“ప్రధానమంత్రిని, సోనియాగాంధీని కేసీఆర్ దూషించారని, ఆయన మాటలు విని సిగ్గుపడుతున్నామని అంటున్న నేతలు అసలు ఆయన మాటల్లో తప్పేముందో చెప్పాలి. ఉన్న మాట అంటే కాంగ్రెస్ నాయకులు ఎందుకు ఉలికి పడుతున్నారని” టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ప్రశ్నించారు. చప్రాసీకి ఉన్న ఆలోచన ప్రధానికి లేదు అన్నారని దానిలో తప్పేముంది ? అందులో వ్యక్తిగత దూషణ ఏముంది ? అని అన్నారు. ఈ దేశంలోని పౌరులందరూ సమానమేనని, చప్రాసీలంటే కాంగ్రెస్ నేతలకు చులకనా అని హరీష్ రావు ప్రశ్నించారు. కేసీఆర్ మాట్లాడిన మాటలు నాలుగుకోట్ల తెలంగాణ ప్రజల మనసుల్లో మెలుగుతున్నవేనని, షిండే, ఆజాద్ ప్రకటన తెలంగాణ ప్రజల గుండెల్లో మంటపెట్టిందని, అది అనుభవించిన వారికి తెలుస్తుందని ఆయన అన్నారు. సీల్డ్ కవర్ సీఎం అయిన కిరణ్ కేసీఆర్ విమర్శిస్తాడా ? స్థానిక ఎన్నికలు పెట్టే ధైర్యం లేని ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రశ్నిస్తాడా ? దమ్ముంటే మున్సిపత్, పంచాయతీ ఎన్నికలు పెట్టు అని ముఖ్యమంత్రికి సవాల్ విసిరారు.
సోనియాగాంధీ రాచి రంపాన పెడుతుంది అన్నారు అందులో తప్పేముంది అని ప్రశ్నించారు. ఇందిగాంధీ హయాంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి కాల్పులు జరిపి 369 మంది తెలంగాణ బిడ్డలను పొట్టన బెట్టుకున్నాడని అదే విషయం కేసీఆర్ చెప్పారని అన్నారు. కేసీఆర్ ఓ ప్రాంతానికి నేత అని అంటున్న నేతలకు 2004 లో కేసీఆర్ ఇంటికి వచ్చి గులాం నబీ ఆజాద్ పొత్తు ఎందుకు పెట్టుకున్నాడు ? అన్నది గుర్తులేదా ? వెంటిలేటర్ మీద ఉన్న కాంగ్రెస్ కు ప్రాణం పోసింది కేసీఆర్ కాదా అని అన్నారు. ఆ రోజు ఈ చిన్న నేత కేసీఆర్ ఇంటికి ఎందుకు వచ్చారు. ఎందుకు ప్రశ్నించలేదు అని అన్నారు. కేసీఆర్ ఏమయినా కోల్ స్కాంకు పాల్పడ్డాడా ? కామన్వెల్త్ కుంభకోణానికి పాల్పడ్డాడా ? 2జి స్కాంకు పాల్పడ్డాడా ? కేవలం తెలంగాణ ప్రజలకోసం తెలంగాణ అడుగుతున్నాడు. మా హక్కుల గురించి మాట్లాడితే, మా అన్యాయం గురించి మాట్లాడితే మీకు సంస్కారం, సంస్కృతి గుర్తొస్తుందా ? అని ప్రశ్నించారు. కేవలం కేసీఆర్ ను వేధించేందుకు కేసులు అని అంటున్నారని అన్నారు.
తెలంగాణ గురించి రాజీనామా చేయమంటే తెలంగాణ మంత్రులు ముఖ్యమంత్రి చుట్టూ చేరి కేసీఆర్ మీద కేసులకు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. 2009 ఎన్నికల్లో తెలంగాణలో ఎన్నికలు ముగియగానే నంధ్యాల సభలో వైఎస్ తెలంగాణకు వెళ్లాలంటే వీసా కావాలని, పాస్ పోర్ట్ కావాలని వైఎస్ అన్నాడు. ఈ దేశంలో ఉన్న తెలంగాణకు వీసా, పాస్ పోర్ట్ తీసుకువెళ్లాలన్న వైఎస్ ది దేశద్రోహం కాదా ? ఆరోజు వైఎస్ మీద కేసులు ఎందుకు పెట్టలేదు. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ఎందుకు ప్రశ్నించలేదు అని అన్నారు. అయితే ముఖ్యమంత్రి కుట్రలో తెలంగాణ మంత్రులు భాగస్వాములు కావడం దురదృష్టకరమని అన్నారు. కేసీఆర్ మాట్లాడిన మాటల్లో ఎలాంటి తప్పూ లేదని, కేసీఆర్ వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల తరపున మాట్లాడిందని అందులో ఎలాంటి వ్యక్తిగత ఉద్దేశం లేదని అన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి