కేంద్రం ప్రకటించిన తెలంగాణను అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రోశయ్య అడ్డుకున్నాడా ? తెలంగాణ కొరకు రాష్ట్ర అసేంబ్లీలో తీర్మానం చేసి పంపాలన్న అధిష్టానం సూచనలను పక్కకు పెట్టి తీర్మానం చేయించలేనని తన వ్యూహంలో భాగంగానే అడ్డుకున్నాడా ? ఒకసారి అసేంబ్లీలో తీర్మానం చేస్తే తెలంగాణ ఏర్పాటు అవుతుందని సుధీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న రోశయ్య గ్రహించాడా ? అప్పటికి కేవలం అఖిలపక్ష తీర్మానం చేయించి ఢిల్లీకి పంపిన రోశయ్య డిసెంబరు 9న కేంద్రం తెలంగాణను ప్రకటించగానే సీమాంధ్రలో మొదలయిన ఉద్యమంపై కేంద్రానికి తప్పుడు నివేదికలు పంపి తిరిగి డిసెంబరు 23న తెలంగాణపై కేంద్రం యూ టర్న్ తీసుకునేలా పథకం వేశాడా ?
అవును ..పైన అనుమానించిన ప్రశ్నలన్నీ అక్షరాల నిజం. కావాలని చెప్పాడా ? లేక తనను అసమర్ధునిగా భావించిన రాష్ట్ర ప్రజలకు తాను అపర చాణక్యుడిని అని చాటుకునేందుకు చెప్పాడా ? సీమాంధ్రలో తన ఇమేజ్ ను పెంచేందుకు చెప్పాడా ? అన్న విషయం పక్కన పెడితే తెలంగాణ రాకుండా రోశయ్య వేసిన పాచిక మాత్రం చాలా గట్టిదే. దీనికి తెరవెనుక చంద్రబాబు సహకారం ఉండి ఉంటుందన్న దానిలోనూ ఎలాంటి అనుమానాలు ఉండనక్కర లేదు. అయితే ఇన్ని రోజులకు అప్పుడు జరిగిన విషయాన్ని రోశయ్య ఆంధ్రజ్యోతి ఛానల్ ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’లో వెల్లడించాడు.
తెలంగాణ ప్రత్యేకరాష్ట్రం కోసం 11 రోజులుగా కేసీఆర్ నిరసన దీక్ష చేపట్టడంతో ఎప్పటి నుండో తెలంగాణ ప్రజలు డిమాండ్ చేస్తున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది. అందుకే దీనిని సోనియాగాంధీ జన్మదిన కానుకగా ప్రకటించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రోశయ్యను తీర్మానం చేసి పంపాలని సూచించింది. అయితే అసేంబ్లీలో తీర్మానం ఒక్కసారి చేస్తే ఎప్పటికయినా ముప్పేనని గ్రహించిన రోశయ్య కేవలం అఖిలపక్ష తీర్మానంతో సరిపెట్టారు. తరువాత తెలంగాణ ప్రకటనను వెనక్కి తీసుకునేలా చేశారు.
రాష్ట్రాన్ని విడగొట్టిన ముఖ్యమంత్రిగా, రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రిగా జీవితకాలంలో తనకు సీమాంధ్రలో మచ్చ వస్తుందని, భవిష్యత్ తరాలు తనను ఎలా గౌరవిస్తాయోనని భావించిన రోశయ్య మొత్తానికి గొప్పగానే చక్రం తిప్పాడు. మెల్లగా తాను ఆడిన ‘దొంగాట’ను బయటపెట్టాడు.
తెలంగాణ ప్రజలను మోసంచేసిన రోశయ్య తెలంగాణలో వందలమంది విద్యార్థల ఆత్మహత్యలకు కారకుడయ్యాడు. అప్పట్లో కాసు బ్రహ్మానందరెడ్డి కాల్పులు జరిపించి తెలంగాణ విద్యార్థులను పొట్టన పెట్టుకుంటే రోశయ్య వెన్నుపోటు పొడిచి తన పని కానిచ్చాడు. మోసం చేసేవాన్ని నమ్మొచ్చు కాని నమ్మించి మోసం చేసేవాన్ని అసలు నమ్మొద్దు జాగ్రత్త మిత్రులారా ? తెలంగాణ ఉద్యమంలో రాళ్లుంటాయ్..సీమాంధ్ర ముళ్లుంటాయ్. జై తెలంగాణ జై జై తెలంగాణ