తెలంగాణ ప్రత్యేకరాష్ట్రం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అంతర్గతంగా చర్చలు జరుపుతోందా ? ముస్లింలు అధికంగా గల కర్నూలు, అనంతపురం జిల్లాలను తెలంగాణలో కలపాలని ఎంఐఎం పార్టీ పట్టుబడుతుందా ? ఈ నేపథ్యంలోనే కేసీఆర్ తో మంగళవారం ఎఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ భేటీ అయ్యారా ? అవును ఈ ప్రశ్నలన్నింటికీ కేసీఆర్ తో అసదుద్దీన్ ఓవైసీ భేటీ, బుధవారం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు బలం చేకూరుస్తున్నాయి.
గతం నుండి రాయలసీమ నేతలు టీజీ వెంకటేష్, జేసీ దివాకర్ రెడ్డిలు తెలంగాణతో కలిపే రాయలసీమను ఉంచాలని, తాము కోస్తాంధ్ర కలిసి ఉండే ప్రసక్తిలేదని అంటున్నారు. రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలని ఎంఐఎం పార్టీ డిమాండ్ చేస్తోంది. దీంతో పాటు తెలంగాణలో కర్నూలు, అనంతపురం జిల్లాలను కలపడం మూలంగా తెలంగాణకు 147 అసేంబ్లీ స్థానాలు, 21 ఎంపీ స్థానాలు సమంగా ఉంటాయి. దీనినే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుందని తెలుస్తోంది. అయితే ఆంధ్ర ప్రాంతంతో కలిసేందుకు మిగతా సీమ జిల్లాలయిన కడప, చిత్తూరులు సిద్దపడతాయా ? అన్నదే ప్రశ్నార్ధకంగా మారింది. దీంతో పాటు తెలంగాణ జిల్లాల ప్రజలు సీమ జిల్లాలను కలుపుకునేందుకు అంగీకరిస్తారా ? అన్నది ప్రశ్నార్ధకమే. అయితే రాష్ట్రం ఇచ్చే ముందు కేంద్రం తనను చర్చలకు పిలుస్తుందని అన్నారు. తలకాయ తెగిపడినా హైదరాబాద్ లేని తెలంగాణను అంగీకరించబోమని కేసీఆర్ స్పష్టం చేశారు