31, అక్టోబర్ 2011, సోమవారం

కోమటిరెడ్డి ‘దీక్షాస్త్ర్రం’


తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ మాజీ మంత్రి  కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

మంగళవారం ఉదయం జిల్లా కేంద్రంలో ఆమరణ నిరాహార దీక్షను చేపట్టనున్నారు. నల్గొండలోని క్లాక్‌టవర్‌ సెంటర్‌లో ఆయన చేపట్టనున్న దీక్ష నేపథ్యంలో అవసరమైన ఏర్పాట్లు సోమవారం పూర్తయ్యాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయమై కేంద్ర ప్రభుత్వం సానుకూల ప్రకటన చేయని నేపథ్యంలో కోమటిరెడ్డి తన మంత్రి పదవికి, శాసన సభ్యత్వానికి రాజీనామాలను సమర్పించారు.
కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అక్టోబర్‌ 2వ తేదీ నుంచే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆమరణ దీక్షను కొనసాగిస్తామని ప్రకటించినప్పటికీ సకల జనుల సమ్మె కారణంగా దీక్షను వాయిదా వేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకై రోడ్‌ మ్యాప్‌ను ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తూ ఆమరణ దీక్షకు సిద్ధమయ్యారు. ఈయన దీక్షా కార్యక్రమానికి తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంట్‌ సభ్యులు హాజరు కానున్నారు. కోమటిరెడ్డి దీక్ష నేపథ్యంలో నల్గొండ, మునుగోడు, నకిరేకల్‌తో పాటు జిల్లాలోని వివిధ నియోజకవర్గాల నుంచి సుమారు లక్షల మందికి పైగా పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, తెలంగాణ వాదులు తరలి వచ్చేలా ఆయన అనుచర గణం అవసరమైన చర్యలు తీసుకోవడంలో నిమగ్నమైంది.
నిరాహార దీక్షకు తెలంగాణ జెఎసి, టిఆర్‌ఎస్‌, సుమారు 140కి పైగా ప్రజా, ఉద్యోగ సంఘాల జెఎసిలు ఇప్పటికే మద్దతును ప్రకటించాయి. ఈ దీక్షకు పోలీస్‌ శాఖ పది రోజుల పాటు అనుమతినిచ్చింది.  కోమటిరెడ్డి తన మంత్రి పదవికి రాజీనామాను సమర్పించి ఆమోదింప చేసుకున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన శాసన సభ్యులు జిల్లాలో రెండు వర్గాలుగా చీలిపోయారు. ఆమరణ దీక్షను విరమించుకోవాలని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కోరినప్పటికి కోమటిరెడ్డి పట్టించుకోలేదు.

28, అక్టోబర్ 2011, శుక్రవారం

బాబూ నీది బినామీ బతుకు : కేసీఆర్

చంద్రబాబు నీది బినామీ బతుకు, బినామీలను పెట్టుకుని బతకాల్సిన ఖర్మ నాకు పట్టలేదు.
దోచుకున్న సొమ్ము, దాచుకున్న ఆస్తులు నా దగ్గర లేవు. దమ్ముంటే అవినీతి మీద చర్చకు రా అంటూ టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు టీడీపీ అధినేత  చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. గురువారం టీఆర్‌ఎస్ పై, తనపై చంద్రబాబు చేసిన ఆరోపణలపై ఆయన తీవ్రంగా స్పందించారు.
తాను నమస్తే తెలంగాణ దిన పత్రికలో రూ.4 కోట్లు, టీ న్యూస్‌లో రూ. 55 లక్షలు పెట్టుబడులు పెట్టానని తెలిపారు. ఈ డబ్బంతా మాజీ ఎంపీ వినోద్ తమ్ముని వద్ద అప్పు తీసుకున్నానని స్పష్టంచేశారు. తనకు ఉన్నది 24 ఎకరాల భూమేనని, హైదరాబాద్, కరీంనగర్‌లో ఒక ఇళ్లు మాత్రమే ఉందని తెలిపారు. తాను పెట్టిందంతా పూర్తిగా  వైట్ మనీ అని, నమస్తే తెలంగాణ ఎండీకి తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఆయనకు బయట వ్యాపారాలు ఉంటే ఆయన వ్యక్తిగతమని,  దానికి మేం ఏం చేయాలని  ప్రశ్నించారు. బాబులా నల్లధనంతో పెట్టుబడులు పెట్టలేదని విమర్శించారు.
గత ఐదారు రోజులుగా చంద్రబాబు తొట్టిగ్యాంగ్ కారు కూతలు కూస్తుందని,   చంద్రబాబు ఇంటి పేరు నమ్మక ద్రోహం, ఒంటి పేరు నయవంచన, అసలు పేరు కుంభకోణం అని ధ్వజమెత్తారు.   బాబు  అవినీతిపై పుంకానుపుంఖాలుగా పుస్తకాలు వచ్చాయని చెప్పారు. అడుగుదీసి అడుగెస్తే బాబుది బినామీ బతుకు అని అన్నారు. నమస్తే తెలంగాణ పత్రికను చూసి తెలంగాణకు ఒక పత్రిక ఉండొద్దు, మీ బండారం బయటపడొద్దని కుటిల ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. తెలంగాణ టీడీపీ నేతలు ఆత్మలు అమ్ముకుని బాబు బూటు పాలీష్ చేస్తున్నారని ఆరోపించారు.
యూపీఏలో మంత్రిగా ఉన్నప్పుడు పోలవరంపై సోనియాకు ఫిర్యాదు చేశానని స్పష్టం చేశారు. పోలవరంపై నిరంతరం కొట్లాడేది టీఆర్‌ఎస్ పార్టీ అని తెలిపారు. పోలవరంపై హై కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు వెళ్లాం అని తెలిపారు. టెండర్లు వేసే అలవాటు బాబుకు ఉందన్నారు. చంద్రబాబు ఫోటో పక్కన అన్నాహజారే ఫోటో చూస్తే దయ్యాలు నవ్వుతాయని అన్నారు.

27, అక్టోబర్ 2011, గురువారం

చంద్రబాబు రాజకీయ వ్యభిచారి

కాంగ్రెస్  అన్యాయాలు చేస్తుంటే ప్రతిపక్ష నేతగా ఎందుకు ప్రశ్నించడం లేదని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ను విమర్శిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై టీఆర్‌ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడు నాయిని నర్సింహరెడ్డి విరుచుకుపడ్డారు.
 చంద్రబాబు ముఖ్యమంత్రితో కుమ్మకై తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేసేందుకు కుట్ర పన్నారని విమర్శించారు.  కేసీఆర్‌పై ఆరోపణలు చేస్తే  బాబును తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని చెప్పారు. అవినీతి, అక్రమాలు భయటపడుతాయని రహస్యంగా చిదంబరంను కలిసి బాబు రాజకీయ వ్యభిచారానికి పాల్పడ్డారని అన్నారు. 
చంద్రబాబు ప్రభుత్వ కాలంలో రైతుల అష్టకష్టాలు పడ్డారని, రైతుల నడ్డి విరించింది చంద్రబాబే అని నాయిని ఆరోపించారు. మళ్లీ చంద్రబాబే రైతులపై మొసలి కన్నీరు కార్చడం విడ్డూరమన్నారు. తెలంగాణలో చంద్రబాబు పర్యటిస్తే జరుగబోయే పరిణామాలకు ఆయనే బాధ్యత వహించాలని  హెచ్చరించారు. చందాలు వసూలు చేయకుండా చంద్రబాబు పార్టీని నడుపుతున్నారా అని నాయిని ప్రశ్నించారు.
మరోవైపు చంద్రబాబుకు దమ్ముంటే కేసీఆర్ ఆస్తులపై బహిరంగ చర్చలకు రావాలని టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు జగదీష్‌రెడ్డి సవాల్ విసిరారు. కేసీఆర్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా చర్చకు వస్తారని స్పష్టం చేశారు. తెలంగాణ టీడీపీ నేతలకు దమ్ముంటే బాబును చర్చలకు తీసుకురవాలన్నారు. తామే జూబ్లీ హాల్‌లో సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు. రైతుల వంకతో బాబు తెలంగాణ అడుగుపెట్టాలని చూస్తున్నారని చెప్పారు. మోత్కుపల్లి నర్సింహులు దళిత కార్డు అడ్డం పెట్టుకొని ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పప్పెట్ షో ఆడిస్తుంటే ఒక బ్రోకర్, ఒక జోకర్, ఒక పిట్టల దొరలా ఆడుతున్నారన్నారు.

20, అక్టోబర్ 2011, గురువారం

గొంగట్లో తింటూ వెంట్రుకల గురించా ?

‘గొంగడిలో కూర్చోని తింటూ వెంట్రుకలు వస్తున్నాయి’ అంటే ఎలా ?, ప్రస్తుతం మనం ఉన్నది
పెట్టుబడిదారి వ్యవస్థలోనే, ముందు తెలంగాణ రాష్ట్రం వస్తే సామాజిక తెలంగాణ అనే విషయం గురించి మాట్లాడవచ్చని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ మాదిగకు సూచించారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులు, ప్రజలు మమేకమై పోరాడుతుంటే మందకృష్ణ వ్యవహరిస్తున్న తీరు అభ్యంతరకరంగా ఉందని అన్నారు.
తెలంగాణ కోసం చారిత్రాత్మక ఉద్యమం చేస్తున్న ఉద్యోగులకు అండగా నిలవకుండా మంత్రి జానారెడ్డి సోనియాగాంధీ, ముఖ్యమంత్రి కిరణ్ లతో కుమ్మక్కయి ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.  ఉద్యమం చల్లారిందని సీమాంధ్ర నేతలు హేళన చేస్తుంటే, కేకే వంటి వారు సానుకూల సంకేతాలు అందాయని అవగాహన లేని వ్యాఖ్యలు చేయడంతో ఉద్యమంలో అలజడి నెలకొంటోందన్నారు.
సమయాన్ని బట్టి ఉద్యమ పంథా మార్చాలని పరిస్థితుల దృష్ట్యా ఎత్తుగడలు కూడా మార్చాలని సూచించారు. 2004, 2009లో టీఆర్‌ఎస్‌తో పొత్తుపెట్టుకున్న టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు తెలంగాణ వ్యతిరేకంగా మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు.గ్రామస్థాయిలో ఉద్యమం జరుగుతోంటే రెండో ఎస్సార్సీ గురించి మాట్లాడమడడమంటే ‘పడుకున్న గాడిదను లేపి తన్నించుకోవడమే’ అని అన్నారు.వస్తున్నాయంటే ఎలా? ప్రస్తుతం పెట్టుబడిదారి వ్యవస్థలోనే ఉన్నామని, రాష్ట్రం సాధించుకున్న తర్వాత సామాజిక తెలంగాణపై చర్చించాలి.’ అని సూచించారు.

విచారణకు సోనియాపై పిటీషన్



తెలంగాణ ప్రజలను సోనియా గాంధీ మోసం చేశారని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్‌ను పాటియాలా కోర్టు విచారణకు స్వీకరించింది. హైదరాబాద్‌కు చెందిన అరుణ్‌కుమార్ అనే న్యాయవాది రెండు రోజుల క్రితం పాటియాల కోర్టులో పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ రోజు పిటిషనర్ వాదిస్తూ సాక్ష్యాలను, అమరవీరుల కుటుంబాల తల్లిదండ్రులను కోర్టులో ప్రవేశపెడుతానని తెలిపారు. మొత్తం 14 అభియోగాలతో నమోదైన పిటిషన్‌ను కోర్టు విచారించింది. కేసును నవంబర్ 15కు వాయిదా వేసింది.
ఢిల్లీకి టీఎన్‌జీవో నేతలు ?
తెలంగాణలో జరుగుతున్న సకల జనుల సమ్మెను విరమింపజేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. సమ్మె విరమణ కోసం టీఎన్‌జీవో నేతలను చర్చలకు ఢిల్లీకి తీసుకెళ్లాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. . ప్రధాని, ముఖ్యనేతలతో చర్చలకు ఏర్పాటుచేయాలని యోచిస్తోంది. గతంలో ఉద్యోగ సంఘాలకు ఇచ్చిన హామీని నెరవేర్చుకునేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు తమతో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆహ్వానం అందలేదని తెలంగాణ ఎన్జీవో నేతలు తెలిపారు. ఉద్యోగులపై రైల్వే యాక్ట్ కింద నమోదైన కేసుల వివరాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వివరించినట్లు వారు చెప్పారు. తమని ప్రభుత్వం ఢిల్లీకి తీసుకెళ్తుంది అని వస్తున్న వార్తల గురించి తెలియదు అని ఉద్యోగులు తెలిపారు.
సకల జనుల సమ్మె కొనసాగుతుందని తెలంగాణ ఉద్యోగ సంఘాల నేత స్వామిగౌడ్ తెలిపారు. సమ్మె సందర్భంగా తమ ప్రాంత ఉద్యోగులపై పెట్టిన కేసుల వివరాలను రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి అందజేశామని ఆయన తెలిపారు. ప్రధాన కార్యదర్శి పంకజ్ ద్వివేదితో సమావేశం తర్వాత స్వామిగౌడ్ విలేకరులతో మాట్లాడారు.