29, సెప్టెంబర్ 2013, ఆదివారం

సకల జనభేరి with నారన్



సరిగ్గా 22 దినాల కింద ఐద్రవాద్ ల సమైక్య సభ. ఒకడు గొంతు గోస్తన్నడు..ఇంకొంతమంది సమైక్యం అంటు తెలంగాణ అన్న బాల్ రాజ్ మీద దాడి జేసిండ్రు. 50 వేల మంది ఉన్న సమైక్యసభల తెలంగాణ అన్నందుకు చంద్రశేఖర్ (చేగో) మీద దాడి చేశారు. ఖబడ్దార్ అన్న కానిస్టేబుల్ శ్రీను, శ్రీశైలంల మీద దారుణంగా దాడిచేశారు. అసలేం జరుగుతుంది ఐద్రవాద్ ల. తెలంగాణ గడ్డమీద తెలంగాణ వాదుల మీద దాడి. మనగడ్డపై మన అస్తిత్వం కొరకు ఆరాటం. బుర్ర ఖరాబయింది. పానం దిగులువడ్డది. తెలంగాణ స్వేఛ్చా వాయువులు పీల్చేకునే వేల సీమాంధ్ర పెట్టుబడి దారి రాబందులు విషం చిమ్ముతున్నాయి. అసలు ఐద్రవాద్ ల మనకు తిరిగే హక్కే లేదా అన్న అనుమానం.

ఇంతట్లనే సకల జనభేరి. సభకు ఎట్లనన్న పోవాలె.  అట్లనే జయశంకర్ సార్ విగ్రహం తయారయింది తెచ్చుకోవాలె అని అనుకున్న. ఆదివారం పొద్దుగాళ్ల బామ్మర్ధి నారన్ రెడ్డి కలిసి పట్నం ప్రయాణం. నేరుగా రాజేంద్రనగర్ శివరామాచారి స్టూడియో. అక్కడ్నే బిక్ష చేసుకుని జయశంకర్ సార్ విగ్రహం తీసుకుని సకల జనభేరి సభకు బాటవట్టినం. జయశంకర్ సార్ మరణించినప్పుడు ఆయన దినాల నాడు విగ్రహం పెట్టాలె అనుకున్నం. అప్పటికి విగ్రహం పూర్తికావడానికి ఇబ్బంది ఉండె. అట్లనే వాయిదా పడుతూ వస్తుంది. ఓ మంచి సమయం కావాలని చూస్తున్న తెలంగాణ ప్రకటన వచ్చింది. జయశంకర్ సార్ కలలుగన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటయిన రోజున


ఆయన విగ్రహం మా ఊళ్ల పెట్టాలని ఆలోచన.

రాజేంద్ర నగర్ నుండి బహదూర్ పుర, సిటీ కాలేజ్, అఫ్జల్ గంజ్, ఉస్మానియా ఆసుపత్రి, బేగం బజార్, మొజాంజాహి మార్కెట్, అబిడ్స్, నాంపల్లి కలెక్టరేట్ మీదంగ ముందలికి పోయి వాహనం దిగినం. జనం పల్చగ కనిపిస్తున్నరు. నారన్ కు నాకు బుగులు తీసుకున్నది. జనం కనిపిస్తలేరని. సభకు జయశంకర్ సార్ విగ్రహం తీసుకుపోవాల్నా ? వద్దా ? అక్కడికి తీసుకెళ్తే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్..ప్రచారం తప్ప ఇంకేమీ ఉండదని వాహనంలనే పెట్టినం. నిజాంకాలేజి దగ్గరయితుంటె జనం కనిపించవట్టిండ్రు. మనసుల మెల్లగ సంతోషం మొదలయింది.  (మధ్యాహ్నం 3.30) వీఐపీ గేటుకాడ లోపల్కి తోలాలె అని పోలీసోల్ల తోని తెలంగాణ వాదుల పంచాయితి. మెల్లగా ముందుకు


పోయి గోడ దుంకి లోపలికి పోయినం. ఆ తరువాత ఇంకో గోడ దూకి నిజాం కళాశాల జనసంద్రంలోకి పోయినం. అయినా కూడా జనం తక్కువనే ఉన్నరని మైదానంల తిరిగిన. ఆ మూలకు పోయి ఈ మూలకు వచ్చెటాలకు బయిటికి పోనికె జాగలేదు. లాభం లేదని మల్ల గేటు దుంకి నిజాం కాలేజీ వీఐపీ గేటు దిక్కు పోయినం. సభకు వచ్చినం గానీ ఫోటోలు తీసుకోనికే కెమెరా లేదు. అంతట్లనే ఓ తెలంగాణవాది(సిద్దిపేట)ని అడిగి ఇద్దరం ఓ ఫోటో దిగి మెయిల్ పెట్టమని అడిగనం.

ఇక అక్కడి నుండి మీదకొస్తే తెలంగాణ రేడియో జాకీల హంగామా, కరపత్రాల పంపిణీ, ఆ పక్కనే సమైక్యవాదులను ప్రశ్నించిన చంద్రశేఖర్ ( చేగో) ఫ్లెక్సీ. అటు ఇటు తిరుగుతుంటె తెలంగాణ ఫేస్ బుక్ టీ షర్ట్ వేసుకున్న వ్యక్తి కనిపించాడు. పరిచయం చేసుకుంటే నర్సింహ..పీహెచ్ డీ చేస్తున్నానని చెప్పాడు. ఒక్క ఫోటో తీసి మెయిల్ పెట్టమన్నా..తీశాడు. ఆడ్నుంచి మెల్లగ నిజాం కాలేజీ బయటకు వచ్చి వీఐపీ గేటు ముందల నిలవడ్డం. రోడ్డు దాటి ఎల్బీస్టేడియం దిక్కువోతె ఎమ్మార్పీఎస్ సభ్యులు భారీ ఎత్తున తప్పెట్లతోని ఉర్రికొస్తుండ్రు. మనసుల సెప్పలేనంత సంతోషం. ఎగిరి గంతేయాలన్నంత ఉత్సాహం. ఒకరి మొఖాలు ఒకరం సూసి నిండుగా నవ్వుకున్నం. ఆ పక్కనే ఒంటెల మీద యాత్ర. వెనక భారీ డీజే. వందలకొదీ యువకులు తెలంగాణ నినాదాలతో డాన్సులు.

వ్యవసాయశాఖ కమీషనర్ కార్యాలయం ముందుకుపోయినం. నలుగురు చిన్నపిల్లలు. వాళ్ల తండ్రులు. ఇతరులు. మొత్తం పదిమంది దాంక ఉంటరు. హైదరాబాద్ లో పనిచేసే ఉద్యోగులు అని ..పక్కా హైదరాబాదీలని అర్ధం అవుతుంది. నోట్లో పాన్..హైదరాబాద్ యాస..ఆంధ్రా ఉద్యోగుల వివక్షను ..అవహేళనను  అనుభవించారని అర్ధం అవుతుంది. జోరుగా...దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు చేస్తున్నారు.

పిఠాపురం మీదిరా..హైదరాబాద్ మాదిరా


పెద్దాపురం మీదిరా హైదరాబాద్ మాదిరా
బాడ్కవ్ ల బాడ్కవ్ సీఎం బాడ్కవ్
లుచ్చామె లుచ్చా సీఎం లుచ్చా
అబీ అబీ క్యా హోగయా ..అశోక్ బాబు మర్గయా

జర్ర ఇటు పక్క దిర్గంగనే..డీజేల తెలంగాణ పాట రీమిక్స్

అయ్యోనివా ..అయ్యోనివా...అయ్యోనివా
అయ్యోనివా.. నువ్వు అవ్వోనివా ..తెలంగాణోనికి తోటి పాలొనివా
ఇస్సుంట రమ్మంటే ఇల్లంత నాదంటవా
తిన్నింటి వాసాలు లెక్కెడ్తవ

రాజిగ వొరె..రాజిగ వొరె..రాజిగ వొరె..
రాజిగ వొరె..రాజిగ తెలంగాణ రాజిగ
గజ్జెలు గజ్జెలు రెండు గజ్జలో రాజన్న
సేను వాయె సెలుక వాయె గజ్జెలో రాజన్న

కడపునిండ సంతోషం
తల్లికడుపుల కలియతిరుగుతున్న ఆనందం
వాగు ఉష్కెల దొమ్మరిగంతేసింత ఆనందం
ఆడ్నుంచి మల్ల నిజాం కాలేజీలకు పరుగు. సభ వెనుక వైపుకు.
సాక్షిల పనిచేసే పాత్రికేయమిత్రుడు వర్దెల్లి వెంకటేశ్వర్లు చాలా రోజుల తరువాత కలిశాడు.
సాధక, బాధకాలు..క్షేమ సమాచారాలు తెలుసుకున్నంక
సభ కుడివైపుకు వెళ్లాం. కోదండరాం సార్ ప్రసంగం

తెలంగాణ అంటే న్యాయం
తెలంగాణ అంటే స్వేఛ్చ

మా తెలంగాణ మాకొచ్చె సమయంల కుట్రలు చేయడం మానుకోండి
కాంగ్రెస్ పార్టీ నాన్చుడు దోరణి మానుకుని రెండు ప్రాంతాల మధ్యల విధ్వేశాలు రేగకముందే
తెలంగాణ ఏర్పాటు కార్యక్రమం పూర్తి చేయండి
మా మంచితనం చేతగాని తనం అనుకోవద్దు

ఆ వెంటనే దేశపతి శ్రీనివాస్

సమైక్యాంధ్రోళ్లకు తెలంగాణ గాదు హైద్రవాద్ గావాలే
ఈడ రింగురోడ్డు సుట్టు ఆళ్ల భూములు గావాలే..జూబ్లిహిల్స్, బంజారాహిల్స్ ల ఆస్తులు గావాలె
మీకు పాతబస్తీ వద్దు..అడ్డగుట్ట వద్దు..వారాసిగూడ మురికి వద్దు

ఒక తలపై రూమీ టోపి ..ఒక తలపై గాంధీ టోపి
క్యాభాయ్ అని అటాడొకడు.. ఏమోయని అటాడొకడు
కులాలు మతాలు వేరయినా మనమంతా భాయి భాయి
రిమ్ జిమ్ హైదరబాద్..రిక్షావాలా జిందాబాద్

ఆ తరువాత కేసీఆర్


తెలంగాణ ఏనుగులాక ..అంతా అయిపోయింది. తోక ఒక్క ఒక్కటె ఇర్కవట్టింది.
దీన్ని ఎంతమంది ఏకమయినా ఆపలేరు.. ఏమీ పీకలేరు
ఆంధ్రబాబు సెంద్రబాబు టర్నింగులెన్ని ? జగన్ పార్టీ సమన్యాయం ఏంది ?
న్యాయమే లేదురా అంటే సమన్యాయం ఏంది ?
ఆరిపోయే దీపానికి ఎల్తురెక్కువ..కిరణ్ పరిస్థితి గుడ గంతె
నాకు దెల్సిన లెక్క పకారం ఆరు తారీకున అవుట్
ఇగ డీజీపీ పీజులు హైకోర్టు కట్ జేసింది

ప్రసంగం కొనసాగుతుండంగనే మెల్లగ బయటకు వచ్చినం
నిజాం కళాశాల వీఐపీ గేటు ముందు రాత్రి (8.30) రోడ్డు మీద కూసోని
స్క్రీన్ మీద కేసీఆర్ ప్రసగం వినుకుంట జనం భారీ గా ఉన్నరు.
మెల్లగ బండి కాడికొయ్యి ఇంటికొచ్చేటాల్లకు రాత్రి 11.30