఈ ప్రజలను మోసం చేసిండ్రో అప్పుడే తెలంగాణ ప్రజల గుండెల నుండి వేరు పడ్డరు. మీకు ఇక్కడ ఓదార్పు దొరకదు..ఓట్లు రాలవు...మీ అయ్య పెంచిన వంది మాగధులు ఈడ మీ కోసం వెయిట్ జేస్తున్నరు..మీరు వెంట తెచ్చుకున్న కిరాయి సైన్యం ఉండనే ఉంది ఇంగే ముంది పదండి ముందుకు ...పదండి తెలంగాణ అన్నోడిని పక్కకు తోసుకు..

 జై తెలంగాణ జై జై తెలంగాణ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి