21, నవంబర్ 2012, బుధవారం

ఈ ‘షర్మిల’ ఏ ‘వీసా’తో ?


మయసభల ద్రౌపదిలా మీ అయ్య శాసనసభల నవ్విన ఎకిలి నవ్వులు ఇంకా మా కండ్లల్ల మెదులుతనే ఉన్నయి..అధికారం కోసం మా పంచన చేరి..తెలంగాణ డిమాండును ఢిల్లీ పెద్దలకు చెప్పి ఎన్నికల్ల గెలిచినంక పొత్తు పెట్టుకున్న పార్టీని చిలువలు పలువలు చేసి అసలు తెలంగాణ ఊసే లేకుండా చేయాలన్న కుటిలయత్నం మాకు ఇంగా గుర్తుంది.

ఏరు దాటినంక తెప్ప తగలేసినట్లు తెలంగాణల ఓట్లు ముగిసినదాంక ఏం మాట మాట్లాడకుండా నంధ్యాల సభల మీ అయ్య మాట్లాడిన మాటలు మా చెవుల్ల మార్మోగుతనే ఉన్నయి. తెలంగాణకు పోవాల్నంటే.. వీసా కావాల్నంట...హైదరాబాద్ వాళ్ల అయ్య జాగీరంట అని అన్న మాటలు మా గుండెల్ని మండిస్తనే ఉన్నయి. అవును హైద్రవాదు..మా అయ్య జాగీరే...ఇయ్యాల మీరు ...మీ కుటుంబం ఏ వీసా మీద తెలంగాణల తిరగుతున్నరు. అయ్య కోసం చచ్చిండ్రని ఓదార్పు కథలు చెప్పిన మీరు...తెలంగాణ కోసం బలయిన వందల అమరుల కుటుంబాల్లో ఒక్కరినయినా ఓదార్చిండ్రా ?

సీమ కథలు చెబితె నమ్మే చిన్నపిల్లలు ఈడ లేరు..తెలంగాణ ల మీరు యాత్రలు చేయొచ్చు కాని మీరు ఎన్నడయితే ఈ ప్రజలను మోసం చేసిండ్రో అప్పుడే తెలంగాణ ప్రజల గుండెల నుండి వేరు పడ్డరు. మీకు ఇక్కడ ఓదార్పు దొరకదు..ఓట్లు రాలవు...మీ అయ్య పెంచిన వంది మాగధులు ఈడ మీ కోసం వెయిట్ జేస్తున్నరు..మీరు వెంట తెచ్చుకున్న కిరాయి సైన్యం ఉండనే ఉంది ఇంగే ముంది పదండి ముందుకు ...పదండి తెలంగాణ అన్నోడిని పక్కకు తోసుకు..

 జై తెలంగాణ జై జై తెలంగాణ

12, నవంబర్ 2012, సోమవారం

ఎంఐఎం భుజం మీద జగన్ తుపాకి..టార్గెట్ తెలంగాణ !



Disappointed with congress party, Asaduddin Owaisi, president of the All India Majlis-e-Ittehad-ul Muslimeen, member of Parliament, Hyderabad, announcing his party withdrawing support to ruling Congress government in state of Andhra Pradesh and UPA led in Center. Photo: Mohammed Yousuf
ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ కు మద్దతు ఉపసంహరణ వెనుక అసలు లక్ష్యం ఏంటి ? తెలంగాణ ఉద్యమాన్ని అడ్డుకునేందుకు ఎంఐఎం - జగన్ పార్టీలు చేతులు కలుపుతున్నాయా ? తెలంగాణకు మద్దతు ఇవ్వకుండా అధికారం దక్కించుకునేందుకు మజ్లిస్ ను జగన్ వాడుకుంటున్నాడా ? తెలంగాణ రావడం ఇష్టం లేని ఎంఐఎం జగన్ కు వంత పాడుతుందా ? ఇరువురి లక్ష్యం తెలంగాణను అడ్డుకోవడమే కాబట్టి ముందస్తు వ్యూహం ప్రకారం ఒక్కటవుతున్నారా ?

అవును. మజ్లిస్ భుజం మీద తుపాకి పెట్టి తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసేందుకు జగన్ పన్నాగం పన్నాడు. ఉద్యమంలో గందరగోళం రేపి, రాష్టంలో శాంతి భద్రతలు దెబ్బతీసి, అధికారం చేజిక్కించుకుని తెలంగాణ ఉద్యమాన్ని తండ్రి వైఎస్ లా అణగదొక్కేందుకు జగన్ రంగం సిద్దం చేశాడు. ఎంఐఎం - జగన్ ల ఇద్దరి లక్ష్యం తెలంగాణ రాకుండా అడ్డుకోవడమే కాబట్టి ఇద్దరూ ఒక్కటయ్యారు.

తెలంగాణ మీద ఎలాంటి వైఖరి చెప్పకుండా జగన్ పార్టీ నాన్చుతోంది. తెలంగాణకు అనుకూలమంటే సీమాంధ్రలో ఓట్లు పడవు. అందుకే తెలంగాణ గురించి ఏమీ చెప్పకుండా ఉద్యమాన్ని అణచాలి. అన్న జైల్లో ఉంటే తియ్యని మాటలతో తల్లి విజయమ్మ తెలంగాణలో తిరుగుతుంటే ఇప్పుడు చెల్లెలు షర్మిల కూడ తెలంగాణ గడ్డమీద పాదయాత్రకు వచ్చి సానుభూతి కూడగట్టుకునేందుకు వస్తోంది. తెలంగాణలో ఎంఐఎం అండతో ఓ మోస్తరు స్థానాలు గెలుచుకుంటే సీమాంధ్రలో గెలిచే స్థానాలతో అధికారం అందుకోవచ్చన్నది జగన్ వ్యూహం.

 జగన్ జైలు నుండి బయటకు వస్తే తెలంగాణ మీద ఏదో ఓ వైఖరి చెప్పాలి. జైలులోనే ఉండి కథ నడిపిస్తే కొరకరాని కొయ్యగా ఉన్న తెలంగాణ మీద ఎలాంటి వైఖరి చెప్పకుండా ఎన్నికలకు వెళ్లొచ్చు. ఇక ఓటర్లలోనూ సానుభూతికి సానుభూతి కలిసి వస్తుంది. అందుకే జగన్ జైలులో ఉండే రాష్ట్రంలో ఎన్నికలు వచ్చే పరిస్థితిని ఏర్పరుస్తున్నాడు. కాంగ్రెస్ నుండి ఓ 10 మందిని లాగితే రాష్ట్రంలో ఎన్నికలు ఖాయం. తెలంగాణ వాదులూ తస్మాత్ జాగ్రత్త...బాప్ ఏక్ నంబరి...బేటా దస్ నంబరి..జై తెలంగాణ జై జై తెలంగాణ

10, నవంబర్ 2012, శనివారం

పరకాల పరాభవం..షర్మిల పాదయాత్ర !


ఎక్కడయినా ఓడిన వారు తమ ఓటమికి  కారణాలు సమీక్షించుకుంటారు. దాదాపుగా అక్కడి పత్రికలు కూడా అదే పని చేస్తాయి. ఆ ఓడిన వ్యక్తిపై గెలిచిన వ్యక్తి ఏ విధంగా గెలిచాడు అన్న అంశాలను పరిగణనలోకి తీసుకుని విశ్లేషిస్తాయి. కానీ ఇక్కడ మాత్రం అంతా తిరగబడింది. గెలిచిన వ్యక్తి చావు తప్పి కన్నులొట్టబోయి గెలిచాడని.. ఓడిన వ్యక్తి మాత్రం దాదాపు గెలిచినంత పనిచేసిందని...అసలు అన్ని ఓట్లు తెచ్చుకోవడం నిజంగా గొప్ప అని స్థుతిస్తున్నాయి.

నిజంగా ఒక్క తెలంగాణ విషయంలో తప్ప ప్రపంచంలో ఎక్కడా పత్రికలు ఈ విధంగా స్పందిచడం..ఇలా వార్తలు రాయడం జరగదేమో. వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గానికి జరిగిన ఎన్నికలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన మాజీ మంత్రి కొండా సురేఖ టీఆర్ఎస్ అభ్యర్థి మొగులూరి భిక్షపతి చేతిలో స్వల్ప తేడాతో ఓడిపోయింది.  ఈ ఓటమిని కొండా సురేఖ జీర్ణించుకుందేమో గాని సీమాంధ్ర పత్రికలకు మాత్రం ఇంకా జీర్ణంకాలేదు. పరకాల ఓడితే తెలంగాణ చాపను చుట్టేయాలని చూసిన ఆ పత్రికలు ఘోర పరాభవం చెందాయి. దాని నుండి అవి భయటపడడం లేదు.

ఇది జరిగిన చాన్నాళ్ల తరువాత ఇప్పుడు ఎందుకు చర్చ అంటే పరకాల చెల్లెమ్మ పళ్లికిలిస్తుంది. సీమాంధ్ర పత్రికలు మళ్లీ మొరుగుతున్నాయి. తెలంగాణ ను నిండా ముంచిన తండ్రిని స్తుతిస్థూ అన్న జగన్ ను అధికార పీఠం ఎక్కించేందుకు వైఎస్ తనయ షర్మిల తెలంగాణ లో పాదయాత్రకు పరుగు పరుగునా వస్తోంది. ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలు కొడిగడుతున్నా పల్లెత్తు మాట మాట్లాడని వారు ఇప్పుడు అమ్మవారి పాదయాత్ర అడుగులకు మడుగులు వత్తేందుకు సిద్దమవుతున్నారు. తెలంగాణ వాదులు ఎక్కడ పాదయాత్రకు అడ్డుపడుతారోనని సురేఖమ్మ గుండెల్లో గుబులు రేగుతోంది. అందుకే టీఆర్ఎస్ భుజం మీద తుపాకి పెట్టి తెలంగాణ వాదులను హెచ్చరిస్తోంది సురేఖమ్మ. షర్మిలమ్మ పాదయాత్రను అడ్డుకుంటే మా సత్తా చూపిస్తామని.

 జగన్ దండయాత్రను మానుకోట అడ్డుకున్న సంగతి గుర్తుకువచ్చి ఉంటుంది. తుపాకీ కాల్పులను కూడా కంకర రాళ్లతో ఎదుర్కొన్న కరడుగట్టిన తెలంగాణ వాదులు గుర్తుకు వచ్చి ఉంటారు. అందుకే పాదయాత్ర కు ముందే అమ్మ సన్నాహక సమావేశాలు మొదలు పెట్టింది. ‘‘పిల్ల పుట్టక ముందే కుల్ల కుట్టినట్లు’’ పాదయాత్ర ఇంకా తెలంగాణలోకి రాక ముందే ఈ పరేషాన్ ఎందుకు ? మీ వైఖరిలో స్పష్టత ఉంటే అడ్డుకుంటారన్న అనుమానాలెందుకు ? గుమ్మడి కాయల దొంగ అనకముందే భుజాలు పట్టుకోవడమెందుకు ?


ఇక సోకాల్డ్ సీమాంధ్ర పత్రికలు అప్పుడే భజన మొదలు పెట్టాయి తెలంగాణ అంతటా నేతలు జగన్ పార్టీలోకి చేరడానికి దండలు పట్టుకుని రెడీగా ఉన్నారని..పరకాలలో  వచ్చిన ఓట్లు చూసి ఆ పార్టీలో చేరడానికి ఉత్సుకత చూపుతున్నారని రాసేస్తున్నాయి. అధికారంకోసం దండయాత్రలు చేస్తున్న సీమాంధ్ర పార్టీలకు ఎలా బుద్ది చెప్పాలో తెలంగాణకు తెలుసు. ముందు సురేఖ అంగబలం, అర్ధబలాలను అణగదొక్కి పరకాలలో తెలంగాణ జెండా ఎలా ఎగిరిందో ఈ సీమాంద్ర పత్రికలు ఒక్కసారి నెమరు వేసుకుంటే తెలంగాణలో భవిష్యత్ రాజకీయం ఎలా ఉండబోతుందో బోధపడుతుంది. జై తెలంగాణ జై జై తెలంగాణ