24, అక్టోబర్ 2013, గురువారం

దూడను చీకమంటడు..బర్రెను..?! సోయి తప్పిన సెంద్రబాబు..!!

ఈ దేశంలో ఇప్పటి వరకు మొత్తం 28 రాష్ట్రాలున్నాయి. ఇప్పుడు 29వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పాటు కాబోతుంది. కానీ ఇంతవరకు ఏ ప్రాంతీయ పార్టీ కూడా రెండు రాష్ట్రాలలో అధికారం దక్కించుకున్న దాఖలాలు లేవు. కాకపోతే మిగతా రాష్ట్రాలలో ఒకటో ..రెండో స్థానాలు దక్కించుకున్నాయి తప్పితే ప్రభావం చూపడం..ప్రతిపక్ష స్థానాన్ని దక్కించుకున్న చరిత్ర కూడా లేదు. కానీ చరిత్రలో చేయని పనులే చేయడం..చరిత్ర హీనుడిగా మిగలడం ఒక్క చంద్రబాబుకు మాత్రమే అలవాటుగా ఉన్నట్లుంది.

ఈ రాష్ట్రానికి తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా, మరో తొమ్మిదేళ్లు
ప్రతిపక్ష నాయకుడిగా చేస్తున్న ఆయనకు రాష్ట్ర విభజన విషయంలో ఓ ఖచ్చితమయిన అభిప్రాయం లేదు. ఎదుటి పార్టీలు విభజనను రాజకీయ అవకాశవాదంగా వాడుకుంటున్నాయి అనే దుగ్ద.. రాష్ట్రాన్ని ఇలా విభజిస్తారా ? ఇక్కడ పెద్ద మనుషులు లేరా ? తెలుగు జాతి మధ్య చిచ్చుపెడతారా ? అని ఆరోపించడం తప్పితే తనయితే ఎలా విభజిస్తాడు ? తనయితే ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తాడు ? అని మాత్రం చెప్పడు. అప్పటికి తానేదో రాజకీయ ప్రయోజనాలకోసం అస్సలు వెంపర్లాడడం లేదు అన్నట్లు మాట్లాడుతున్నాడు.

తెలంగాణ ప్రకటన వచ్చిన తరువాత కూడా తాను సమైక్య వాదిని అన్న వైఎస్ జగన్ కంటే, రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటూ అన్ని ప్రాంతాలను సమానంగా చూడకుండా తెలంగాణకు పచ్చి వ్యతిరేకంగా పనిచేస్తూ నిస్సిగ్గుగా నిధులు దోచుకుపోతున్నకిరణ్ కంటే.. వ్యతిరేకం కాదంటూనే తెలంగాణకు వీలయినంత ఎక్కువ నష్టం చేసే చంద్రబాబునాయుడు, జయప్రకాష్ నారాయణ వంటి వారి మూలంగానే ఎక్కువ నష్టం. తెలంగాణకు వ్యతిరేకం కాదంటూనే సీమాంధ్ర ప్రయోజనాలు, సీమాంధ్ర సమస్యలు బయటపెట్టకుండా, వాటికి పరిష్కారాలు కోరకుండా తెలంగాణ గురించి ప్రకటనలు చేసే దిగ్విజయ్ సింగ్ ను చంద్రబాబు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేత విమర్శలు చేయిస్తాడు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను నిలిపేయాలని పయ్యావుల కేశవ్ తో పిల్ లు వేయిస్తాడు.

వీలయినన్ని ఎక్కువ సమస్యలు సృష్టించేందుకు తన వంధిమాగధులయిన మీడియా యాజమాన్యాల చేత తెలంగాణ విభజన మూలంగా సీమాంధ్రులు కోల్పోతున్న వాటిని భూతద్దంలో పెట్టి చూయించి ప్రచారం చేయిస్తాడు. కానీ తెలంగాణ ఇన్నాళ్లు కోల్పోయిన దాని గురించి మాట్లాడడు. వెయ్యి మంది బలిదానాల గురించి ఒక్క నాడు మాట్లాడని చంద్రబాబు అరవై రోజుల కృత్రిమ ఆందోళనను భూతద్దంలో చూయించే తన తరపు మీడియాతో కలిసి గుండెలు బాదుకుంటాడు. లేని సమైక్య భావనను తట్టి లేపేందుకు ప్రయత్నాలు చేస్తుంటాడు. నంది ఎప్పుడూ పంది కాదు. తెలంగాణ ఉద్యమం నంది లాంటిది..సీమాంధ్ర ఉన్మాదం పంది లాంటిది. చంద్రబాబు నాయుడు లాంటి  నేతలు మన రాష్ట్రంలో ప్రముఖులుగా చెలామణికావడం, జయప్రకాష్ నారాయణ లాంటి వారు మేధావులు అని ఫీలవ్వడం నిజంగా దురదృష్టం.

ఒకవైపు తెలంగాణకు మద్దతు అంటూనే మరో వైపు సీమాంధ్ర గురించి మాట్లాడడం దూడను చీకమనడం..బర్రెను తన్నమనడం సామెతను గుర్తుకుచేస్తుంది. నిజంగా చంద్రబాబు నాయుడు ఇప్పుడు విభజన మూలంగా ఎదురయ్యే సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి నిజాయితీగా పోరాడి సాధించుకునే ప్రయత్నం చేస్తే భవిష్యత్ లో బాబుకు సీమాంధ్రలో మంచి భవిష్యత్ ఉంటుంది. తెలంగాణలో జనం అభిమానం కూడా కాస్త మిగులుతుంది. ఇప్పుడు సమైక్య నినాదం ఎత్తుకుని జగన్ తాత్కాలికంగా లాభపడవచ్చు. కానీ జగన్ కు భవిష్యత్ ఉండదు. చంద్రబాబు కూడా జగన్ దారినే నమ్ముకుంటే నట్టేట్లో మునగడం ఖాయం.

23, అక్టోబర్ 2013, బుధవారం

పిల్ల జమిందార్ .. పిల్లి మొగ్గలు


సమైక్య సభ విజయవంతానికి పిల్ల జమిందార్ వైఎస్ జగన్ అన్ని రకాల ప్రయోగాలు చేస్తున్నాడు. సభ ప్రకటించి
వారం కావస్తున్నా సీమాంధ్ర జనంలో అనుకున్న స్పందన లభించడం లేదని జగన్ బాబు ఆందోళన చెందుతున్నాడు. మందు, వాహనాలు, డబ్బులు ఏమయినా ఇవ్వండి. ఎలాగయినా జనాలను మాత్రం హైదరాబాద్ కు తరలించాలని సీమాంధ్రలోని అన్ని నియోజకవర్గాల ఇంఛార్జ్ లకు టార్గెట్లు పెట్టాడట. ఇక పై-లిన్ తుపాను నేపథ్యంలో విజయనగరం - శ్రీకాకుళం జిల్లాలను ఈ సభ నుండి మినహాయించారు. ఇప్పుడు వాటన్నింటిని వదిలేసి అన్ని జిల్లాలను అందులో చేర్చారు. ఇక పైలిన్ తరువాత ఇప్పుడు అల్పపీడనంతో వర్షాలు కురుస్తుండడంతో అసలు సభ పరిస్థితి ఏంటా అని పికరు చేస్తున్నారట. ఈ నెల 26న జరగనున్న ఈ సభకొరకు ఒక్క విశాఖపట్నం నుండే నాలుగు రైళ్లు ఏర్పాటు చేశారట. మొత్తం అన్ని ప్రాంతాల నుండి ఎనిమిది రైళ్లు అనుకున్నాఇప్పుడు వాటిని రెట్టింపు చేసినట్లు తెలుస్తోంది. ఇంత చేసి ఇతర వాహనాలు పెట్టినా 50 వేల మంది కూడా కావడం లేదట.

ఇలా సభ విజయవంతం చేయడం ఎలా అని మదనపడుతుంటే ఈ వర్షాలు ఇలా అడ్డంకిగా మారడంతో ఎలా చేయాలా ? అని జగన్ కుమిలిపోతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు సంబంధించి కేంద్రంలో వేగంగా ప్రక్రియలు జరిగిపోతుంటే ఈ సభతో ఉన్న ప్రయోజనం ఏంటని ప్రశ్నలు వస్తున్నా ..కిందపడ్డా మీది చేయి నాదే..అన్నట్లు ..తెలంగాణ ఎలాగు వస్తుందని అందరికీ తెలుసు..కాకపోతే సీమాంధ్రలో ఓట్ల మైలేజీ పెంచుకునేందుకు ఈ సభను భారీగా నిర్వహించి ఆకట్టుకోవాలని భావిస్తున్నాడట. ఇక తెలంగాణలో మిగిలిఉన్న కొందరు నేతలను పిలిచి 2014 ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ లోనే జరుగుతాయని, సీమాంధ్రలో ఎలాగూ మనమే గెలుస్తాం కాబట్టి జనాలను తీసుకువస్తే మీకు ఎమ్మెల్సీ పదవులు కట్టబెడతానని ఎరవేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక ఎట్టి పరిస్థితులలోనూ సమైక్య సభను అడ్డుకుంటాం అని ఓయూ జేఏసీ నేతలు హెచ్చరించడంతో అడ్డుకుంటే నరికేస్తాం అంటూ మాజీ ఎమ్మెల్సీ రెహమన్ రెచ్చిపోయాడు. దీంతో లోటస్ పాండ్ లో ఉండి రంకెలు వేయడం కాదు బయటకు వచ్చి చెప్పు ఆ మాటలు అని ఉస్మానియా విద్యార్థులు సవాల్ విసిరారు. మొత్తానికి ఈ సభ నిర్వహణ సీమాంధ్రలో జగన్ కు జీవన్మరణ సమస్యగా మారడంతో అనవసరంగా ఎందుకు రెచ్చిపోయానా అని ఈ పిల్ల జమిందార్ లోపటింట్లో కుమిలిపోతున్నాడని తెలుస్తోంది. రుతుపవనాల సాకుతో ఈ సభ వాయిదా వేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని కూడా తెలుస్తోంది.


తొవ్వ ..అంబటాళ్ల ముచ్చట్లు


- పికరు జేస్తున్న పిల్ల జమిందార్. కిందపడ్డా మీది చెయ్యి నాదే. లేని సమైక్యం కోసం ఆరాటం. సమైక్య సభపై జగన్ ఆందోళన. పైసల గురించి గాదు ప్రజలను పట్టుకరాండ్రి..పార్టీ నేతలకు గట్టిగా ఆదేశాలు ! సాక్షి ఛానల్  మన ఇంటి దొంగలకూ జనాలను తెమ్మని డబ్బుల పంపిణీ ?

 సోయి తప్పిన సెంద్రబాబు. సీమాంధ్ర చుట్టూ ఆత్మగౌరవ యాత్ర. తెలంగాణ విభజనపై. పయ్యావులతో పిటీషన్లు. సోమిరెడ్డితో సెటైర్లు.

- రాష్ట్రాన్ని ముంచెత్తిన తుపాను. పత్తి పంటకు పానగండం.ఎడతెరిపి లేని వర్షం. అల్గు పారుతున్న చెరువులు, కుంటలు.

22, అక్టోబర్ 2013, మంగళవారం

జగన్ సభ.. ఇంటి దొంగల మీద కన్నేయండి

జైలు నుండి వచ్చిన తరువాత మాట దప్పె.. మడ్మదిప్పె బాబు సమైక్యం పేరుతోని పెడ్తున్న ఈడ్కోలు సభకు సీమాంధ్ర నుండి సభకు జనం తీస్కరావాల్నంటే కుదురదని, అంతమంది జనం ఆడ్నుండి రారని తెలిసి తెలంగాణల ఉన్న తన పార్టీ నేతల మీద కన్నేసిండు. సోమవారం అళ్లను పిల్సుకోని సమైక్యసభకు జనాలను తోల్కరమ్మని పురమాయించిండంట. అయితే ఇప్పటికే పార్టీని ఇడ్సిన ప్రముఖ నేతలకు బదులు రెండో తరా నేతలకు ఈ పని అప్పజెప్పిండంట.

ముక్కెంగ మహబూబ్ నగర్ జిల్లా అలంపూర్ పరిధిలోని ఐజ, శాంతినగర్, ఇటిక్యాల, మానవపాడు మండలాలలో, అచ్చంపేట పరిధిలోని అమ్రాబాద్ మండలంలో సీమాంధ్రులు స్థిరపడి ఉన్నారు. ఇక హైదరాబాద్ చుట్టుపక్కల, రంగారెడ్డి జిల్లాలో స్థిరపడ్డవారు. నల్లొండ జిల్లా కోదాడ, హుజూర్ నగర్ ప్రాంతాలలో, నిజామాబాద్, మెదక్ జిల్లాలలో ప్రాజెక్టుల కింద స్థిరపడ్డ సీమాంధ్రులను తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నయి.

ఏ దిక్కూ లేక అక్క మొగుడే దిక్కని జగన్ పంచననే పడిఉన్న తెలంగాణ నాయకులం అని చెప్పుకునే కొందరు నేతలు నలుగురిని తీసుకోని పోయి తెలంగాణల సమైక్యవాదం ఉందనిపించే ప్రయత్నాలు జరుగుతున్నయి. ఇక సీమాంధ్ర మైకులకు తెలంగాణ అంటె ఎంత పేమనో మనందరికి తెల్సిందే. అందుకే ఒక్కడు వోయిన లచ్చమందికి సమానం జెయ్యనీకె సూస్తడు. కాబట్టి తెలంగాణల ఉన్న జగన్ వంధిమాగధులకు జర్రంత మంచిగ నచ్చజెప్పి జనాన్ని కూడగట్టె పనులు మానుకోమని కోరండ్రి. పట్నంల జగన్ సభ పెట్టుకుంటె ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ ఇక్కడి జనాలను తీసుకపోవడమే తప్పు. సీమాంధ్ర నుండి తప్పి కొడితె 25 నుండి 30 వేల మందిని తరలించే పరిస్థితి కనిపించకపోవడంతో ఈ నాటకానికి తెరలేపారు. ఎక్కడికక్కడ ఉన్న తెలంగాణ వాదులు, తెలంగాణ జేఏసీ ఈ మేరకు కార్యాచరణ ప్రణాళిక మొదలు పెడితె బాగుంటుంది.

11, అక్టోబర్ 2013, శుక్రవారం

కేసీఆర్ తెలంగాణ ఉద్యమం నుండి తప్పుకుంటే ?!

తెలంగాణకు అడ్డం కేసీఆర్. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావడం కేసీఆర్ కు ఇష్టం లేదు. తెలంగాణ ఇస్తే కేసీఆర్ కు కలెక్షన్లు కావని భయం. అందుకే సీమాంధ్రులను రెచ్చగొడుతున్నాడు. తద్వార సీమాంధ్రలో ఆందోళనలు పెంచి తెలంగాణ రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాడు. 

డబ్బులు వసూలు చేసుకునేందుకు కేసీఆర్ ఉద్యమం చేస్తున్నాడు ?! 
పదవి రానందుకే కేసీఆర్ తెలంగాణ ఉద్యమం ముందుకు తెచ్చాడు ?!
కేసీఆర్ తెలంగాణ ఉద్యమంతో కోట్లు వెనకేసుకున్నాడు ?!
హైదరాబాద్ లో ఉన్న సీమాంధ్రులు భయపడేలా చేస్తున్నాడు కేసీఆర్ ?!
వారికి భద్రతలేక తెలంగాణ ఇస్తామంటే భయపడుతున్నారు ?!

ఇవి తరచూ సీమాంధ్ర పెట్టుబడిదారులు, తెలంగాణ వ్యతిరేకులు, తెలంగాణలో ఉన్న తెలంగాణ వ్యతిరేకులు, సీమాంధ్ర తొత్తులు, తెలుగుదేశం పార్టీ నేతలు కేసీఆర్ ను ఉద్దేశించి తరచూ చేసే వ్యాఖ్యలు ఇవి. అసలు తెలంగాణ ఉద్యమాన్ని ఇంతవరకూ తీసుకువచ్చింది కేసీఆర్. కేవలం ప్రజాస్వామ్య పద్దతిలో పార్లమెంటరీ రాజకీయ వ్యవస్థ ద్వారానే తెలంగాణ రాష్ట్రం సాధ్యం అని ఆచార్య జయశంకర్ చూపిన మార్గంలో సాగిపోయారు. పార్టీ మొదలు పెట్టిన నాడే ఆయన "రాజీలేని పోరాటమే విజయం సాధిస్తుంది..తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుంది"...సీమాంధ్రులకు భరోసా కోసం.. మీ కాలికి ముల్లు గుచ్చితే నా పంటితో తీస్తా అని అభయం ఇచ్చాడు కేసీఆర్. బతకనీకె వచ్చినోళ్లతో మాకు బాధలేదు...దోచుకోనికె వచ్చినోళ్లతోనే పంచాయితీ. అని ఇలా చాలా విషయాలలో కేసీఆర్ మొదటి నుండి చాలా క్లియర్ గా తెలంగాణ ఉద్యమ ఉద్దేశాలను తేల్చిచెప్పారు.

ఈ క్రమంలో ఎంపీగా ఎన్నికయిన కేసీఆర్ 2004లో కేంద్రంలో మంత్రి పదవి చేపట్టారు. దానికి రాజీనామా చేశారు. ఆ తరువాత మళ్లీ తెలంగాణ కోసం రెండు సార్లు రాజీనామా చేసి గెలిచారు. తెలంగాణ ఉద్యమాన్ని భూస్థాపితం చేయడానికి వైఎస్ చేయని కుట్ర లేదు. 10 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనేసి కేసీఆర్ మానసిక స్థైర్యం మీద దెబ్బకొట్టే ప్రయత్నం  చేశాడు. ఆ తరువాత ఉప ఎన్నికల్లో తెలంగాణ కొరకు రాజీనామా చేసిన వారిని గెలవనీయకుండా చేసి ఉద్యమం లేదనే పరిస్థితిని తీసుకువచ్చే ప్రయత్నం చేశాడు. ఇక 2009 ఎన్నికల్లో తెలంగాణకు పోవాలంటే పాస్ పోర్ట్ అని తన మనసులో ఉన్న విషాన్ని కక్కేశాడు. 

2004లో అధికారంకోసం వైఎస్ టీఆర్ఎస్ పంచనజేరి అధికారం వచ్చాక తెలంగాణ ఉద్యమాన్ని కనుమరుగు చేయడానికి ప్రయత్నిస్తే..2009లో అదే అధికారం కొరకు టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుని తెలంగాణకు మద్దతు పలికిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తన రాజగురువు రామోజీరావు, ఈనాడు పత్రిక సూచనతో అధికారం ఖాయం అని భావించి టీఆర్ఎస్ ను పురిట్లోనే ముంచేందుకు విఫలయత్నం చేశాడు. 46 స్థానాలలో టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు 36 స్థానాలలో పొత్తు ధర్మానికి వ్యతిరేకంగా తన పార్టీ నేతలకు బీ ఫాం లు ఇచ్చి నంగనాచి కబుర్లు చెప్పాడు. చంద్రబాబు ఎంత మోసగాడో ఇది ఓ పెద్ద ఉదాహరణ. 

బాబు మోసంతో టీఆర్ఎస్ భారీగా నష్టపోవడం, ఆ తరువాత కొన్నాళ్లకే వైఎస్ మరణం పక్కనబెడితే కేసీఆర్ వెంటనే తెలంగాణ కొరకు తీసుకున్న ఆమరణ దీక్ష మూలంగా తెలంగాణ ఉద్యమం తీవ్రరూపం తీసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణకు డిసెంబరు 7, 2009న మద్దతు ఇచ్చిన తెలుగుదేశం, ప్రజారాజ్యం పార్టీలు డిసెంబరు 10, 2009న అంటే కేవలం మూడురోజులకే పిల్లిమొగ్గలు వేశారు. కేంద్రం తెలంగాన ప్రకటించగానే చంద్రబాబు ఇంత పెద్దనిర్ణయం ఎవరికీ
చెప్పకుండా ఎలా తీసుకుంటారు అని ప్రశ్నించారు. ఇక చిన్నజీవి చిరంజీవి సమైక్య నినాదం ఎత్తుకున్నాడు. ఇక అప్పటి నుండి తెలంగాణల తెలుగుదేశం జెండా ఎక్కడికక్కడ పీకుకుంటూ వస్తున్నా ఇంకా బానిస భావాలు పోని నేతలు చంద్రబాబును నమ్ముకుంటూ వస్తున్నారు. 2009 తరువాత తెలంగాణ ఉద్యమం, విద్యార్థులు, తెలంగాణ కొరకు ఆత్మబలిదానాలు చేసుకున్నవారు ఇలా అడుగు అడుగునా కేసీఆర్ అందరికీ అండగా నిలిచారు.

కేసీఆర్ నే టార్గెట్ చేసి నిత్యం విమర్శించే తెలంగాణ వ్యతిరేక బ్యాచ్ ఎన్నడూ తెలంగాణ కొరకు పోరాడింది లేదు. ఓ లాఠీదెబ్బ తిన్నది లేదు..తూటాలను అడ్డుకున్నది లేదు. సీమాంధ్ర పెట్టుబడిదారుల తొత్తులు అయిన ఈ బ్యాచ్ ల ఉద్దేశం అంతా ఒక్కటే కేసీఆర్ మీద ఆరోపణల బురద చల్లి తెలంగాణ జనం కేసీఆర్ ను నమ్మకుండా చేయడం.. తద్వారా తెలంగాణ ఉద్యమాన్ని కనుమరుగు చేయడం. 

ఆరు దశాబ్దాల తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కల ఒక్క అడుగుదూరంలో ఉన్న ప్రస్తుత పరిస్థితులలో కూడా కేసీఆర్ మీద విమర్శలు మానడం లేదు. కేసీఆర్ కొన్ని సార్లు కొన్ని తప్పులు చేసి ఉండొచ్చు. కానీ ఆయిన చేసిన దానికి..జరిగిన ప్రచారానికి ఏ మాత్రం పొంతన లేదు. సీమాంధ్ర పత్రికలన్నీ ఎవడు ఎప్పుడు కేసీఆర్ మీద బురదజల్లుతాడా అన్నట్లు ఎదురు చూసిన సంధర్భాలు ఉన్నాయి. అసలు కేసీఆర్ తెలంగాణ ఉద్యమానికి దూరంగా ఉంటె ? ఒకవేళ కేసీఆర్ తెలంగాణ ఉద్యమం నుండి తప్పుకుంటే ? ఈ విమర్శకులంతా తెలంగాణ ఉద్యమాన్ని నెలరోజుల్లో చాపచుట్టి..అసలు తెలంగాణ ఉద్యమం అనేదే ఈ ఆంధ్రప్రదేశ్ లో జరగలేదు. కేసీఆర్ అనే మనిషే ఈ రాష్ట్రంలో లేడు. అని సీమాంధ్ర పత్రికలతో పాఠ్యపుస్తకాలు రచించి ప్రచారం చేయగల సమర్ధులు. ఇది నూటికి వెయ్యిశాతం వాస్తవం. అవునా ? కాదా ?
 



10, అక్టోబర్ 2013, గురువారం

చంద్రబాబుకు ఢిల్లీల ఏం పని ..టీడీపీకి టీ నేతలు విడాకులివ్వాలి

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కల సాకారమయ్యే సమయం దగ్గరకొస్తున్న వేళ..అమరుల త్యాగాలు ఫలిస్తున్న వేళ
సీమాంధ్ర రాబందులు ఒక్కటవుతున్నాయి. భిన్న స్వరాలు వినిపించిన దోపిడీ ముఠాలు..దోపిడీ కోటలు కూలే సమయం వచ్చే సరికి భుజాలు తడుముకుంటున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు మోడీ ఆంధ్రప్రదేశ్ కు వస్తానంటే అనుమతివ్వని చంద్రబాబు..మోడీని సాకుగా చూపి ఎన్జీఏకు మద్దతు ఉపసంహరించుకున్న చంద్రబాబు నిస్సిగ్గుగా ఇప్పుడు తెలంగాణను అడ్డుకునేందుకు మోడీ చుట్టూ తిరుగుతున్నాడు. ఆయనతో గడిపిన క్షణాలను తెలుగు, జాతీయ మీడియాలో భారీ ప్రచారం చేసుకునేందుకు తహతహలాడుతున్నాడు.

తెలంగాణ ఖాయమనుకున్న పరిస్థితుల్లో తెలంగాణకు పూర్తి అండగా ఉన్న బీజేపీని వెనక్కి లాగేందుకు ఢిల్లీలో దీక్ష నాటకం మొదలు పెట్టాడు. తెలుగుజాతి పేరు జెప్పి తెలంగాణను అడ్డుకునే కుట్రలకు తెరలేపాడు. గతంలో తెలంగాణను అడ్డుకున్నది నేనే అని సిగ్గువిడిచి చెప్పిన చంద్రబాబు ఇప్పుడు అదే ప్రయత్నంలో ఉన్నాడు. గతంలో బాబుకు సహకరించిన వెంకయ్యనాయుడు ఇప్పుడు మళ్లీ అదే ప్రయత్నాలలో బిజీగా గడుపుతున్నాడు. మొన్నటిదాక తెలంగాణ అన్న ఆయన ఇప్పుడు సీమాంధ్ర సమస్యలను పరిష్కరించిన తరవాతనే తెలంగాణ అని చంద్రబాబు నినాదం ఎత్తుకున్నాడు.

అవకాశం దొరికితే తెలంగాణనే రాకుండా చేయడం..అంతవరకు సాధ్యం కాకుంటే  హైదరాబాద్ ను తెలంగాణకు కాకుండా చేయడం ప్రధాన లక్ష్యంగా చంద్రబాబు కార్యాచరణ కొనసాగుతుంది. ఇంత జరుగుతున్నా తెలంగాణ తెలుగుదేశం నేతలు మానం ..అభిమానం వదిలేసి చంద్రబాబు చుట్టూ గింగిరాలు కొడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో మోడీకి మద్దతు, సీమాంధ్ర ఎంపీలతో సహకరించేలా చేస్తాం అని బీజేపీ అధిష్టానానికి ఆశపెట్టి వచ్చే శీతాకాల సమావేశాలలో పార్లమెంటులో తెలంగాణ బిల్లు ఆమోదం పొందకుండా చేసేలా పథకం రచిస్తున్నారు.

ఢిల్లీ కేంద్రంగా దీక్ష నాటకం మొదలు పెట్టిన చంద్రబాబు ఇతర రాష్ట్రాల పార్టీలకు ఇంతకుముందు తనకు ఉన్న పరిచయాలతో తన బలం ఇదని బీజేపీకి ప్రదర్శిస్తున్నాడు చంద్రబాబు. 2009లో రాజీనామాల డ్రామాతో తెలంగాణను అడ్డుకుని వెయ్యిమంది బలిదానాలకు కారణం అయిన చంద్రబాబు ఇప్పుడు కూడా అదే ప్రయత్నాలలో ఉన్నాడు. తెలంగాణ సమాజం ఈ కుట్రలను అడ్డుకునేందుకు సిద్దం కావాలి. తెలంగాణ వస్తున్న తరుణంలో నోటికాడి కూడా జారిపోకుండా చూసుకోవాలి. చంద్రబాబుతో బహిరంగంగా ఇంతవరకు జై తెలంగాణ అనిపించలేని తెలుగుదేశం నేతలు ఆ పార్టీలో ఉండి ఏం సాధిస్తారు.  తెలంగాణలో తెలుగుదేశం పార్టీ నేతలను నిలదీయండి. చంద్రబాబు దీక్ష సీమాంధ్ర సమస్యల పరిష్కారం కోసమే అయితే.."తెలంగాణ ఇవ్వండి..సీమాంధ్ర సమస్యలు పరిష్కరించండి" అనే నినాదంతో దీక్ష కొనసాగించమని డిమాండ్ చేయండి. లేకపోతే తెలుగుదేశం పార్టీకి తెలంగాణ నేతలు విడాకులివ్వాలి. తెలంగాణల ఆ పార్టీని భూస్థాపితం చెయ్యాలి.


8, అక్టోబర్ 2013, మంగళవారం

తెలంగాణ వాదులకు హెచ్చరిక..విజ్ఞప్తి !

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు జరిగిపోయిందని, అరవై ఏళ్ల ఆకాంక్షను కాంగ్రెస్ నెరవేర్చిందని సంబరాల్లో ఉన్న

తెలంగాణ వాదులకు హెచ్చరికతో కూడిన విజ్ఞప్తి. కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం లేదు. సీమాంద్ర పెట్టుబడిదారులతో, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో జరిగిన ఒప్పందం మేరకు తొమ్మిది జిల్లాల తెలంగాణను ఇచ్చి..హైదరాబాద్ ను ఢిల్లీ తరహా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయబోతున్నారు. తెలంగాణకు సంబంధించి క్యాబినెట్ నోట్ లో లేని అంశాలు ఇవి. తెలంగాణ వాదులు ఇప్పుడే తిరగబడి ఈ కుట్రను అడ్డుకోకుంటే మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చినా ఎలాంటి ప్రయోజనం ఉండదు.

అత్యున్నత స్థాయిలో బహిరంగ రహస్యంగా ఉన్న ఈ ఒప్పందంలోని ముఖ్యాంశాలు ఇవిగా తెలుస్తున్నాయి

- హైదరాబాద్ ను ఢిల్లీ తరహా ప్రత్యేక రాష్ట్రం చేయడం.
- 40 మంది ఎమ్మెల్యేలతో ప్రత్యేక రాష్ట్రం. కేంద్రం చేతిలో రక్షణ బాధ్యతలు.
- హెచ్ ఎం డీ ఎ పరిధి అంతా ఈ రాష్ట్రం పరిధిలోకి వస్తాయి.
- ముఖ్యమంత్రి పదవి వరించే అవకాశం ఉంది కాబట్టి ఎంఐఎం నుండి అభ్యంతరం లేదు.
- సీమాంధ్ర పెట్టుబడిదారుల ఆస్తుల అక్రమాలు బయటపడకుండా ఉన్నతస్థాయిలో జరిగిన ఒప్పందం.
- తెలంగాణ వచ్చినా సీమాంధ్ర పెట్టుబడిదారులకు ఎలాంటి భయం అక్కర్లేదు.
- తెలంగాణ ఇచ్చినా సరే హైదరాబాద్ మా పరిధిలో ఉంచాలని వచ్చిన డిమాండ్ మేరకు కాంగ్రెస్ అభయహస్తం.
- హైదరాబాద్ లో భారీ అక్రమాలతో, ప్రభుత్వ అండతో ఆస్తులు కూడగట్టుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, లగడపాటి రాజగోపాల్, కావూరి సాంబశివరావు, రాయపాటి సాంబశివరావు, రాజగురువు రామోజీరావు, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, చిరంజీవి ఇలా ఇతర సీమాంధ్ర పెద్దలుగా చలామణి అవుతున్న..ఆక్రమణ దారులు, భూకబ్జా దారులు అంతా కూడబలుక్కుని కేంద్రంతో రాసుకున్న ఒప్పందం ఇది.
- హైదరాబాద్ లో జగన్ దీక్ష అంతా కాంగ్రెస్ స్కెచ్..ఢిల్లీలో చంద్రబాబు దీక్ష కూడా కాంగ్రెస్ స్కెచ్
- హైదరాబాద్ తో కూడిన తెలంగాణకే తమ మద్దతు అని బీజేపీ చెప్పిన నేపథ్యంలో హైదరాబాద్ ప్రత్యేక రాష్ట్రంకోసం బీజేపీని ఒప్పించేందుకే గత కొన్నాళ్లుగా చంద్రబాబు ఢిల్లీకి తీర్ధయాత్రలు చేస్తున్నారు. తాజా దీక్ష కూడా దాని కోసమే.
- సీమాంధ్రలో ఆందోళనలు, అల్లర్లు అన్నీకాంగ్రెస్ కనుసన్నల్లో జరుగుతున్నవే.
- ముఖ్యమంత్రి గాండ్రింపులు, అధిష్టానం వ్యతిరేక వ్యాఖ్యలు కూడా కాంగ్రెస్ కనుసన్నల్లో జరుగుతున్నవే.
- దిగ్విజయ్ సింగ్ పదవి మాత్రం శాశ్వతమా..అధిష్టానమే నిర్ణయం మార్చుకోవాలి అని ముఖ్యమంత్రి గట్టిగా మాట్లాడడం ఒప్పందంలో భాగమే. ఇంత అన్నా కాంగ్రెస్ ఇంతవరకు ఏమీ అనలేదు. ముఖ్యమంత్రిని కూడా మార్చం అని గట్టిగా చెబుతోంది. ఇక ముఖ్యమంత్రి మీద డీజీపీ వ్యాఖ్యలు చేస్తే ఏకంగా డిగ్గీరాజా లైన్లోకి వచ్చాడు అంటే కాంగ్రెస్ వ్యవహారం అర్ధం చేసుకోవచ్చు.
- మీడియా వర్గాలలో, మీడియా యాజమాన్యాలలో ఈ వార్త ఇప్పటికే చక్కర్లు కొడుతోంది. కానీ ఎవ్వరూ దీనిని ఓ వార్తగా చూడడం లేదు. ఎందుకంటే తెలంగాణలో వ్యతిరేకత ఇప్పుడే వస్తుందని కావొచ్చు ? లేదా భవిష్యత్ కార్యాచరణ ఇప్పటి నుండే మొదలు పెడతారన్న అనుమానం కావచ్చు ?
- ఏదీ ఏమయినా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇస్తామన్న ప్రకటన ఎంత నిజమో..సీమాంధ్ర పెట్టుబడిదారుల ప్రయోజనాలను కాపాడేందుకు హైదరాబాద్ ప్రత్యేక రాష్ట్రం చేస్తారన్నది కూడా అంతే నిజం అని తెలుస్తోంది. తెలంగాణ వాదులు ఇప్పుడే మేల్కొని కాంగ్రెస్ నేతల మీద గట్టిగా పోరాడకుంటే తెలంగాణ ఇచ్చినా ఒకటే..ఇవ్వకపోయినా ఒకటే.