29, జనవరి 2013, మంగళవారం

సీల్డ్ కవర్ సీఎం కేసీఆర్ ను ప్రశ్నిస్తాడా !


“ప్రధానమంత్రిని, సోనియాగాంధీని కేసీఆర్ దూషించారని, ఆయన మాటలు విని సిగ్గుపడుతున్నామని అంటున్న నేతలు అసలు ఆయన మాటల్లో తప్పేముందో చెప్పాలి. ఉన్న మాట అంటే కాంగ్రెస్ నాయకులు ఎందుకు ఉలికి పడుతున్నారని” టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ప్రశ్నించారు. చప్రాసీకి ఉన్న ఆలోచన ప్రధానికి లేదు అన్నారని దానిలో తప్పేముంది ? అందులో వ్యక్తిగత దూషణ  ఏముంది ? అని అన్నారు. ఈ దేశంలోని పౌరులందరూ సమానమేనని, చప్రాసీలంటే కాంగ్రెస్ నేతలకు చులకనా అని హరీష్ రావు ప్రశ్నించారు. కేసీఆర్ మాట్లాడిన మాటలు నాలుగుకోట్ల తెలంగాణ ప్రజల మనసుల్లో మెలుగుతున్నవేనని, షిండే, ఆజాద్ ప్రకటన తెలంగాణ ప్రజల గుండెల్లో మంటపెట్టిందని, అది అనుభవించిన వారికి తెలుస్తుందని ఆయన అన్నారు. సీల్డ్ కవర్ సీఎం అయిన కిరణ్ కేసీఆర్ విమర్శిస్తాడా ? స్థానిక ఎన్నికలు పెట్టే ధైర్యం లేని ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రశ్నిస్తాడా ? దమ్ముంటే మున్సిపత్, పంచాయతీ ఎన్నికలు పెట్టు అని ముఖ్యమంత్రికి సవాల్ విసిరారు.
సోనియాగాంధీ రాచి రంపాన పెడుతుంది అన్నారు అందులో తప్పేముంది అని ప్రశ్నించారు. ఇందిగాంధీ హయాంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి కాల్పులు జరిపి 369 మంది తెలంగాణ బిడ్డలను పొట్టన బెట్టుకున్నాడని అదే విషయం కేసీఆర్ చెప్పారని అన్నారు. కేసీఆర్ ఓ ప్రాంతానికి నేత అని అంటున్న నేతలకు 2004 లో కేసీఆర్ ఇంటికి వచ్చి గులాం నబీ ఆజాద్ పొత్తు ఎందుకు పెట్టుకున్నాడు ? అన్నది గుర్తులేదా ? వెంటిలేటర్ మీద ఉన్న కాంగ్రెస్ కు ప్రాణం పోసింది కేసీఆర్ కాదా అని అన్నారు. ఆ రోజు ఈ చిన్న నేత కేసీఆర్ ఇంటికి ఎందుకు వచ్చారు. ఎందుకు ప్రశ్నించలేదు అని అన్నారు. కేసీఆర్ ఏమయినా కోల్ స్కాంకు పాల్పడ్డాడా ? కామన్వెల్త్ కుంభకోణానికి పాల్పడ్డాడా ? 2జి స్కాంకు పాల్పడ్డాడా ? కేవలం తెలంగాణ ప్రజలకోసం తెలంగాణ అడుగుతున్నాడు. మా హక్కుల గురించి మాట్లాడితే, మా అన్యాయం గురించి మాట్లాడితే మీకు సంస్కారం, సంస్కృతి గుర్తొస్తుందా ? అని ప్రశ్నించారు. కేవలం కేసీఆర్ ను వేధించేందుకు కేసులు అని అంటున్నారని అన్నారు.
తెలంగాణ గురించి రాజీనామా చేయమంటే తెలంగాణ మంత్రులు ముఖ్యమంత్రి చుట్టూ చేరి కేసీఆర్ మీద కేసులకు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. 2009 ఎన్నికల్లో తెలంగాణలో ఎన్నికలు ముగియగానే నంధ్యాల సభలో వైఎస్ తెలంగాణకు వెళ్లాలంటే వీసా కావాలని, పాస్ పోర్ట్ కావాలని వైఎస్ అన్నాడు. ఈ దేశంలో ఉన్న తెలంగాణకు వీసా, పాస్ పోర్ట్ తీసుకువెళ్లాలన్న వైఎస్ ది దేశద్రోహం కాదా ? ఆరోజు వైఎస్ మీద కేసులు ఎందుకు పెట్టలేదు. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ఎందుకు ప్రశ్నించలేదు అని అన్నారు. అయితే ముఖ్యమంత్రి కుట్రలో తెలంగాణ మంత్రులు భాగస్వాములు కావడం దురదృష్టకరమని అన్నారు. కేసీఆర్ మాట్లాడిన మాటల్లో ఎలాంటి తప్పూ లేదని, కేసీఆర్ వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల తరపున మాట్లాడిందని అందులో ఎలాంటి వ్యక్తిగత ఉద్దేశం లేదని అన్నారు.

4, జనవరి 2013, శుక్రవారం

సీమాంధ్ర మైకులకు పక్షవాతమెందుకో ?


''జనవరి 1 నుండి నా రాజీనామ అమలులో ఉంటుంది. నాకు అప్పటి నుండి కాంగ్రెస్ పార్టీతో గానీ, ఎంపీ పదవితో గానీ ఎలాంటి సంబంధం లేదు. జనవరి నుండి నా రాజీనామా అమలులో ఉంటుంది"

కాంగ్రెస్ ఏలూరు ఎంపీ కావూరి సాంబశివరావు మాట్లాడిన మాటలు ఇవి. కానీ జనవరి 1 వ తేదీ దాటి నాలుగు రోజులు గడిచినా తాను ఇచ్చిన మాటపై కావూరి కనీసం నోరు కూడా తెరవడం లేదు. తెలంగాణ అంటే తొడగొట్టి మాట్లాడే ఈ పెద్ద మనిషికి తాను ఇచ్చిన వాగ్ధానం గురించి తెలియదా ? ఆయన ఎలాగూ స్వార్ధపరుడు వదిలేద్దాం. మరి సీమాంధ్ర ఛానళ్ల మైకులు, సీమాంధ్ర పత్రికల పెన్నులు ఎందుకు మూగబోయాయో అర్ధం కావడం లేదు. వాటికి ఎందుకు పక్షవాతం వచ్చిందో ఎవరికీ అర్ధం కాదు. ఓ ప్రజా ప్రతినిధి ...అందునా ఎంపీ ఓ ఛాలెంజ్ చేశాక..దాని గడువు దాటాక ఇంతవరకు ఈ పత్రికలు ఆ మాటకు ఎందుకు కట్టుబడ లేదని ఎందుకు ప్రశ్నించవు ?

ఇదే తెలంగాణ చెందిన కేసీఆర్ లేక హరీష్ రావు, కేటీఆర్ లేక మరే ఇతర పార్టీల ప్రజా ప్రతినిధులు అయినా ఇలా ఛాలెంజ్ చేసి మాటతప్పితే ఈ సీమాంధ్ర మైకులు ఇలాగే ఊరుకునేవా ? వెంటబడి మరీ వేధించేవి. దానికి సమాధానం చెప్పినా వ్యతిరేక వార్తలు గుప్పించేవి. నిజంగా ఈ సీమాంధ్ర మీడియాకు సిగ్గుంటే తెలంగాణ సమస్య ఇన్నాళ్లు నలుగుతూ వచ్చేదా ? అందుకే మిత్రులారా బివేర్ ఆఫ్ సీమాంధ్ర మీడియా..బివేర్ ఆఫ్ సీమాంధ్ర నేతలు
జై తెలంగాణ ...జై జై తెలంగాణ