తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సమస్య మీద ఈ నెల 28న కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. అయితే వ్యూహాత్మకంగా ఈ సమావేశానికి కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల తరపున ప్రతినిదులు తప్ప పార్టీల రాష్ట్ర అధ్యక్షులు వెల్లడం లేదు. కేవలం దాటవేత ధోరణి రాజకీయ ప్రయోజనాలు తప్ప వీరు వెళ్లకుండా ఉండడానికి ఎలాంటి కారణాలు లేవు.
పాదయాత్ర ప్రారంభానికి ముందు కేంద్రం వెంటనే అఖిలపక్ష సమావేశం పెట్టాలని ప్రధానికి లేఖ రాసిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు కేవలం తమ పార్టీని ఇరుకున్న పెట్టేందుకే కేంద్రం ఈ అఖిలపక్ష సమావేశం పెట్టిందని పిల్లిమొగ్లు వేస్తున్నారు. నిజంగా చంద్రబాబుకు తెలంగాణ సమస్య పరిష్కారం పట్ల చిత్తశుద్ది ఉంటే అఖిలపక్ష సమావేశానికి ఢిల్లీ వెళ్లి అక్కడ పట్టుబట్టి కాంగ్రెస్ అభిప్రాయం చెప్పాలని, తమ పార్టీ అభిప్రాయం చెబుతామని బైఠాయించాలి. అంతేగాని ఇక్కడ ఏదో మాట్లాడితే తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. అఖిలపక్ష సమావేశంలో తెలంగాణకు అనుకూలంగా అభిప్రాయం చెప్పాలని అడిగిన తెలంగాణ జేఏసీ ప్రతినిధులు తెలంగాణకు జై అనాలని కోరితే జై కొట్టని చంద్రబాబు తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవిస్తాడు అనుకోవడం వట్టి భ్రమ.
ఇక పార్లమెంటులో సమైక్య జెండాను ఎత్తుకొని మానుకోట రాళ్ల ఆగ్రహం చవిచూసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా చంద్రబాబు బాటలోనే ఉంది. వీరికి తెలంగాణకు అనుకూలమని చెప్పి ఓట్లు దండుకునే ఆలోచన తప్పితే ఈ సమస్యను తేల్చి చెప్పాలని డిమాండ్ చేసే బాధ్యతను ఏమాత్రం గుర్తించడం లేదు. తెలంగాణలో వైఎస్ పెంచి పోషించిన పెంపుడు గుర్రాలు ఇప్పుడు వీరికి వంత పాడుతున్నాయి. కొంతమందిని అయితే ప్రబావితం చేయగలరు కాని అందరినీ ప్రభావితం చేయలేరన్న సత్యాన్ని వీరు గుర్తించాలి,
ఇక కాంగ్రెస్ పార్టీ ఎంపీలు తప్ప ఎమ్మెల్యేలు, మంత్రులు అస్సలు తెలంగాణ సమస్యను గుర్తించడం లేదు. ఎంత సేపు ముఖ్యమంత్రి తమ నియోజకవర్గాలకు ఇచ్చే నిధులు, తమకు వచ్చే లాభాల ఆలోచన తప్పితే వీరికి మరో ఆలోచన లేదు. ఇప్పటికే కాలం దాటిపోయింది. అదును దాటినంక ఆలోచన చేసినా ఫలితం ఉండదు. రాజకీయ పార్టీలు తెలంగాణ వైపా ? సీమాంధ్ర వైపా ? ఆ పార్టీలకు వంత పాడుతున్న నేతలు ప్రజల పక్షమా ? లేక సీమాంధ్ర పాలకులు విసిరే ఎంగిలి మెతుకుల పక్షమా ? అలోచించుకోవాల్సిన సమయం ఆసన్నమయింది.